శంకరాభరణం మాష్టారు ఒకే ఒక వాక్యం ఇస్తారు పూరించుడీ, అని. వెంటనే టప టపా కామెంటు తారు బ్లాగ్ బంధువులు. అమ్మో వారి ఒక్క లైను కి అంత వెయుటు ఉందే అని ఆశ్చర్య పోతాను.
మా జ్యోతక్క గారు చాలా నిశితం గా ఆలోచించి , ఒక టపా రాసారంటే దానికి ఒక నిర్దుష్టమైన దారి, గురి, ఉంటుంది. బాణం ఎక్కుపెట్టడం లో కానివ్వండి , చదువరులని ఆలోచింప చెయ్యడం లో కాని ఒక రాచ బాట వారిది.
మరి ఎందుకో ఏమో గారి బ్లాగు కన్నా వారి కామెంటు లే నాకు కనబడుతుంటాయి. అంటే వారు రాయరని కాదు. మరీ భారీ వీడియో లతో ఉన్న వారి బ్లాగు నాకు ఎప్పుడూ ఓపెన్ కాదు. సరే అని ఓ మారు ఓ యుగం ప్రయత్నించి అయ్యా ఎందుకో ఏమో గారు మీ బ్లాగు ప్రాబ్లం ఏమైనా ఉందా చూస్తారా అని కామెంటు పెడతామని ఓపిక గా కామెంటు పెట్టా, కామెంటు పడిందో లేదో కాని నా కంపుటరు హాంగ్ అయి పోయింది. !
మా భారారే గారేమో మరీ విచిత్రం- అప్పుడప్పడు ఆంగ్లం లో రాస్తారు. స్వామీ ఇది ఆంగ్లమా లేక గ్రీకు అండు లేటినా అన్న సందేహం నాకొస్తుంది. వారు మొదట్లో మంచి మంచి కవితలల్లే వారు. ఆ తరువాతే మయ్యిందో నాకు తెలియదు, వారి బ్లాగు సింపుల్ టెంప్లేట్ మారి కొత్త టెంప్లేట్ (ఇప్పుడున్న టెంప్లేట్) వచ్చేక చాల చాలా భారీ విషయాలు (మచ్చుకి సిగరెట్టూ గురించి ఒక రిసెర్చ్ ఆర్టికల్ ) రాయడం మొదలెట్టారు.
మా బులుసు మాస్టారు గురించి చెప్పాల్సిన పనే లేదు. వారు మూడు నెలలకో మారు రాస్తే గొప్ప టపా. అయిన వారు రాసి అలా టపా వదిలారంటే ఇక హారం కానివ్వండి, సంకలిని గానివ్వండి హోరు మని కామెంటు ల తో వరద ప్రవాహం , ఒక ప్రళయం వచ్చేసిందా అన్నట్టు ఓహో ఆహో అని హోరెత్తి పోతూన్టూంది. (ఈ మధ్యేమో వారు బ్లాగు లోకాని కి గుడ్ బై చెబ్తానని అక్కడెక్కడో బజ్జు లోకం లో చెప్పారని వినికిడి. వారు అలా చెప్పారో లేదో, ఆ గూగుల్ వాడికి భయమేసి బజ్జులని మూసేస్తానని వాక్రుచ్చేడు.- బులుసు గారు బజ్జులలో రాయటం మొదలెడితే గూగుల్ కి కామెంటులు మేనేజ్ మెంటు కష్టం అయిపోతుందేమో అన్న గూగుల్ వారి భయం వారిది - ఎం చేద్దాం - ఓ 'భామా' ఎఫ్ఫెక్టు మరి )
మరి మన బాతాఖాని లక్ష్మీ ఫణి మాస్టారు/మాస్టారిణి వారు అల్లాటప్ప గా ఎ మేటరు పై అయినా అలా అలవోక గా రాసేస్తారు. ఒక్కో మారు రెండు లేక మూడు టాపిక్కులని కలగలిపి ఓ టపా రాసి పడేస్తారు. అది వారికే చెల్లు. కాదేది వారి టపా కే అనర్హమేమో అని పిస్తుంది.
శర్మ గారు, కాలక్షేఫం కబుర్లు అంటారు గాని అవి నూటికి నూరు శాతం కాలక్షేపం కబురులు కావే కావు. ఓ జీవితాన్ని కాచి వడబోసి సత్యాలని చెళ్ళుమని మనకోసం ఇస్తుంటారు. కాని మొహమాటం కొద్దీ - ఇవి కాలక్షేపం కబుర్లు మాత్రమె సుమా అని (మనం జీవిత సత్యాలు అంటే చదవం గదా - భారీ వ్యాసం అంటే కష్టం మరి - అందుకే వారు కాలక్షేఫం కబుర్లతో చిన్న గా హోమియో పతీ డోసులలో ఇచ్చేస్తో వుంటారు ) !
ఇక వారెవరో మధుర వాణీ గారని , జర్మేనీ దేశం లో ఉన్నారట ! ఉన్నారన్న మాటే గాని జర్మేనీ కబుర్లకన్న స్వచ్చమైన తెలుగు కబుర్లే ఎక్కువ చెబుతూంటారు. ఏమండీ అంటే, అప్పుడప్పుడు జర్మేనీ అందాలని ఫోటో పట్టి పెట్తోస్తాంటారు !
మరొకరెవరో కృష్ణ ప్రియ గారట, డైరీ అని రాస్తూ , ఓ విశిష్టమైన శైలి తో కథల పరంపరలు రాస్తూంటారు. అమ్మో వీరికి ఎన్ని విషయాలు తెలుసంటారు జీవిత గమనాల గురించి . ఈ మధ్య ఓ సిక్స్ ఫేసస్ అఫ్ ఎ మాన్ అని - స్టీఫన్ కోవే ని మించి న నైంత్ ఫేక్టర్ అఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ గురించి వాడెవడో ఓ అరవబ్బ్బాయి ఆరుముగం అట , ఆతన్ని సంపూర్ణం గా అనలైజే చేసి రాసేస్తూన్నారు.
మరి నాగ మురళీ గారని, అలా ఓ చేత్తో కాళిదాసుని, మరో చేత్తో వాల్మీకిని , సంస్కృతాన్ని వడబోసి ఓ సంస్కృత కాలేజీ తెలుగు లో నడిపెస్తూంటారు! వామ్మో వీరికెంత జ్ఞానం అని నేను ఆశ్చర్య పోవడం కద్దు కూడాను. !
ఇలా చెప్పుకుంటూ పొతే , అసలు విషం మరిచి పోయేట్టు ఉన్నాను. అసలు మేటరు లేకుండా టపా రాయడం ఎలా అని కదా ఈ టపా తిట్లు సారీ టైటిల్ మరి ? ఈ టైటిల్ మాట ఎందు కొచ్చిందంటే,
ఎవరో జిలేబి అంట, రోజు టపా టపా రాస్తూంది. మేటరు ఉందొ లేదో తనకే తెలీదు. అసలు ఆడవారో మగ వారో వీరు అని మరీ కన్ఫుషన్- నాకు తెలిసి జిలేబి అని ఎవరికైనా పేరు ఉంటుందా ? సందేహమే నా కైతే ! - ఆడవాళ్ళు సందేహం సినానిమాస్ గదండీ మరీ ?
ఈ మధ్య ఓ లబ లబ కూడా లబ లబ లాడి పోయాడు - ఈ జిలేబి ఎవరబ్బా అని ముక్కు మీద వేలేసుకుని వెళ్లి వెళ్లి భారారే గారినే (వారే కదా 'హారం' అధినేత గారు ) అడిగేసాడు. ఆ భారారే గారు కూడా ఖంగు తిని ఆ జిలేబి సుద్ధ వేష్టండి అన్నారని గ్రేప్ వెయిన్ స్టొరీ ఒక టి విన్నాను ) . అంతే గాక వారెవరో మరో వరూధిని గారట, మాంచి సిరి సిరి మువ్వలతో సరిగమలు పలికిస్తూ చాలా సునాయాసం గా రాసేస్తూ వుంటారు - వారి కే ఈ జిలేబి కీ మధ్య ఒక పెద్ద కన్ఫుషన్, ఈ బ్లాగర్లు కూడా ఒక్కో మారు వారే వీరేమో, వీరే వారేమో అని జిలేబి అనవలసిన చోట వరూధిని గారు అని, వరూధిని అన వలసిన చోట జిలేబి అని మరో కన్ఫుషన్ క్రియేట్ చేసేస్తూంటారు ! నాకు మరీ పెద్ద డౌటు ఇద్దరూ ఒకరేమో అని కూడా.
ఆ మధ్య ఆవిడ , కంటెంటు లేని టపా కనులకి కనపడదని ఓ బ్లాగ్ సామెతల లిస్టు కూడా ఇచ్చింది.
ఈ విషయమై ఆలోచిస్తూంటే , ఇంతకీ టపా టైటెల్ ఏమిటన్నాను? అబ్బా నా మతి మరుపు కాకి ఎత్తుకుపోనూ, ఈ జిలేబి ఎవరబ్బా ?
చీర్స్
జిలేబి