Wednesday, November 9, 2011

కాలక్షేపం కి బటాణీలు - టైం పాస్ కి బాతాఖానీ - మా చిత్తూరు అవ్వ కథ

మా స్కూలు ముందు ఓ పెద్దమ్మ - అవ్వ బటాణీలు అమ్మేది. 

తన మనవలు పొలం పనుల్లో కెళ్ళాక  ఆవిడ మా వూరి దగ్గిరున్న గ్రామం నించి వచ్చి బటాణీలు అమ్ముకునేది. వరుమానం ఎంత వచ్చేదో నాకు సందేహమే. ఎందుకంటే ఆవిడ దగ్గిర ఒక చిన్న బుట్ట మాత్రమె ఉండేది. అంత చిన్న బుట్టలోని బటాణీలు ఎంత అమ్ముకుంటే పైసలు వస్తుంది అన్నది ఒక ప్రశ్నే.

అయినా తప్పనిసరిగా   వూళ్ళో వున్న మా బడి కాడికి వచ్చి కూర్చొనేది. మేము ఐదు పైసలకి కాకుంటే ఓ పది పైసలకి బటాణీలు అడిగే వాళ్ళం. అంతకు మించి మా దగ్గిర పైసలు ఎక్కడ ?

ఓపిగ్గా బటాణీలు ఓ చేతిన్నర కాగితం లో పొట్లం ( చక్కటి కోన్ ఆకారం లో ) కట్టి ఇచ్చేది. దాని తో బాటు ఒక బోసి నవ్వు కూడాను.  మా నవ్వూ ఆవిడకి (అప్పట్లో అంటే ఓ నాలుగో క్లాస్సో , ఐదో క్లాసో ఉండవచ్చు అనుకుంటాను ) బోసి నవ్వు లా అని పించేదేమో ? ఎందుకంటే మమ్మల్ని చూస్తె ఆవిడ నవ్వు ఇలా ఖాన్డ్లా నించి కొహిమ  దాక లాగదీసిన భారద్దేశం అయ్యేది.

కొసరు అడిగితె ఆవిడ చెయ్యి ధారాళం. చాల సార్లు అడగకనే కొసరు వేసేది. అడిగామంటే బోసి నవ్వు ఇంకా సాగలాగి అలా పాకిస్తానూ, ఇలా బంగ్లాదేషూ భారద్దేశం లో కలిసి పోయేది.

ఓ వేసవి సెలవుల తరువాత ఈ పెద్దమ్మ కనబడ కుండా పోయింది. మాకు బటాణీలు అమ్మే అవ్వ ఏమైందో తెలియకుండా పోయింది.

ఓ పది రోజుల తరువాత , మా హెడ్ మిస్ట్రేస్సు మమ్మల్ని స్కూలు గ్రౌండ్ లో హాజరు పరిచి "అమ్మలూ , మీరు బటాణీల  అవ్వ దగ్గిర దాచిన పైసలు , అవ్వ మీకందరికీ  పలకా బలపం కొనిబెట్టమని చెప్పి ఇచ్చిపంపించి తాను దేవుడి దగ్గిరకి వేల్లిపోయిన్దర్రా"  అని చెప్పి మౌనం గా ఉండి పోయింది.

ఆ తరువాయి మేమెప్పుడూ మా పెద్దవ్వ  అంత భారద్దేశం నవ్వు చూళ్ళేదు.  మీకెక్కడైనా ఆ బోసి నవ్వు అవ్వ కనిపించిందా ?

జిలేబి.

8 comments:

  1. ఎంత మంచి మనసున్న అవ్వండీ!

    ReplyDelete
  2. హెడ్‌మిస్ట్రెస్ చెప్పుండకపోతే తెలిసేదికాదేమో? ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులు కనబట్టం మానేస్తే మెల్లిగా మరిచిపొతుంటాము కదూ? మీ టపా చదివాక అలాంటి ఒక జామకాయలమ్మే చిచ్చా గుర్తుకొచ్చారు. బాగుంది...

    ReplyDelete
  3. కదిలించింది‌.

    ReplyDelete
  4. చిన్న వాళ్ళని నిరసనగా చూస్తాం. వాళ్ళ గుండె తడి చూడలేము, ఉండగా

    ReplyDelete
  5. కొన్ని అనుభూతులకు వెల కట్టలేం. మంచి విషయాన్ని షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు. ఇంతకీ ఆ హెడ్ మిస్ట్రెస్ పేరు కళ్యాణి బాయి మేడం అయితే కాదు కదా..? ఎందుకంటే మా స్కూలు కి కూడా అప్పట్లో హెడ్ మిస్ట్రెస్ ఉండేవారు.
    రామకృష్ణ

    ReplyDelete
  6. @ రసజ్న గారు

    అవునండి , మనసు కనబడదు. కైంకర్యం లో ప్రస్ఫుట మవుతుంది.

    @జేబీ గారు

    కొన్నిచాలా చిన్న విషయాలు మాత్రమే. కాని వాటి ముద్ర హృదయ ఫలకం మీద చెరిగిపోని వి.

    @శర్మ గారు

    గుండె తడి అప్పుడప్పుడు ఇలా కదిలిస్తూ ఉంటుంది.

    @కొత్తపాళీ గారు

    పెద్ద సంఘటనలు కాలగతి లో కలిసి పోతాయి. ఈలాంటి చిన్ని హృదయ స్పందనలు మెగా సవ్వడులు అప్పుడప్పుడు చేస్తుంటాయి. ఏమి చేద్దాం మరి టూ మచ్ 'హచ్'-

    * (where ever you go these touching moments follow us or now and then face us briefly)-

    వాటి లోని ఆర్ద్రత ఆ సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్షమవదు గాని ఆ తరవాయి గుండె గొంతుకలో కొట్టుకున్నప్పుడు అక్షర రూపం దాలుస్తాయి.

    @రామకృష్ణ గారు,

    సరిగ్గా చెప్పారు. ఇవి అమూల్యాలు. తడి వెల్లువై నప్పుడు తటాలు మని హృదయ గవాక్షం అప్పుడప్పుడు తన్మదిలోని కమ్మ తెమ్మరులను ఇలా వీచినప్పుడు వాటి విలువ అనంతమంతా నిండిన ప్రేమస్వరూపం గా మార్చేస్తూన్తుంది.

    కాదండీ , ఇది గ్రిడ్లీ గాళ్స్ స్కూల్ పరిసర ప్రాంతం లో నిది.

    ధన్యవాదములు అందరికీ - సర్వే జనాః సుఖినో భవంతు.

    ReplyDelete
  7. @తెలుగుభావాలు గారికి
    ధన్యవాదములు. అవునండీ, నావరకైతే ప్రతి ఒక్కరి జీవితం లో నూ ఇట్లాంటి కొద్దో గొప్పో అనుభవం ఉండే ఉంటుందనుకుంటాను. ఎందుకంటే మనం మానవులం కాబట్టి. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఈ తడి ఎక్కువగా ఏమీ లేని (నేను చెప్పడం సంపాదన విషయం లో ఏమీ లేని - సాదా సీదా జన సమూహం లో ) వాళ్ళ దగ్గిర నించి ఎదురవవటం. సో, ఈ గుండె తడికి కిటుకు వేరే ఎక్కడో ఉందని నా అభిప్రాయం. ఇది అన్ని పాళ్ళూ కరెక్టు కాక పోవచ్చేమో కాని mostly yes.

    నెనర్లు
    జిలేబి.

    ReplyDelete