Wednesday, May 11, 2011

తెలిసీ తెలియని అయోమయం లో !!

అక్కడ

అసత్యమూ లేదు సత్యమూ లేదు ఆకాశమూ లేదు భూమీ లేదు

దాని చుట్టూ ఏమి ఉండేది ? దాన్ని పరిరక్షించింది ఎవరు ?

దాని పరిధి ఎంత ? దాని కొలబద్దలు ఏవి ?

అక్కడ

మృత్యువు లేదు , చిరంజీవత్వమూ లేదు రాత్రీ లేదు పగలు లేదు

తను తానై ఉండి ఉండాలి 

తానొక్కడే ఉండి ఉంటాడేమో ?

అక్కడ

అంధకారం - అంధకారం చే కప్పబడి ఉండేదా ?

ద్రవమన్నది ఉండి ఉంటె అదే సర్వమై వ్యాపించి ఉండేదా ?

అక్కడ ఉండేది - ఏమి లేని దాని లో కప్పబడి ఉండేదా ?

ఆ అంధకారం నించే అది జన్మించిందా ?

ఆ జన్మకి మూలం ప్రేమా ?

దాని బీజం మనసులో నా ?

హృదయాన్ని పరిశోధిస్తే

ఈ రెండింటి కీ సంబంధం కనిపిస్తుందా ?


ఆ ఉద్భవం   ఏకత్వాన్ని భిన్నత్వం  గావిస్తే

దాని కిరువైపులా

ఓ వైపు బీజ రూపం లో అన్నీ ఉంటె

మరో వైపు దాని పరిణామ రూపం లో అన్నీ ఉన్నాయా ?

బీజం స్వయంభువైతే
దాని ప్రతి రూపం- పరిమాణ క్రమం ప్రయత్నం వల్ల సాధ్య పడుతుందా?

ఎవరి కి తెలుసు ? ఎవడు చెప్పగలడు ?

ఎలా వచ్చింది ? ఎలా ఈ సృష్టి సాకారం అయ్యింది ?

దాని తరువాతే సర్వమూ వచ్చి ఉంటె -

ఎవడు చెప్పగలడు అది ఎలా వచ్చిందని ?


దేని నించి ఈ సృష్టి వచ్చిందో అది దీన్ని ఇంకా గమనిస్తోందా ? లేదా ?

దీని కన్నిటికి మూల కారణం ఏదో దాని కైనా తెలుసా ? లేక తెలియదా ?

(నాసదీయ సూక్తం - భావానువాదం - )

తెలిసీ తెలియని అయోమయం  లో
జిలేబి.

Friday, May 6, 2011

వేణు వైన వేళ

తనలో ఏమి లేదు.
శూన్యం

ధ్యానం లో ఏమి ఉంది 
మనసులో ఏమి ఉంది
రెండూ తదేకం అయితే
వేరే ఏమి ఉంది

వేణువు లో ఏమి ఉంది
గాలి లో ఏమి ఉంది

రెండూ కలిస్తే
మృదు మధుర గానం

ఆ పై ఆ ధ్యానమే మనసైతే
అదీ లేదు ఇదీ లేదు
అంతా శూన్యం

ఈ మది వేణు వైతే
వాద్యకారుడు లేడు
వాద్యము లేదు
అంతటా గానమే



చీర్స్
జిలేబి.

Thursday, April 28, 2011

వీడు కోలు - టాటా- బై బై - ఇంక సెలవు

బాబా టాటా -

వీడు కోలు - టాటా- బై బై - ఇంక సెలవు !

మళ్ళీ కలుద్దాం

ఇది ఎంత మధురమైన ఆహ్లాద మైన ఆలోచన  - మనస్సులో ఇప్పటి క్షణాలు చివుక్కు మంటున్నా - మరో జన్మ ఉంటుందన్న ఊరట అందులో మళ్ళీ నువ్వు ఉంటా వన్న ఆలోచన నేను ఉండవచ్చన్న ఆశ - మనసుని శాంత పరచడం అన్నది ?  


నిరీక్షణలో వీక్షణ కై వేచిన క్షణాలు కాల మాన్యం లో శూన్యం

నిరీక్షణలో గత స్మృతుల తోడు మరవలేని పెన్నిధి !

సహస్ర శీర్ష పురుషః సహస్రాక్షాత్ సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వ ఆత్య తిష్టత్ దశాన్గులం !


జిలేబి.



Tuesday, April 26, 2011

బాబా తిరిగి రాక

బాబా తిరిగి రాక -

 మాన వాళి నివాళుల తో పరి తపించే హృదయాలతో వీడు కోలు

అందరి చిరు ఆశ - బాబా తిరిగి వస్తారని !

మానవ హృదయం తన హృదయానికి ప్రతీక ఆయనలో చూసుకుంది.

అద్దం భల్లు మన్నది. గుండె చివుక్కు మంటోంది.

జాతస్య హి మృతం ధ్రువః ! అద్దం ప్రతిబింబం - ఆ ప్రతిబింబాన్ని ఇన్ని దశాబ్దాల బాటు తనివి దీర ఆస్వాదించాం.

ఇప్పుడు ఆ ప్రతిబింబం లేదు.

కానీ అందరిలో ఉన్న ది దాని స్వరూపం. 

ఆ స్వరూపాన్ని వెలుపల కి తీద్దాం. అదే బాబా గారి తిరిగి రాక!

సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామని క్రిత్వాభివదన్ యదాస్తే !
తమేవం విద్వానమృత ఇహ భవతి - నాన్య పంథా అయనాయ విద్యతే !!


నివాళుల తో

జిలేబి.

Wednesday, March 30, 2011

అధర్వ వేదం - ఆరవ కాండం - 17 వ సూక్తం

అధర్వ వేదం - ఆరవ కాండం - 17 వ సూక్తం
 
యథేయం పృథ్వీ మహీ భూతానాం గర్భ మాద్ధే
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం  సవితరే
 
యధేయం పృథ్వీ మహీ దా ధార ఇమాన్ వనస్పతీన్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం  సవితరే
 
యధేయం పృథ్వీ మహీ దా ధార పర్వతాన్ గిరీన్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే

యధేయం పృథ్వీ మహీ దా ధార విష్టితం జగత్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే
 
శుభ కామనలతో
జిలేబి.

నీ కడుపు చల్లగా, పసి పాపను, కని, పెంచ వమ్మా !

నీ కడుపు చల్లగా పసి పాపను కని పెంచ వమ్మా !
సర్వభూతాలను ఇముడ్చుకుని
సర్వ వనరులను తనలోనే పెంపొందించి
గిరి పర్వతాలకు ఆలవాలమై వెలుగొందే భూమాత లా
సర్వ జంతు జాలాలకు జగన్మాత వై న పుడమి తల్లి లా
నీ కడుపు చల్లగా -
పసి పాపను కని, పెంచ వమ్మా !


శుభ కామనలతో
జిలేబి.

(ఆధారం - అధర్వ వేదం - ఆరవ కాండం , పదిహేడవ సూక్తం - భావానువాదం - టూకీ గా - ఈ సూక్తం - గర్భిణి స్త్రీ కి ఆశీర్వచన సూక్తం )




PS: సంస్కృత సూక్తం చదవదలిస్తే ఇక్కడ లింక్ నొక్కండి

Friday, March 25, 2011

మా తాతయ్య - మావయ్యలు అమెరికానించి వచ్చారోచ్ !

బఫ్ఫెట్ (వార్రెన్) తాతయ్య మా మావయ్య బిల్ తో కలిసి ఇండియా రావడం

మా దేశం లో ని బడా బాబూలతో నూ - ఖుషీ ఖుషీ లక్ష్మీ పుత్రులతో మీటింగ్ లు పెట్టుకొని - చందా లివ్వండి - అందరం కలిసి చారిటి చేద్దాం అనడమూ చూస్తె నాకు మరీ ముచ్చట వేసింది.

బంగారం తాతయ్యలు - ఊరికే రారు.

అదీ మావయ్యని వెంట బెట్టుకుని నిజం గా నే ఊరికే రారు.

వారికి మెకన్నాస్ గోల్డ్ ఎక్కడ ఉందొ నిర్ధారణగా తెలిస్తే గాని రారు.

వచ్చారు కాబట్టి - మన దేశం లో ఖచ్చితం గా వారికి బంగారు గనులు (ఘనులు సుమండీ) కనబడి ఉంటాయి.

మరి భారత దేశం - భావి తరం లో - ప్రకాశవంతం తప్పక అవుతుందనడం లో సందేహం లేదు. !

బంగారం ఘనులు - మా తాతయ్య, మావయ్యలతో కలిసి మంచి పనులు చెయ్యండి. - ఈ పెట్టు 'బడి' తో - దేశాని కి ఇంకా కాస్తా విద్యా 'ధనాన్ని' ప్రసాదించండి !

చీర్స్
జిలేబి.

Sunday, March 20, 2011

హమ్మయ్య - బతికి పోయాం - ఎట్లాంటి గండం లేకుండా!

హమ్మయ్య -

మార్చ్ పొంతోమ్మిది - సూపెర్ చంద్రుడు గట్రా 'మానసిక వత్తిడి' వార్తా మాలికల నుంచి బయట పడి పొయ్యాను!

భూలోకం ఏమి కాకుండా యదా తదం గా - సూర్యుడు తెల్లారే పొద్దు పొడిచాడు. నిన్న రాత్రేమో - చందురూడు - మరీ సోయగాలు పోతూ మురిపించాడు.

బ్లాగోదరులార - నా మాట వినండి. నిత్యం పేపర్లు చదవండం మానేయ్యండి. మన జీవితాలు బాగు పడతాయి. మన బీపీ లు, మన టెన్షన్ లు వాళ్లకి నిత్యా హారం (నిత్య ఆహారం ) ! మనల్ని ఎంత బెదిరిస్తే వాళ్లకి అంత మృష్టాన్న భోజనం !

'న్యూస్ 'డప్పు' చేసి పప్పు కూడు ' తినరా ఓ మీడియా వాడా - 'డప్పు లేకుంటే నీ జీవితం లేదురా మీడియా వాడాఅని పాడి వాళ్లకి నమో నమః అర్పించుకుంటూ-

చీర్స్ అంటూ మరో మారు -
జిలేబి.

Thursday, March 17, 2011

మార్చ్ 19 న ఏమి జరగ బోతుంది?

చాల మంది ఇప్పుడు జరుగుతున్న వైపరీత్యాలకి - సూపర్ మూన్ కి లంకె గురించి చదివే ఉంటారు.

మార్చ్ పంతొమ్మిది న ఏమి జరగ వచ్చు?

అన్నదాని గురించి ఎవరైనా ఆలోచించి జూస్తే - మొట్ట మొదట గా అనిపించేది - సూర్యుడు తూర్పున ఉదయిస్తా డోచ్అని సింపుల్ గా చెప్పేయ వచ్చు !

ఇది గా క ఇంకా ఏమి విశేషాలు ? అంటే - ఆ రోజు - పౌర్ణిమ అని చెప్పుకోవచ్చు. పౌర్ణిమ అంటేనే - సముద్రం అలలు గుర్తుకి వస్తాయి. మరి - సముద్రం అలలు అంటే - వీటి పోట్లు ఎక్కువయ్యే అవకాశాలు ఉండవచ్చు.

సో, ఈ నేపధ్యం లో - ప్రతి క్షణం రేపట్నించి - చాలా ముఖ్యం గా అనిపించవచ్చు.

మన తెలుగు రచయితలూ ఈ మధ్య ఎవరు ఇట్లాంటి కథలు - సీరియల్స్ గట్రా రాయటం లేదు. ప్చ్ ఏమి చేద్దాం. ? యండమూరి గాని మల్లాది గాని మళ్ళీ రాయాల్సిందే - క్షణం క్షణం లాంటి టైటిల్ పెట్టి !

ఇది ఏమి అల్లా టప్పా టపా కాదు సుమండీ. దీని వెనుక పెద్ద విషయం ఉంది. ఆలోచించి చూడండి. మీకే తడుతుంది.
తట్టకుంటే- పంతొమ్మిది దాక వెయిట్ చెయ్యండి. అంతా తేట తెల్లన అయిపోతుంది!

చీర్స్
జిలేబి.

Monday, March 14, 2011

నా కర్తా హరిహి , అహం కర్తా!

నా హం కర్తా, హరిహి కర్తా అన్నది పెద్దల వాక్కు.

ఇప్పుడు మన భూమండలం లో జరుగుతున్న ప్రకృతి విపరీతాలు, దేశ దేశాల లో కానవస్తున్న కలవరాలు చూస్తూంటే - నా కర్తా హరిహి , అహం కర్తా అని పించక మానదు.

మానవుడు మేధస్సు పెంపొందించాడు. ప్రకృతి కి దీటుగా సాయిన్సు సాధించాడు. మరెన్నో విషయాలలో విపరతీమైన వేగాన్ని, ఉన్నత శిఖరాలని అధిగమించాడు. ఇన్ని మార్పులు చేర్పులతో ప్రభంజనం లా సాగిపోతున్న మానవ జీవనం లో - కోరికలని అదిగమించ లేక పోవడం విచారకరం. ఆ పై పదవీ వ్యామోహం, ధన మోహం, నాయకుల అరాచక ప్రవృత్తి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న కలవరాలకి కారణం అని చెప్పలేమా?

దీనికి తోడూ ప్రకృతి విలయ తాండవం - జాపాను అసలు రూపాన్ని పూర్తి గా మార్చి వేస్తోంది. మాన వ నిర్మిత అణు కేంద్రాలు - భస్మాసుర హస్తంలా - విలయ తాండవం చేస్తోంది.

నాహం కర్తా, హరిహి కర్తా అని ఖచ్చితం గా దీనికి చెప్పలేము. ! నా కర్తా హరిహి, అహం ఎవ కర్తా అనిపించకమానదు. !

మానవ జాతి మనుగడ మున్ముందు మంచి దిశల వైపు సాగాలని మనసారా ఆకాంక్షిస్తూ -

జిలేబి.