Saturday, January 31, 2009

నా బ్లాగు పేరు తో సినిమా కూడా ఉందండోయ్!

బి వి రామానందం & ఆనందా పిక్తర్స్ వారి వరూధిని ప్రకటనా పత్రం!
ఇవ్వాళ కూడలి బ్రౌస్ చేస్తుంటే వరూధిని అన్న పేరుతో సినిమా కూడా ఉన్నట్టు తెలిసింది. తెలిపినవారు నవతరంగం వారు! వారి చలువ చే వరూధిని చిత్రం ఫోటో పెట్టాను ! వీక్షించగలరు!
ఈ చిత్రం గురించి మీ కే మైన విషయాలు తెలిస్తే తెలియ జేయ్యగలరు.
జిలేబి.

Friday, January 30, 2009

బ్లాగ్లోకం లో భామామణి

ఆయ్య బాబోయ్ నేను కొత్త సినిమా టైటిల్ కని పెట్టేసాను. బ్లాగ్లోకం లో భామామణి ఆ సినిమా టైటిల్ పేరు! ఈ మధ్య కొత్త కొత్త పేర్లు కనుక్కోవడం లో నేను మరీ ఎక్స్పెర్ట్ అయిపోయ్యానోచ్ అని నన్ను నేను మరీ పోగిడేసుకున్నా!

ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ బ్లాగు కి మునుపు టపాలో ఈ ప్రశ్న వెయ్యడం ఈ టపాకి మేటర్ అయ్యింది. శ్రీ తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం ( చాల పెద్ద పేరు కాబట్టి సంషిప్తం గా "తాలబాసు" గా పిలుస్తాను వీరిని ) గారు ఈ సందేహం లేవదీసారు!
తాలబాసు వువాచ:
"
అది సరే ! ఏమనుకోవద్దు. ఒక విషయం చెప్పండి. ఇంతకీ మీరు మగ బ్లాగరా ? మహిళా బ్లాగరా ? మీ ప్రవర (profile) లో ఏ వివరాలూ లేవు. అందుకని అడుగుతున్నానంతే !"

ఈ వ్యాఖ్య ని చదివాక ఈ టపా కి ఈ "బ్లాగ్లోకం లో భామామణి " కి అని నామకరణం చేసినాను. ఎందుకంటే వరూధిని అన్న పేరుతొ బ్లాగు స్టార్ట్ చేసిన తరువాయీ సిరిసిరిమువ్వ blaagaru గారు "ఏమనడోయ్ జిలేబి గారు మీరు నాపెరుతో బ్లాగు స్టార్ట్ చేసినారు. నా స్నేహితులు ఈ బ్లాగు నాదేనా అని అడుగుతున్నారు" అన్నారు!
ఇప్పుడేమో "తాలబాసు" గారు మీరు మగ బ్లాగర లేక మహిళా బ్లాగారా అని నిక్కదీసి ప్రశ్న వేస్తున్నారు!
తెలియక అడుగుతాను నేను చేసిన నేరమేమి తిరుమలేశా? అంతా విష్ణు మాయ లా ఉందండోయ్!
ఛీర్స్!
జిలేబి.

Thursday, January 29, 2009

నెనర్లు అస్సలు తెలుగు పదమేనా-2

నెనర్లుకి జేజేలు!
ఈ నెనర్లు అన్న పదం ఇంత వేడి టాపిక్ అని నాకు తెలియదు.
ఆంతే కాక ఇంత విశాల పరిధిలో చర్చించ బడ్డ లేక చర్చించదగ్గ విషయమని ఇప్పుడే తెలిసింది.
బ్లాగరు మిత్రులకు నెనర్లు/ధన్యవాదాలు/కృతజ్ఞతలు /!
నెనర్లు పేరుతో బ్ల్లాగు సెర్చ్ చేస్తే నెనర్లు.బ్లాగ్స్పాట్.కాం అస్సలు ఎవరు ఇంత దాక క్రియేట్ చేయ్యపోవకుండా ఉండిపోవడం ఆశ్చర్యమనిపించింది.
సో- ఈ నెనర్లు కి స్థానం కల్పించదలిచాను. భ్లాగు నెనర్లు పేరుతో ప్రారంభించాను. మిత్రులు గమనించి ప్రొత్సహించగలరు!
లింకు:
http://www.nenarlu.blogspot.com/

జిలేబి.

Monday, January 26, 2009

నెనర్లు అన్నది అసలు తెలుగు పదమేనా?

నాకో సందేహం వచ్చింది. ఈ నెనర్లు అన్నది అసలు తెలుగు పదమేనా అని. ఈ పదాన్ని మొట్ట మొదటి సారి నేను గమనించింది ఈ బ్లాగుల లోకం లోనే. ఇంతకుమునుపు ప్రింట్ మీడియా లోగాని నేను చదవిన తెలుగు పుస్తకాలో గాని ఈ పదాన్ని గమనించడం జరగలేదు. సాధారణంగా ధన్యవాదాలు లేక కృతజ్ఞతలు లాంటి పదాలు చూసాను గాని ఈ నెనర్లు అన్నది చూడటం బ్లాగులోకం లో నే.

ఈ పదమేమన్నా బ్లాగులోళ్ళ చే తెలుగులోకానికి చేర్చబడ్డ కొత్త పదమా? ఎవరైనా సందేహం తీర్చగలరు?

జిలేబి.

Sunday, January 25, 2009

జనార్ధన మహర్షి కొత్త పుస్తకం- గుడి

ఈ జనార్ధన మహర్షి అనబడే కందమూరి జనార్ధన రావు అనబడే మేము అతని కాలేజీ డేస్ లో ధనాధన్ అని పిలవబడే ఆసామి గురించి తీరికున్నప్పుడు రాస్తాను ప్రస్తుతానికి ఈ అబ్బాయి (ఇప్పుడు పెద్దవాడయ్యేడు కాబట్టి అబ్బాయి అని చెప్పకూడదేమో ?) వ్రాసిన "గుడి" పుస్తకం క్రింది స్థలం లో దొరుకుతుంది. ఈ జనార్ధన మహర్షి సినిమా ఫీల్డ్ లో కామెడి ట్రాక్ మూవీస్ లో ప్రసిద్ధులు. తనికెళ్ళ భరణి గోష్టి లో ప్రముఖులు.

గుడి
రచన: జనార్ధన మహర్షి
ప్రతులకు:రచయిత పేర, జి-2, కృష్ణ అపార్ట్మెంట్స్,
ఎల్లారెడ్డి గూడ , హైదరాబాద్- 500 073
pages: 151 Price: Rs.100/-

జిలేబి.

Saturday, January 24, 2009

ఈ మాట-ఎల్లలు లేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ పత్రిక

ఈమాట తెలుగు పత్రిక చాలా రోజుల తరువాత చదవం జరిగింది. వెబ్ ప్రపంచం లో ఈ http://www.eemaata.com పత్రిక నిజం చెప్పాలంటే ఓ తెలుగు వెలుగు తేజం. చాలా మంచి వ్యాసాలూ కథలు కవితలతో రెండు నెలలకో సారి వెబ్ లో ప్రత్యక్షం అవుతుంది. ఎల్లలు లేని ప్రపంచానికి ఇది ఎలెక్ట్రానిక్ పత్రిక.
సావకాశం గా చదువుకోడానికి వీలుగా ఉన్న పత్రిక. వీలున్నప్పుడు చదవడానికి ప్రయత్నించండి. తెలుగు ని మనసారా ఆస్వాదించండి.

బ్లాగులోకంలో మీ
జిలేబి.

Tuesday, January 20, 2009

ది మాంక్ హూ బాట్ హిస్ బుల్లక్ కార్ట్

ఈ శీర్షికకి ప్రేరణ Robin Sharma పుస్తకం "The Monk Who Sold his ferrari". Bullack Cart కొనకుండా ఎట్లా ఫెర్రరి అమ్మడం? బుల్లక్ కార్ట్ ఎప్పుడో ఒకప్పుడు ఈ మాంక్ కొని అప్పట్నుంచి సాధించిన లేక సేకరించిన ధనం లేకుండా ఈ ఫెర్రరి అమ్మడం సులభం కాదని నా ప్రగాడ విశ్వాసం. ఎందుకంటారా మనిషి జీవనపథం లో ఎప్పుడో ఒకప్పుడు బుల్లక్ కార్ట్ నుంచే జీవితం మొదలెట్టేడు కాబట్టి.

బుల్లక్ కార్ట్ నుండి జీవితం మొదలెట్టి ఈ భూప్రపంచంలో ఈ మానవుడు ఇప్పుడు ఫెర్రరి స్టేజి కి వచ్చినా కూడా ఫెర్రారి ని వదిలి పెట్టనిదే మెంటల్ పీస్ లేకుండా పోవడం ఈ మానవ లోకం చేసుకున్న పుణ్యమో లేక ప్రారబ్ధ కర్మయో ఎవరు చెప్పగలరు? ఎంతైనా ఫెర్రారి కన్నా మెంటల్ పీస్ గొప్పదని మాంక్ గా మారిన ఆ అడ్వకేట్ ఆ కథలో చెప్పడం లో రాబిన్ శర్మ ఇండియన్ ఫిలాసఫీ ని వెస్ట్రన్ వరల్డ్ కి మళ్ళీ తీసుకు వెళ్ళడంలో సఫలీక్రుతులయ్యారని చెప్పవచ్చు.
జిలేబి.

Monday, January 19, 2009

చందమామ 1947 సెప్టెంబర్ నెల సంచిక

మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ అంటే మరీ ఓ లాంటి తీపి అనుభవాల కలయిక. అదీ మన చిన్నప్పటి కన్నా ఇంక ముందు పబ్లిష్ ఐన చందమామ మనకి దొరికితే ఇంక ఆ సంతోషం చెప్పనే అక్కర లేదు ! అట్లాంటి ది ఏకంగా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి చందమామ ఇష్యూ ఐతే ఇంక ఆ చందమామ కవర్ పేజి కనీసం చూస్తే అబ్బో ఆ ఆనందం - జీవిత మకరందేమే !

ఈ మధ్య బ్లాగులలో సంచారం చేసినప్పుడు ఈ 1947 సెప్టెంబర్ నెల చందమామ చూడడం తటస్చింది. మీకు ఈ చందమామ కావలున్కుంటే ఈ క్రింది లింకు నుండి (ఇంకా కూడా బోల్డెన్ని పుస్తకాలు ఉన్నవి డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. Its free to download!
http://rare-e-books.blogspot.com/2008/08/chandamama-september-1947.html

జిలేబి.

Saturday, January 17, 2009

శ్రీ మధురాంతకం రాజారాం గారి జ్ఞాపకాలు - ముచ్చటగా మూడో సారి

కడప జిల్లా రాయచోటి లో ఉద్యోగా రీత్యా ఉన్నప్పుడు చిత్తూరు కి ప్రతి శనివారం వెళ్ళాలని ప్రయత్నించడం బ్యాచిలర్ డేస్ లో ఓ పిచ్చి ప్రయత్నం మజా. అప్పట్లో శనివారం ౧/౨ డే ఉద్యోగం అయ్యాక ఓ ఒకటిన్నర మధ్యాహ్నం ప్రాంతం లో చిత్తూరికి వెళ్ళే బస్సుని వదిలేస్తే మళ్ళీ ఎ సాయంత్రం వచ్చే బస్సు కోసం వెయిట్ చెయ్యాల్సి వచ్చేది. అట్లాంటి నిరీక్షణం లో ఎ లారీ వచ్చి ప్యాసింజర్ ని ఎక్కిచ్చుకున్తానంటే వెంటనే ఎక్కేసి హాపీ ఆన్ హాపీ ఆఫ్ లాగా చిత్తూరు చేరేవాళ్ళం.

అట్లాంటి ఓ మధ్యాహ్నపు జర్నీ లో ఓ ఆయిల్ టాంకర్ ఎక్కి చేసిన ప్రయాణం లో ఈ టాంకర్ మధ్యే మార్గం లో బ్రేక్ డవున్ అవడం తో హతోస్మి అనుకుంటూ దగ్గిర వున్న ఎ గ్రామం దాకానో నడిచి వెళ్లి కాస్త టీ నీళ్లు పడేసుకుందామని విచారిస్తే దగ్గర్లో ఉన్న గ్రామం శ్రీ మధురాంతకం రాజారం గారి దామల్చెరువు అవడం జరిగింది. సరే అని ఆయన ఇల్లు కనుక్కొని (గ్రామం లో ఇల్లు కనుక్కోవడం అంత సులభమైన పని వేరే ఏది లేదు!) వెళితే ఆయన ఇంట్లో సావకాశం గా పడక్కుర్చిలో కూర్చిని ఉన్నారు.

అప్పటికే సాయం కాలం అవటంతో పలకరింపులోనే "చాలా పొద్దు పోయి వచ్చారు బాగున్నారా" అని ఉభయ కుశలం విచారించి అలా సంభాషణ పిచ్చాపాటి లోకి దిగింది.

వస్తుతః ఈ సంభాషణం లో ఎట్లాంటి ప్రత్యేకతలు లేవు. ఓ ఇద్దరు మనుషులు కలిస్తే పిచ్చాపాటి చేస్తే అందులో ఎట్లాంటి ప్రత్యేకతలు లేక పోయిన కూడా అందులో ఓ విధమైన వ్యక్తిత్వ ప్రకటన ఉంటుంది. అట్లాంటి దే ఈ సంభాషణం కూడా!

మధురాంతకం లాంటి పెద్దలతో పిచ్చాపాటి కూడా ఓ మరిచి పోలేని అనుభవమే. ఎందుకంటే వారి మాటల్లో నిజ జీవితం ప్రతిఫలిస్తుంది వారు పలికే ప్రతి మాట వెనుక జీవితానుభవం ప్రతిభిమ్భిస్తుంది.

జిలేబి.

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి వనం లో క్రాంతి సుమ పథం లో తియ్యగా సాగే సుభ లక్షణ సమీరంలో భాసించాలి మీ జీవతం కాంతులతో సుఖ శాంతులతో ...

జిలేబి.

Sunday, January 11, 2009

నాకు నచ్చిన పద్యం - దాశరథీ శతకం నుంచి

భండన భీముడార్థజన భాందవుడుజ్వల బాణ తూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేదనుచున్ గడ గట్టి భెరికా డాండ
డడాండ డాండ నినదంబు నిండ మత్త
వేదండము నెక్కి చాటెదన్ దాశరథీ కరుణాపయోనిధి!


ఈ పద్యం లో ఉన్న జోష్ రియల్లీ సూపర్బ్. - డాండ డడాండ డాండ అన్న పదమొక్కటే చాలు చేణుక్కు మనడానికి


భావార్థం: ఈ పద్యం శ్రీ రామచంద్రుని గురించి. శ్రీ రాముడు బలంలో భీముడంతటి వారట. ఆర్త జన భాన్దవుడు. ఉజ్వల బాణ తూణ కళా కోదండ ప్రచండులు. అట్లాంటి శ్రీ రామచంద్ర ప్రభువుల భుజ తాండవ కీర్తిని మత్త ఏనుగు నెక్కి డంకా భజాయించి అట్లాంటి స్వామీ కి రెండవ సాటి దైవం ఇక ఎవ్వరు లేదని చాటి చెబ్తారట దాసరథి వారు!

జిలేబి.

Saturday, January 10, 2009

హాస్య దర్బార్ - సత్య ప్రసాద్ అరిపిరాల గారి ఈ బుక్


భేషైన పసందైన హాస్య రస ప్రధానం గా అరిపిరాల సత్య ప్రసాద్ గారు వ్రాసిన హాస్య దర్బార్ ఈ పుస్తకాన్ని ఇక్కడ పొందుపరచిన లింకు ద్వారా డవున్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఈ పుస్తకం పీడీఫ్ ఫార్మేటు లో అందంగా ముద్రించబడి ఉంది.



జిలేబి.

Friday, January 9, 2009

సత్యం రాజు & శివాజీ ది బాస్ ఒకరేనా?

శివాజీ ది బాస్ చిత్ర రాజం లో నల్ల డబ్బుని శ్రీమాన్ రజని కాంత్ గారు డాలర్లు గా కాన్వేర్ట్ చేసి జూమ్మన్ని భారత దేశాన్ని మార్చే ప్రనాలికని ప్రతిపాదించారు. శ్రీ రామచంద్రుడు సత్య వాక్పరిపాలయనే జీవిత ధ్యేయమని తండ్రి దశరథుడు చూపించనా మార్గం లో అడవి కి వెళ్ళారు.

మన కలియుగం లో జామ్బూద్వీపం లో భారత వర్షం లో భారత ఖండంలో ఆంద్ర రాజ్యం లో రాముని పేరుగల రాజు గారు లేని డబ్బుని ఉన్నట్టు గా నిలబెట్టి యాభై వేలమంది యువతకి ఉద్యోగం కల్పించి అరవై ఐదు దేశాల్లో భారతకీర్తిని తెలుగు తేజాన్ని చాటించి విష్ణు మాయ చేసారు.

శ్రీమాన్ శివాజీ ది బాస్ గారి చిత్రరాజం వౌ అంటూ జూమ్మంటూ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది- చిత్రం లో శివాజీ గారు చెరసాల కి వెళితే దారిలో కోట్లాది జనం ఆయన కోసం నిరీక్షణ. శ్రీ రామచంద్రుడు సత్య వాక్పరిపలన కోసం అడవి కి వెళితే దేశం ప్రజానీకం కన్నీరు కార్చింది.

ఈ తెలుగు తేజం లేని డబ్బుతో ఒక కార్పొరేట్ సామ్రాజ్యాని ఇరవై సంవత్సరాలు గా నిలబెట్టిన వైనం దీని పర్యవసానం వేచి చూడ వలసినదే మరి.

జిలేబి.

Tuesday, January 6, 2009

కాల వాహిని అలల వాలున సాగి పోవుట సులభ తరమే ....

ఈ మధ్య భూప్రపంచానికి కడు గడ్డు కాలం వచ్చినట్టుంది. క్రితం సంవత్సరం నుంచి అన్నీ ఒక దాన్ని మించి మరో మాంద్యం కబుర్లే - ఎ పత్రిక తిరగేసిన ప్రతి దేశం లోను ఏదో ఒక ప్రాబ్లం కనబడుతూనే ఉంది.
కలి కాలం వైపరీత్యాలు మన మున్న జామానాలోనే అన్ని ప్రాబ్లం రావాలని అంటారా?
అంతా విష్ణు మాయ గాకుంటే మరేమీ చోద్యం అంటారు?

ఎంతైనా కాల వాహిని అలల వాలున సాగి పోవటం సులభ తరమే. కాని ఇప్పుడున్న పరిస్తుతల్లో ఇది కూడా కష్టమే అని పిస్తోంది.
వీటన్నిటికి త్వరలోనే ఓ భంసు తేరా బడి శుభమైన కాలం ఆసంన్మవుతుందని ఆశిద్దాం!

జిలేబి.

Monday, January 5, 2009

ఏమండోయ్ శ్రీమతి గారు

ఏమండోయ్ శ్రీమతి గారు అన్న వాక్యాన్ని కీర్తి శేషులు శ్రీ శోభన్ బాబు గారు తన చిత్రాలలో సొగసుగా పలికినంత ఇంకెవరు చెప్పగలరా అంటే నా వరకైతే మరి ఎ నటుడు ఆ సంపూర్ణత్వాన్ని ఆపాదించలేక పోయాడనే చెప్పొచ్చు.

ఒక్కో నటుడికి(నటి కి) ఓ సొగసైన పద్దతి డైలాగ్ డెలివరీ ఉంటుంది. వీళ్ళని అబ్సర్వ్ చేస్తే దీని మీదే ఓ థీసిస్ రాయొచ్చు !

మీరేమంటారు?

జిలేబి.

Friday, January 2, 2009

సింగపూరు బుద్ధుడు


ఆ మధ్య సింగపూరు వెళ్ళినప్పుడు తీసిన బుద్దుని ఫోటో. ప్రసన్న వదనం ధ్యాయేత్.
జిలేబి.

Thursday, January 1, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు

దేనికైనా నాకు టైం లేనే లేదండి అనే మనలాంటి ఎందరికో కోసం నూతన సంవత్సరం టైం అంటూ నేనున్నాను ఓ 365 రోజులు తీసుకోవోయీ అంటూ స్నేహ నేస్తం చాపుతూ మనల్ని భవిష్యత్తులోకి రమ్మంటూ ఆహ్వానిస్తోంది.

రండి పాత సంవత్సారానికి బాయ్ బాయ్ చెబ్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. అంతే కాదు - మంచి విషయాలికి మనకి ఈ నూతన సంవత్సరం లో ఎప్పుడు సమయం ఉందని నిరుపిస్తాం.

జిలేబి.