Saturday, February 18, 2012

జిలేబీ శతకం - 4

జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***
పరహిత వైద్యం

కం. తరచుగ బహుదేహంబుల
తిరుగెడునది తానె యనుచు తెలిసి తగుగతిన్
పరిచర్య చేయునదియే
పరహితమన నెగడు చుండు వసుధ జిలేబీ
కం. కాలగతి చెందువిద్యల
కాలము పునరుధ్ధరించగల తరుణములున్
కాలస్వరూపుడగు హరి
లీలలచే నిలను పొటమరించు జిలేబీ

రాబోవు కాలం

కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ

చేతులు కాలాక

కం. చేతికి సెగ సోకినచో
 మూతికి మహబాగ గోరు ముద్దలు దొరకెన్
 తాతకు నాతికి నిద్దరి
 కీ తీరున సంబరములు హెచ్చె జిలేబీ

కం. జరిగిన జ్వరమంతటి సుఖ
 మరుదని చెప్పుదురు గాదె అటులే ముద్దల్
 సరదాగ నోటికందుట
 మరి యెందరి భాగ్య మన్న మాట జిలేబీ

కం. ఇది చాలా బాగున్నది
 బ్రదుకున నిటుంవంటి తీపి ప్రతివారికి నం
 దదు నిక్కంబుగ భళిరే
 ముదిమికి ముచ్చట్లు లావు పుడమి జిలేబీ

కం. తప్పులు సైరించెడు సతు
 లెప్పుడు పడుచుందు రిడుము లీ విధముగనే
 తప్పున్న దిద్దకుండిన
 తిప్పలు పెట్టుటయె మగల తీరు జిలేబీ

ప్రేమిస్తున్నా

కం. ప్రేముడి యెంతయు గొప్పది
 కామంబును ప్రేమయొకటి గావను నెరుకన్
 సేమంబుగాంచు టొప్పును
 ధీమంతుండుండు దీని తెలిసి జిలేబీ

కం. అన్నన్నా దిన మొక్కటి
 యున్నదనన్ ప్రేమికులకు యుర్విని ఘనమై
 మున్నూరరువది నాలుగు
 చిన్నదనము బొందు నేమి చేతు జిలేబీ

కం. ఆదిన మీదన మని యే
 డాదిని గల దినములన్ని యటునిటు పంచన్
 మీదెరుగు తలపు జేయగ
 నే దినమును మిగుల లేదు నిజము జిలేబీ

సన్యాసి బుట్టలో పడ్డాడు

నచ్చిన సుందరి యెందుకు
వచ్చెడు నొక బుట్టలోన వయ్యారముగా
తెచ్చిన యా బుట్టనె విభు
ముచ్చట చెఱ గొనగ గాక పోదు జిలేబీ

అందాల బుట్ట లోపలి
సుందరవదనారవింద సుదతీమణి చే
యందుకొనిన సన్యాసియె
వందేళ్ళకు బంది యనగ వచ్చు జిలేబీ

సన్నాసిని చేసెడునో
సన్నాసిని చూసి కన్య సరదా పడునో
సన్నాసియగుట తథ్యం
బన్నన్నా పురుషు డాలి బంటు జిలేబీ

నల్లని కురులు 

వెల్లుల్లి తలకు పూసిన
నెల్లరు దూరంబు జరుగ నిక కేశములా
తెల్లనివో నల్లనివో
అల్లరి యిక లేదు గనుక హాయి జిలేబీ


 మధురాధిపతే అఖిలం మధురం 


కం. మధురాధిపతి స్పెషల్గా
మధురం బతివలకు నైన మాసంగతియో
మధురాధిపతి యఖిలజన
మధురాకృతి నేను వినక మాన జిలేబీ.

ఎంతెంత దూరం

కం. కామెంట్లైతే శతకం
 మీ మాటల గారడీలు మెప్పించెను నే
 నేమో శతకానికి ఇం
 కేమాత్రందూరముంటినిపుడు జిలేబీ?


బంగరు మాటల మూట

కం. ఈ రసన యెంత చెడ్డది
 నోరదుపున నున్నవాడు నూటికొకండుం
 ధారుణి నుండునొ యుండడొ
 తీరుగ నటులుంట యోగి తీరు జిలేబీ


కం. మాటాడుట చక్కని కళ
 మాటాడక యుండు నేర్పు మరియుం ఘనమై
 కోటికి నొకనికి గల్గెడు
 ఓటివి తక్కొరులనోళు లుర్వి జిలేబీ



ఇల్లాలి అవధానం

కం. ఇల్లెంత పదిలమగునో
 యెల్లరు నెరుగుదురుగాని యెందరి కెరుకా
 యిల్లాలి చలువ చేతనె
 యిల్లన గల దనుచు వారి కిలను జిలేబీ

కం. పిల్లలు పెద్దసమస్యలు
 కొల్ల నిషేధాక్షరులను కూర్చెదరత్తల్
 చెల్లించుచు నప్రస్తుత
 మెల్లప్పుడు పలుకు భర్త ఇలను జిలేబీ

కం. అవధాని పడెడు కష్టము
 లవి యణగును ఝాములోన నందరు పొగడన్
 భుని నిల్లాండ్రకు నిత్యం
 బవధానమె మెప్పు కాన బడదు జిలేబీ


టపాకీకరణం
జిలేబి.

కొస మెరుపు  
శ్రీ గోలీ వారి జిలేబీయం !

కలడని చెప్పెను పోతన
'కలడు కలండనెడి వాడు' కావ్యము నందున్
కలడని చెప్పెను పో, తన
కళలొలికెడు బ్లాగులోన కాదె జిలేబీ!

7 comments:

  1. వామ్మో !

    కొసమెరుపు పద్యం అర్థం అయ్యింది superrrrrrrrrrrrrb

    ?!

    ReplyDelete
  2. కం. తక్కిన వర్థము కాలే
    దక్కట నీవేమి చేతు వయ్యయ్యయ్యో
    తక్కొరు మెచ్చెదరేమో
    చక్కగనో తాడిగడప శ్యామల రావూ

    ReplyDelete
  3. బాగున్నాయండి జిలేబీ శతకం లోని పద్యాలు....

    ReplyDelete
  4. కందం చెప్పిన వాడే కవి, పందిని పొడిచినవాడే బంటు అని నానుడి. శ్యామలరావు గారికి జిలేబి గారికి ధన్యవాదాలు.

    ReplyDelete
  5. సరదా సరదా కబుర్లూ కామెంట్లతో ఓ మంచి శతకం పూర్తి చేయించేశారుగా. శ్యామల జిలేబీయం ఎంతో రుచి ఎంతో రుచి.. అనుకోవలసిందే.

    ఫణీంద్ర పురాణపండ

    ReplyDelete
  6. @ఎందుకో ఏమో గారు,

    నెనర్లు. మంచి పదం అందించారు, కొసమెరుపు!

    @ శ్యామలీయం మాస్టారు,

    మరో శతకానికి నాందీ వాచకం పలికినట్టున్నారు !!

    @లాస్య రామకృష్ణ గారు,

    నెనర్లు మీకు నచ్చినందులకు. అది శ్రీ శ్యామలీయం వారి 'వాణీ విలాస్యం! '

    @కష్టే ఫలే గారు,

    నెనర్లు ! మీ బ్లాగు బల్ల శ్యామలీయం వారి కవితా ఘంటానికి అందడం మా అదృష్టం !

    @పురాణ పండ గారు,

    కవీశ్వరులకు లోకం మొత్తం విషయ సమూహాలే!

    వారి దృష్టి లో పడ్డది ఏదైనా కవితా శిల్పం లో అజరామమై వెలుగొందుతాయి!

    నెనర్లు

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబీగారు
      అనుకోకుండా నాపేరునే మకుటం చేసి పద్యం వ్రాసాను. మీరన్నట్లు మరో శతకం చెయ్యవచ్చును. చౌడప్ప అనే ఆయన 'కవి చౌడప్పా' అనో 'చౌడప్పా' అనో తనపేరు మకుటంగా పెట్టి వ్రాసాడొక శతకాన్నే. నేనూ వ్రాయవచ్చునేమో. చూద్దాం. జిలేబీ శతకం పూర్తికావస్తోందికదా!

      Delete