Friday, December 16, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 5 - (శంకర విజయం - 4 )

సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జేప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !  బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .

గులువులు హనుమచ్చాస్లీ గాలికి నమస్సులు.

" అజాడ్యం వాక్ పటుత్వం చ హనూమత్ స్మలనాత్ భవేత్ " అని మా మాత చెప్పాలు.  మీలు వాలి నామధేయులు. కావున మీ స్మలణతో మా మాత గులించి చెబుతాను -

"నడకలు నేల్పెను
నడవడికలు నేల్పెను
నడతను నేల్పెను
బుడి బుడి నడకల
బుజ్జి పండు
బుద్ధుడే అవుగాక ! అని మా మాత నాకు అన్నియు నేల్పెను" అన్నాడు బుజ్జి పండు.

గోలి వారికి ఈ బుడతడు హనూమంతుడు కన్న రాముడే అయ్యాడు ఆ బుజ్జి పలుకులు విని.

ఈ మారు చింతా వారు, 'ఈ గోలీ వారూ బోల్తా పడ్డారే సుమీ ' అని బుజ్జి పండు ని వుద్దేశించి,

" బుజ్జి పండు - అమెరికా దేశములో తెలుగు నేర్చుకొనుటకు ఎన్నో పుస్తకములు వున్నాయి కదా ? వాటితోనే నీవు నేర్చుకోవచ్చు గదా ? ఇలా శంకరాభరణం కొలువు లో అంతర్జాల వాసం అవరసరమా ? " అని బుజ్జి పండుని 'పరి' శోధించారు!

దానికి బుడతడు, క్షణ మాత్రములో , "చింతావాలు! మస్తకమును మించునే పుస్తకమ్ము " అని తడుముకోకుండా జవాబు చెప్పాడు.

బుజ్జి పండు అంత వేగం గా తనకు సమాధానము చెప్పునని  చింతా వారు ఎదురు చూడ లేదు !

అయినను కొంత కాలం మునుపే ఈ శంకరాభరణం సదస్సు 'మస్తకమ్మును మించునే పుస్తకమ్ము ' అని ఘంటా పధం గా ఘోషించింది కూడాను! కాబట్టి వేరుగా చెప్పనలవి కాదు !

పండిత నేమాని వారి వైపు సభా సదస్సు చూసింది. శంకరార్యులు కూడా చిరు నవ్వు నవ్వుతూ, ' ఆర్యా ! పండిత నేమానీ సన్యాసీ రావు గారు మీ అభిప్రాయం ? " అన్నారు.

పండిత నేమాని వారు సభను ఉద్దేశించి,

మిత్రులారా!

పద్య కవిత్వము ఎవరికి అలవడును అని ఒకపరి పరికించుచో -పెద్ద పెద్ద చదువులు కలిగిన వారు ఒక పాదము కూడా చెప్ప లేక పోవచ్చును;  సామాన్యులైన వారు చక్కని సహజ కవిత్వముతో  జనరంజకమైన కవిత్వమును చెప్ప గలుగుచున్నారు.  వాగ్దేవి యొక్క సంపూర్ణ  అనుగ్రహము మరియు పూర్వ జన్మల సంస్కారము గలిగిన వారికి పద్య  కవిత్వము అబ్బును. ఈ  మంచి యోగమును ఈ బాలుడు పొందిన వాడిలా వున్నాడు.  మనము ఈతనికి చదువులు నేర్పుతూ ఇంకా  ప్రోత్సాహముతో ముందు సాగుదాము అన్నారు.

ఈ పలుకులు విని

చింతా వారు ఆనందోత్సాహముతో ,

" వరహృదయమ్మునన్
తెలుగు భాషను చక్కగ నభ్యసించి చాతురి
మెరయన్ కవిత్వమున దొడ్డతనమ్మును
జూపుచున్ సుధీవరుల ప్రశంసలొందు బుజ్జి పండూ" అని ఆశీర్వదించి, నిరతము వృద్ధి చెందుచును నీ కృషి యిచ్చును సత్ఫలమ్ములన్ " అని మెచ్చు కున్నారు కూడాను.

సురా బ్లాగీయం సుబ్బారావు గారికి బుడతడి నడవడిక, నడత, మాటలు చాలా నచ్చాయి. వారు వెంటనే ఆశువుగా
"తల్లి దండ్రుల యందున తల్లి మిన్న
సుతుని బాగోగు లన్నియు చూచు చుండి
కంటికిని రెప్ప యట్లయి కాచు చుండు
దైవ మున్న దె ? సుతునకు తల్లి కంటె ? "

అని బుజ్జి పండు మాతని కొనియాడి, బుజ్జి పండుని మనసారా ఆశీర్వదించారు !

శంకరార్యులవారు, సభనుద్దేశించి,

మన భాషా పండితులు అందరూ కూడా అంకిత భావంతో భాషాభిమానంతో భాషాసేవ చేస్తూ తమను నమ్మి తమదగ్గర విద్యకొఱకు వచ్చే విద్యార్థులకు ధర్మ బద్ధంగా విద్య గరుపుతూ ఆంధ్రవిద్యార్థులకు ఆంధ్ర భాషాభిమానం పెరిగేలా చేయాలన్న కోరికతో ఉన్నవారే ! వారు గురుతరమైన గురువు భాద్యతలను నెరవేర్చి, బుడతడైన బుజ్జి పండుని తమ తమ విధానాల మూలముగా తమ శిష్యునిగా చేసుకోనటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది.
తెలుగు వారంత కలసిన వెలుగు బాట , మలచి పూయించి వచ్చు మావి తోట ! తెలుగు వారన్న వెలుగుల జిలుగు వారు , యెచట నున్నను గెలుపొందు రచటె వారు! కాబట్టి ఈ బుడతడైన బుజ్జి పండుని మన సభా ప్రాంగణమున మనము మరింత తెలుగు నేర్చుకొనుటకు, మనము ప్రోత్సాహము ఇచ్చెదము !

లక్కాకుల వారు మొదట చెప్పారు- మనము నది అయి ప్రవహించా లని. మనము జీవ నదులమై ఈ భువి మండలమున తెలుగు వ్యాప్తికి మన వంతు కర్తవ్యం నేరవేర్పుదాము ! ఈ బుజ్జి పండు రాక మన సభా స్థలి కే వన్నె తెచ్చినది. అని చెప్పి బుజ్జి పండు వైపు తిరిగి


"శతమానం భవతి  బుజ్జి పండు" అని మనసారా దీవించారు.

ఇందరి గురువుల ఆశీర్వచనములతో బుజ్జి పండు రేఫా లోపమూ మాయమై పోయినది.

శ్యామలీయం వారు, లక్కాకులవారు చేతిలో చేయి వేసి సభాష్ అని భుజాలు తట్టుకున్నారు

రాజేశ్వరీ అక్కయ్య గారి గురించి చెప్ప వలెనా ?

చిన్న నాటను చేయగ చిలిపి పనులు , తల్లి చాటున ముద్దుల తనయు డనగ, ఈ బుజ్జి పండు ఎదుగ వలె జగద్గురు వనంగ! అని మనసారా కోరుకున్నారు వారు !

సభా స్థలి లో గణ గణ గంట మోగింది.

బుజ్జి పండు ఆశువుగా  అందుకున్నాడు. 

గదిని గోడకున్న గడియారమున గంట,
చర్చి గంట, పాఠశాల గంట,
గిత్త మెడను గంట,కేశవు గుడి గంట,
టంట, టంట, టంట, టంట, టంట. !!!


శ్రీ పతి వారు స్వస్తి వాచకము పలికినారు.

శ్రియే జాత శ్రియ అనిర్యాయ శ్రియం వయో జనిత్రుభ్యో దధాతు !
శ్రియం వసాన అమృతత్వ మాయన్  భజన్తి సద్యః  సవితా విధధ్యూన్ !
శ్రియా ఏవైనం తచ్చిద్రియా మా ధదాతి !
సంతత మృచావషట్ కృత్యం సంతతం సదీయతే ప్రజయా పశుభిహి!
య ఏవం వేద !

ఇంతటి తో బుజ్జి పండు తెలుగు చదువు లో  శ్రీ శంకర విజయం అను అంకము సమాప్తము.


బుజ్జి పండు శంకరాభరణ కొలువులో  తెలుగు పరి పూర్ణముగా నేర్చుకుని, తిరుగు దారి అమెరికా కి పట్టాడు.

మధ్య దారిలో ఆతని విమానము ఫ్లైట్ లే ఓవర్ లో , జర్మెనీ దేశంలో  ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం లో ఆగింది. లే ఓవర్ సమయం లో బుజ్జి పండు కునుకు తీస్తూండగా 'కిడ్' నాప్ కాబడి నాడు. !

దీనికి మూల కారకులు  కొందరు భామలు ! వారిలో  సూత్రధారి అయినవారు  మధుర వాణీ గారు - జెర్మనీ  వాసులు !

వారు 'ఈ' కిడ్ - నాప్ ఎందుకు చేసారు ? దాని కథా కమామీషు ఏమిటి ? రాబోవు అంకము- బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం  కై వేచి  చూడుడు.!


(సశేషం)

15 comments:

  1. హహహ కడు రమణీయముగా, బాగు శ్రవణానందకరముగా ఊహా జగత్తులో సైతం అత్యంత మనోహరముగా తీర్చి దిద్దిన ఈ బుజ్జి పండు తెలుగు చదువు అనే అంకము సమాప్తము అయినందుకు కడు చింతించుచుండగా బుజ్జి పండు తెలుగు చదువు - భామా విజయం కై వేచి చూడుడు.! అన్న వాక్కు మాకు గుండెనిబ్బరాన్ని, ఓదార్పునిచ్చాయి

    ReplyDelete
  2. మీ రచనా కౌశలమునకు నా
    సహస్రాభివందనములు

    ReplyDelete
  3. ఆర్యా! లెస్సపలికితిరి.బాగు.బాగు

    ReplyDelete
  4. జిలేబిగారూ మీ భాషా పరిజ్ఞానానికి మీకు శిరస్సువంచి అభివందనములు అర్పిస్తున్నాము. బుజ్జిపండును ఎప్పుడు విడుదల జేయుదురో ఇక మధురవాణి గారిని అడుగవలెను కాబోలు.

    ReplyDelete
  5. బుజ్జిపండు తెలుగు చదువు బహు రమ్యము గా జరిగింది. ఇప్పుడు మధుర వాణి గారు కృష్ణభక్తి, పున్నమి వెన్నల, సూర్యోదయత్పూర్వమే జాలువారు మంచు బిందువుల సౌందర్యం నాకళింపు చేసుకునే సులువులు నేర్పుతారనుకుంటాను. శుభమస్తు.

    ReplyDelete
  6. @రసజ్ఞ గారు,

    మీ గుండె నిబ్బరం కి ముదావహం! మధురవాణీ గారి 'కిడ్' నాప్ ఈ భామా విజయానికి మూలం ! ఈ 'కిడ్'నాప్ ఎలా జరిగింది ? అన్నది రాబోవు అంశం!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. @సురా బ్లాగీయం సుబ్బారావు మాష్టారు గారికి,

    మీరు యూ యస్సు నించి తిరుగుముఖం భారాద్దేశం పడుతున్నారని మరొక టపాలో చూసాను. ఫ్రాన్కుఫర్టు ఏర్ పోర్ట్ లో బుజ్జి పండుని చూసారంటే నా హాయ్ చెప్పండి, అప్పటికి మధురవాణీ గారు, బులుసు గారూ కలిసి బుజ్జి పండుని కిడ్ నాప్ చెయ్యకుండా వున్నారంటే ! నాకొచ్చిన ఖబురు ఏమంటే ప్రస్తుతం బుజ్జి పండు ఇంకా అక్కడే కునికి పాట్లు పడుతున్నాడని !

    మీ ప్రోత్సాహములకు శతాభివందనములు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  8. కష్టే ఫలే శర్మ గారికి,

    బుజ్జి పండు భామా విజయం లో వాడు నేర్చుకోబోవు తెలుగు గ్రామ్యం, సౌమ్యం, శ్లాఘనీయం! నెనర్లు ! ఆఖరున దీక్షితులు గారిని వాడు అమెరికా లో కలవబోతున్నాడు. వేచి చూడండి!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. మాతా జ్యోతిర్ మాయీ వారికి,

    మీ మనోధైర్యానికి నా శత సహస్ర వందనం , అభివందనం! ఇక మధురవాణీ గారు చెప్పాలి భామా విజయం గురించి! వేచి చూద్దాం! మీ బుజ్జి పండు లక్కు! భామా మణుల టెక్కు !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  10. @బులుసు వారూ,

    ఈ భామా విజయం లో 'కిడ్ నాప్ కి మీరు తోడ్పడ్డారని గ్రేప్ వైన్ వార్త! దాని తో బాటు మీరు ఆర్ముగం ని పారీసు లో కలుస్తున్నారని కూడా విన్నాను !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  11. @పద్మార్పిత గారు,

    వస్తోంది. వచ్చేస్తోంది! త్వరలో నెక్స్ట్ పోస్ట్! ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  12. ఎందుకో ఏమో గారు,

    నెనర్లు.

    చీర్స్

    జిలేబి.

    ReplyDelete
  13. కామెంటిన అందరికీ ధన్యవాదములు.

    శ్రీ గురుభ్యోనమః!


    ఈ బుజ్జి పండు చదువు టపా రాయడానికి జ్యోతిర్మయీ వారి ఒక చిన్ని టపా ఆలోచన నిచ్చింది.
    దాని పర్వ్యవసానం బుజ్జి పండు చదువు - శంకర విజయం.

    శంకర విజయం రాయడానికి శ్రీ శంకరయ్య గారి శంకరాభరణం గారి బ్లాగు నాకు ఎంతో కమ్మని తెలుగు నేర్పింది. ఆ సభా సదస్సు యందలి గురువులకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. వారి టపాలలోని కంటెంటు, చర్చా విషయాలు ఈ శంకర విజయానికి నాకు ఎంతో సహాయకారి. వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు. శంకరాభరణం బ్లాగు పసందైన తెలుగు కవితా ఝరి! తేనెలొలుకు తెలుగు జాలువారున వారి బ్లాగులో, వారి కవితా గోష్టి కవి పండితాదులలో! వారందరికీ పేరు పేరునా నమోవాకములు.

    మీ,

    జిలేబి.

    ReplyDelete