Wednesday, November 27, 2013

తెలుగు ఛందస్సు - 1

తెలుగు ఛందస్సు - 101

(ఆంగ్ల పద జాలం లో ఉన్న సైటు: - తెలుగులో లేఖిని సహాయం తో - రామకృష్ణ గారి సులువైన పధ్ధతి విశదీకరణ కి అబ్బుర పడుతూ --- జిలేబి )


కొంత కవితావేశం కలిగి, పద్యాలు రాయాలనుకొంటున్న మా చెల్లెలు, తనకు
తెలుగు ఛందస్సు వివరిస్తూ ఉత్తరం రాయమంది.  నాకు గుర్తున్నంత వరకు
ఛందస్సు సూత్రాలని, నేను పద్యాల నడక నేర్చుకొన్న తీరునూ, సమ్మిళితం
చేసి ఒక చిన్న వ్యాసం రాయాలన్న నా చిరకాల కోరిక ఇలా తీరింది.
 ఇది రాయటంలో మొత్తంగా నా జ్ఞాపకశక్తి పైనే ఆధారపడ్డాను. అందువల్ల
ఇందులో కొన్ని తప్పులు దొర్లి ఉండ వచ్చు. అయినా, ఉన్న తప్పులు "యతి మైత్రి
వర్గాలు", "కంద పద్యం సూత్రాలు" అనే అంశాల్లోనే అని నా నమ్మకం. మీకు ఈ
వ్యాసంలో కనిపించిన దోషాలు, ముద్రా రాక్షసాలు సహృదయతతో నాకు
తెలియ పరిస్తే, దిద్దుకుంటాను.
ఇట్లు
భవదీయుడు
S. రామకృష్ణ
(rsanka@usa.net)

----------

లఘువు:

ఏక మాత్రా కాలంలో ఉచ్చరించ బడేది లఘువు. దీని గుర్తు "I".
         సాధారణంగా హ్రస్వాలు లఘువులవుతాయి.
               I    I    I      I
     ఉదా:  త, న,  ద్వి,  క్ల

గురువు:

ద్వి మాత్రా కాలంలో ఉచ్చరించ బడేది గురువు. దీని గుర్తు "U".
        సాధారణంగా దీర్ఘాలు గురువులవుతాయి.
              U   U   U   U   U
    ఉదా:  కో,  సం,  కై,  లా, యెల్


గురు, లఘు నిర్ణయం చేసేటప్పుడు సాధారణంగా పై ఉదాహరణలలో
చూపి నట్టు అక్షరాల పైన వాటి గుర్తులుంచుతారు.

సంయుక్తాక్షరాలు (ఉదా: త్ర, క్లు వంటివి), ద్విత్వాలు (ఉదా: త్త, ప్పు వంటివి)
ముందు వున్న అక్షరాన్ని గురువును చేస్తాయి.


ఉదా: 

"మిత్ర" అనే పదంలో విడిగా చూస్తే "మి" ని లఘువుగా గుర్తించినా
"త్ర" అనే సం యుక్తాక్షరం ముందు ఉండటం వలన అది గురువవుతుంది.

అలాగే "తప్పు" అనే పదంలో "ప్పు" అనే ద్విత్వాక్షరం ముందు ఉండటం
వలన "త" గురువు అవుతుంది.

ఈ సూత్రానికి కారణం "మిత్ర", "తప్పు" అనే పదాలను ఉచ్చరించేటప్పుడు
"మిత్ ర", "తప్ పు" గా వినిపించటం కావచ్చు.
                UI     UI  
అందువల్ల  మిత్ర   తప్పు  ఇట్లా గుర్తించవచ్చు


గణాలు:

ప్రతి పద్య రీతికీ ఒక విశిష్టమైన లయ వుంటుంది. ఆ లయను గురువు,
లఘువుల pattern తో సూచించ వచ్చు. అయితే ఈ లయను సులభంగా
సూచించటం కోసం కొన్ని సామాన్యమైన గురువు, లఘువు combinations
ని "గణాలు"గా ఏర్పరచారు. సాధారణంగా ఒక గణంలో మూడు అక్షరాలు వుంటాయి.

     య:  I U U   భ:  U I I   వ :  I U (దీనిని లగం అని కూడా అంటారు)
       ర:  U I U    జ:  I U I   హ :  U I
       త:  U U I    స:  I I U   ల :  I
       మ:  U U U    న:  I I I   గ :  U

ఈ గణాలని గుర్తు పెట్టుకోవడానికి రెండు చిట్కాలున్నాయి.

1. ఈ నాలుగు సూత్రాలని కంఠస్థం చెయ్యండి:
      అ) ఆది మధ్య అంత్య లఘువులు - య ర త - లు
     ఆ) ఆది మధ్య అంత్య గురువులు - భ జ స - లు
      ఇ) సర్వ లఘువు - న - గణం
     ఈ) సర్వ గురువు - మ - గణం

     మొదటి రెండు సూత్రాలను ఇలా అన్వయించుకోవాలి:

             ఆది లఘువు    య  గణం : I U U
   (అంటే మొదటి అక్షరం లఘువు - మిగతా రెండూ గురువులని అర్థం)
          మధ్య లఘువు    ర  గణం :  U I U
           అంత్య లఘువు    త  గణం :  U U I
     అలాగే
             ఆది గురువు     భ గణం :  U I I
          మధ్య గురువు     జ  గణం :  I U I
           అంత్య గురువు     స  గణం :  I I U


2. ఇంకొక పద్ధతి ఏమిటంటే

 "య మా తా రా జ భా న స ల గం"
   అనే phrase ని కంఠస్థం చెయ్యటం.

ఇందులో ఇప్పుడు ఏ గణం కావాలంటే ఆ అక్షరం దగ్గర మొదలు పెట్టి
మూడు అక్షరాలను తీసుకొని లఘువు గురువులు గుర్తించాలి.

ఉదా:    య గణం :  "య మా తా"   అంటే   I U U
అలాగే     స గణం :  "స ల గం"           అంటే    I I U

మీకు ఏ పద్ధతి తేలికగా అనిపిస్తే ఆ పద్ధతిని అనుసరించ వచ్చు.


 యతి - ప్రాస:

తెలుగు కావ్యాలలో ఉపయోగించే పద్య రీతుల్లో చాలా వరకు సంస్కృతం
నుంచి దిగుమతి చేసుకొన్న వృత్త రీతులే. "ఉత్పలమాల", "చంపకమాల",
"మత్తేభం", "శార్దూలం" వీటిలో ప్రముఖమైనవి.  అయితే తెలుగుకు
ప్రత్యేకమైన పద్య రీతులు లేక పోలేదు. అచ్చంగా తెలుగుకు చెందినవి
"కందం", "సీసం", "గీత పద్యాలు : తేటగీతి - ఆటవెలది". 

అయితే ఇలా సంస్కృతం నుండి గ్రహించిన వృత్తాలను కూడా, తెలుగు తన
ప్రత్యేకతలను  ఆపాదించే స్వీకరించింది. సంస్కృత వృత్తాలకు తెలుగు
చేర్చిన విశేషాలు "యతి", "ప్రాస" నియమాలు. 

యతి:

యతి అంటే విరామం అని అర్థం. లయబద్ధమైన పద్య నడకలో సహజంగా
వచ్చే pause (విరామం) ని యతి స్థానం అంటారు.


తెలుగు పద్యాలలో ఈ యతి
స్థానంలో ఉండే అక్షరం పాదం మొదటి అక్షరంతో "యతి మైత్రి" లో
ఉండాలనేది నియమం. 

ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం
యతి మైత్రిలో ఉంటాయి.
1. అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
2. ఇ, ఈ, ఎ, ఏ, ఋ
3. ఉ, ఊ, ఒ, ఓ
4. క, ఖ, గ, ఘ, ఞ, క్ష
5. చ, ఛ, జ, ఝ, శ, ష, స, ఙ
6. ట, ఠ, డ, ఢ, ణ
7. త, థ, ద, ధ, న
8. ప, ఫ, బ, భ, మ, వ
9.  ణ, న
10. ర, ఱ, ల, ళ

హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి
మైత్రి పాటించాలి. అంటే: "చ",  "జ"  ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా
"చ" కి "జి" తో మైత్రి కుదరదు.

సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు.
ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ" గా
గానీ "రొ" గా గానీ భావించ వచ్చు.

ప్రాస:

పద్య పాదంలోని రెండో అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. తెలుగులో వృత్తాలలో,
కంద పద్యంలో అన్ని పాదాలలో ప్రాసాక్షరం ఒక్కటే ఉండాలనేది నియమం.
ప్రాసాక్షరం అన్ని పాదాలలోనూ ఒకే గుణింతంలో ఉండనక్కరలేదు.

ముందు ముందు వివరించబోయే పద్యరీతుల ఉదాహరణలలో ఈ నియమాలను
గమనించ వచ్చు.  

(సశేషం)

3 comments:

  1. అబ్బురపాటు చెందితదేమి చిత్రమో!

    ReplyDelete
  2. మీరు మూలంగా తీసుకున్న లింకు నేనూ చూశాను.చాలా మంచి పని చేస్తున్నారు.
    చందస్సు తో ఎవరికీ అర్ధం కాని గ్రాంధిక భాషనే కాదు చక్కగా అందరికీ అర్ధమయ్యే పదాలని ఉపయోగించి కూడా పద్యాలుగా మంచి భావాల్ని చెప్పొచ్చు.
    నా సొంత బ్లాగులో తొలి టపానే శ్రీకారంతో మొదలు పెట్టాను.చూసి మీ అభిప్రాయాల్ని చెప్పగలరు:
    http://kinghari010.blogspot.in/2013/11/blog-post.html

    ReplyDelete
  3. నేను కూడా ఈ మధ్యనే రామకృష్ణ గారి ఆంగ్ల లిపి లోని ఛందస్సు ను తెనుగీకరించే పనికి పూనుకున్నాను. ఇంత లో ఆ పని మీరు చేసేసారు. ధన్యవాదాలు.

    ReplyDelete