Saturday, December 31, 2016

అదిగో భీముడొస్తున్నాడు :)


అదిగో  భీముడొస్తున్నాడు :)

వడివడి గా భీముండొ
చ్చు డిజిధన జిలేబి యాపు చూడండర్రా
కుడిచేతి బొటన వేలిక
నడయాడగ దస్కములటు పారున్నర్రా !

చీర్స్
జిలేబి

Tuesday, December 6, 2016

మేడం జయ - ఒక నివాళి - జిలేబి

 
 
మేడం జయ - ఒక నివాళి - జిలేబి


 
 
 

అదిగో జయలలిత పయన
మదిగో యింద్ర సభయందు మహిమాన్వితమై
పదిలంబుగా నమరగన్,
పదికాలము నిలుతువమ్మ ప్రజల మనమునన్

జిలేబి
 
 

Saturday, November 26, 2016

మాన్యు 'మెంటల్' 'మిస్' మేనేజ్మెంట్ - అయ్యరు గారి తో కాఫీ - జిలేబీయం !



మాన్యు 'మెంటల్' 'మిస్' మేనేజ్మెంట్ - అయ్యరు గారి తో కాఫీ - జిలేబీయం !


వేడి వేడిగా పొగలు సెగలు కక్కుతున్న కాఫీ టేబిల్ మీద పెట్టి

"ఏమోయ్ జిలేబి ఏమిటి నీ బ్లాగు విశేషాలు" పృచ్చించేరు  మా అయ్యరు గారు.

వేడి కాఫీ తాగుదామని పెదవుల దగ్గిరికి తీసుకుని చప్పరిస్తో ఆ ప్రశ్న కి ఉలిక్కి పడితే  పొలమారి కాఫీ గుండె లో కి దూసు కెళదామా అని చూసింది !
 

అయ్యర్వాళ్ నేనే కదా దేశం లో పరిస్థితులు ఏమిటి అని మామూలు గా అడిగే దాన్ని ఏమిటి మీరు ఈ మారు అడుగు తున్నారు ? అంటూంటే

అయ్యరు గారు    హిందూ పేపర్ లో తల బెట్టేసేరు అంత లో !

".... మొన్న జిలేబి తయారు చేస్తామని ప్రయత్న్తిస్తే అది మైసూర్పాక్ అయి పోవడం గుర్తు కొచ్చి చెప్పా

ఈమధ్య యింటి పట్టున
మైమరచి జిలేబి జేయ మైసూర్పాకై
తా మారగాను జయ్యని
నో మారు వసుంధరమ్మ నోట్సు కదిపితీ :)

మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంటోయ్ మా అయ్యరు గారు సెలవిచ్చారు !

మాన్యుమెంటల్ మిస్ మేనేజ్ మెంట్ ! నోరు వెళ్ళ బెట్టేసా !

అవునోయ్ ! జిలేబి పేరు పెట్టు కుని జిలేబి తయారు చేస్తే మైసూర్ పాక్ అది కాస్తా అయితే మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్ కాకుంటే ఇంకేమిటి ? అన్నారు అయ్యరు గారు.

గుర్రు గా చూసా వారి వైపు. !

అంటే అర్థం ఏమిటండి ? అడిగా వారిని సందేహం తో !

యిదిగో జిలేబి నాకు తెలిసిన తెలుగు చాలా తక్కువ - స్మారక అనిర్వహణ అనొచ్చను కుంటా అన్నారు వారు !

స్మారక అనిర్వహణ ?  అడిగా సందే హం తో  అంటే అపస్మారక అనిర్వహణ కూడా ఉంటుందేమో అనుకుంటూ !

అవునోయ్ ! ఈ మాట నాది కాదు మన మనమోహనుల వారిది !

మనమోహనుల వారిదా !

అవునోయ్ !
అయితే అది ఖచ్చితం గా అపస్మారక నిర్వాకమే అయ్యుంటుంది లెండి అన్నా మళ్ళీ జిలేబి వేద్దామా లేక , సమోసా కాపీ రైటు కూడా మనమే కొట్టేద్దామా అన్న ఆలోచనలో పడి పోతూ !
ఏమోయ్ , మిస్, ఏమి మేనేజ్ చేయాలను కుంటున్నావ్ ?

నోట్లోంచి పదాలు రావటం లేదండి !

అయితే ఓ స్పీకర్ పెట్టు కోవోయ్ !  అట్లా అయితే అది మరో మాన్యుమెంటల్ "మిస్" మేనేజ్ మెంట్ ఖచ్చితం గా అవుతుంది అన్నారు అయ్యరు గారు !  'దేశం లో యిప్పుడు ముగ్గురు 'మిస్' మేనేజ్ మెంటు చేస్తొంటే వాళ్ళ తో బాటూ నువ్వు కూడా చెయ్య వోయ్'


యిదిగో అయ్యర్వాళ్ మీ పోలిటిక్స్ నాకర్థం కావు సుమండీ !నా జిలేబి చుట్టటం లో నే పడతా అంటూ కాఫీ ముగించి మళ్ళీ నా పదాల వేటలో నే పడ్డా !



చీర్స్
జిలేబి 

Wednesday, November 23, 2016

డాక్టర్ బాలమురళీ కృష్ణ - ఒక నివాళి !


మనీ ముందు పెట్టు - మోహనం పాడతా !
 
 
 

అవనిని బేర్చిన రాగము
లవలీలగ నారదాదులకు వినిపించ
న్నవ భావోద్వేగముతో
భువి వీడితి వోయి బాలమురళీ కృష్ణా !
 
 

ముంబై షణ్ముఖానంద చంద్రశేఖరేంద్ర ఆడిటోరియం లో డాక్టర్ మంగళంపల్లి వారికి 'Life time achievement in Fine arts' అన్న అవార్డుని సభా వారు అందించారు. మహారాష్ట్ర గవర్నరు గారు బాలమురళి కృష్ణ గార్ని సత్కరించారు. ఈ సమయం లో మరో ముగ్గురు యువ కళా కారులని కూడా సంగీత శిరోమణి అని సత్కరించారు.

ఈ సందర్భం లో గవర్నరు గారు బాలమురళీ గారిని పొగుడుతూ,  సరస్వతీ, మహాలక్ష్మీ పరిపూర్ణ కృపా కటాక్షాలు డాక్టర్ మంగళంపల్లి వారికుందని ఆయన సంగీతానికి 'gggreat service' (అదేమండీ మూడు 'జీ' లు పెట్టేరు అంటారా, గవర్నరు శ్రీ శంకర నారాయణన్ గారు మలయాళీ లాగున్నారు , గ్రేట్ సర్వీస్ ని వారు అలా 'నొక్కి' వక్కాణించారు మరి, కేరళా స్టైల్ లో) చేస్తున్నారని చెప్పారు.

వారి ప్రసంగం తరువాయి మంగళంపల్లి వారు ఈ పిట్ట కథ చెప్పేరు

'గవర్నరు గారు సరస్వతీ, మహాలక్ష్మీ కటాక్షాలు నా పై ఉందని చెప్పడం నా జీవితం లో జరిగిన ఒక సంఘటన ని నాకు గుర్తుచేస్తోంది.

తమిళ నాడు లో చెట్టియార్ వారి పెళ్లి లో పాడడానికి వారు వెళ్ళినప్పుడు జరిగినది ఇది. చెట్టియార్ గారి పెళ్ళిళ్ళలో ఒక విద్వాంసుడు మూడు గంటలు పాడితే, మరో చెట్టియారు మరో విద్వాంసుడిని పిలిచి ఆ విద్వాంసుడి కన్నా ఎక్కువ సేపు పాడాలని చెప్పే రకం అన్న మాట అంటే, ఎవరెక్కువ సేపు పాడితే వారి అభిప్రాయం ఆ విద్వాంసుడే మరీ గొప్ప అన్న మాట!.

వీరు వెళ్ళిన పెళ్లి లో బాలమురళీ గారు, మూడున్నర గంటల పైన కచేరీ చేసేరు. ఆ పై న ఆ చెట్టియారు వచ్చి 'సామీ, మోహనం పాడండని అడిగే డ ట.

మంగళం పల్లి వారన్నారట,చెట్టి గారు మొదట  నా ముందు మనీ పెట్టండి ఆ పైనే మోహనం పాడతా అని.

చెట్టి గారు మరీ కోప్పడి, 'సామీ, చెట్టి వారు, ఎప్పుడైనా కచేరీ కి డబ్బులివ్వక పోయారా?' అన్నాడు

మంగళం పల్లి వారు, తాను భీష్మించు కున్నారు, మనీ ముందర పెడితే గాని మోహనం పాడ నని.

ఈ మారు చెట్టి గారికి మరీ కోపం వచ్చి, 'ఇది మాకు ఇన్సల్ట్' అంటే, అదేమో నాకు తెలీదు, ముందర మనీ పెట్టండి మోహనం పాడతా అని మంకు పట్టేరు బాలమురళీ వారు.

మొత్తం మీద చెట్టి గారు, డాక్టరు గారి ముందు మనీ పెట్టారు

ఆ పై బాలమురళీ వారు మోహనం గా మోహనం పాడారు.

అది విని తాదాత్మ్యం చెందిన చెట్టి గారు, స్వామీ, ఇంత గొప్ప గా పాడేరు, అయనా ఆ మనీ ముందర పెట్టడం అన్నదానికి ఎందుకు మొండి పట్టేరు? మా మీద మీకు నమ్మకం లేదా ? మీరు పాడేక , డబ్బులివ్వమని సందేహమా మీకు ? ' అని వాపోతే,

మంగళం పల్లి వారన్నారట, 'చెట్టి గారు, మోహన రాగం స,రి,గ ప ద స , స ద ప గ రి స. అంటే, మోహనం లో మ, ని లేదు. అందుకే మనీ ముందర పెట్ట మన్నా. స్వప్త స్వర ఘోష అయ్యింది కదా, మీ పెళ్లి లో, అంటే, చెట్టి గారు మరీ ఖుషీ పడి , డాక్టరు గారిని మరింత గొప్ప గా సత్కరించేరు.!

అదీ కదా సరస్వతీ, మహా లక్ష్మీ కటాక్షం అంటే !

 
జిలేబి 

Memories from ముంబై musings!
డిసెంబర్  22, 2012.

ఫుట్ నోట్ - 21st feb 2017- added:

Source->

http://chitrakavitaprapancham.blogspot.com/2017/02/blog-post_98.html


ఒక కవి ఒక రాజు దగ్గరకు వెళ్ళి
ఆ రాజును సంబోధిస్తూ ఈ శ్లోకం చెప్పాడు-

య దస్తి ద-ప యోర్మధ్యే త దస్తి తవ మందిరే
తన్నాస్తి మద్గృహే రాజన్ తదర్థ మహ మాగతః


ఓ రాజా ద-ప మధ్య ఉన్నదేదో అది నీ యింట ఉన్నది.
అది మా గృహంలో లేదు దానికోసం వచ్చాను మీవద్దకు-
అని భావం.

ఇంతకు ఏది ఆయన దగ్గరుంది
ఈయన దగ్గరలేనిది ఏదే ప్రక్కనున్నవారికి
అర్థం కాలేదు. ఇంతకు ఏమిటది-

తథదధన - పఫబభమ
అనే అక్షారాలు తీసుకుంటే
అందులో ద - ప లమధ్య
ఏముందో తెలుస్తుంది.
తథద ధన  పఫబభమ
వీటి మధ్య ధన అనేది ఉంది కదా!
అదేనండీ ధనం దానికోసం వచ్చాడు ఆయన.

Wednesday, November 9, 2016

ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా !


ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా !


కొండ మీద ఏడు కొండల రాయుడికి ఏకాంత సేవ మొదలయింది. భోగ శ్రీనివాసుల వారికి పానుపు సేవ చేస్తూ స్వామి వారిని చూచి 'స్వామీ! ఇవ్వాల్టి కి బాగా నిద్ర పొండి! రేపట్నించి మన లైఫే వేరు ' పూజారి స్వామి వారు చెప్పారు !

నిద్ర పోయే ముందు కనుక్కుందామా లేదా ఆ ఏమైతే ఏముంది లే ! అంతా విష్ణు మాయే గదా అని రవ్వంత ఆలోచనలో పడి, సావకాశం గా ఎందుకైనా కనుక్కుంటే మంచిదే అనుకుని, మరీ 'ప్రాబ్లం' ఏదైనా వస్తే 'సిక్ లీవ్' పెట్టేయొచ్చు అనుకున్న స్వామి వారు, 'ఏమోయ్ ! ఎందుకు రేపటి నించి లైఫే వేరు అంటున్నావ్ ' అన్నాడు సందేహం గా !

అర్చక స్వాముల వారు ముసిముసి నవ్వులు నవ్వారు !

స్వామీ ! ఇక మీరు మీ కుబేరుల వారి బకాయి చెల్లించే రోజులు దరిదాపుల్లో కి వచ్చేస్తాయను కుంటా ! చెప్పాడా యన !

స్వామి వారికి మహానందం కలిగింది ! 'నిజంగానా' ! అంటూ దాంతో తలే ఉంగలీ దబాయించేసారు !

అవును స్వామీ ! మీ అనుంగు శిష్యుడు మోడీ దేశం లో పెద్ద నోట్లకి బందు చెప్పేసాడు. ఇక మీకు పండగే పండగ ! కట్టల కొద్దీ నోట్లు యిక హుండీ వశం ! డబ్బులు మానావరి గా వస్తే మీ బకాయి తీరినట్టే కదా !

నిజంగా వస్తుందంటావా ? స్వామి వారు ఇంతకు మునుపు కూడా ఇట్లాంటి వి చూసి వున్నారు ! ఆ మారు కూడా బకాయి తీరలే! ఏమో ఈమారైనా వస్తుందా ? తన బకాయి తీరు తుందా !

హు! ఆశ ఎవరిని విడిచింది ! ఏమో బకాయి తీరేంత దస్కం వస్తుందే మో ! ఎవరికీ తెలుసు - స్వామి వారు ఆశా భావం వ్యక్తం చేసారు !

అందుకే స్వామీ ! ఇవ్వాళ బాగా రెస్టు తీసుకోండీ ! రేపట్నించి నోట్ల లెక్కలు ఇక మనం జబర్దస్తీ గా 'మోడీ' లెట్ట వచ్చు ! అర్చక స్వామి వారు చెప్పారు !

స్వామి వారు ఆవులించారు !

ఆ ఆవులింత లో జగమంతా అర్చక స్వామి వారికి కనబడి  పదునాలుగు లోకాలావల పంచదశ లోకం లో జిలేబి కూడా కనబడింది :)

చీర్స్
జిలేబి  

Tuesday, November 8, 2016

కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !

 
 
 
 
కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !
అదిరిందా ? కుదిరిందా ?
ముదితా !రమణీ !జిలేబి ! ముద్దుల పద్యం
బదురుచు దాగెన్బోవే !
కుదురిన సమయము టపాల కుంకుమ నిడితీ !
 
 
చీర్స్
జిలేబి
 
 
 

Monday, November 7, 2016

సంధ్యావందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!






సంధ్యావందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!
 
వింధ్యారణ్యములందు భక్తజనుడై విద్వత్తు మేల్గాంచ భ
ద్రం,ధ్యాతవ్యమునిగ్గు తేల వలయున్; దాంపత్య సంసార మో
హం ధ్యానీయము మానవాళి కిచటన్ హాసంబు లావణ్యమై
సంధ్యా, వందన మాచరింప వలయున్ చౌశీతి బంధమ్ములన్!


సావేజిత
జిలేబి  


Thursday, November 3, 2016

ఒక సమోసా కథ - జిలేబీయం :)


ఒక సమోసా కథ - జిలేబీయం :)
 
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమి :)

ఈ కథలో వచ్చిన బ్లాగర్ల పేర్లు వాళ్ళ బ్లాగు అడ్రస్ లు

మీకు తెలిస్తే చెప్పుకోండి చూద్దాం :)

****
 
 

ప్రాణి నంబర్ 1. బ్లాగరు సమోసా! బ్లాగరు సమోసా!”

సమోసా ప్రాణి ముందుకొచ్చింది.

యముడు చిత్రగుప్తుడి వైపు తిరిగి అడిగేడు, “ఏమిటీయన చేసిన పాపాలు?”

“ఈయన కాదండి, ఈవిడ.”

“ఓహో సరే, ఈవిడ చేసిన తప్పులేమిటి?”

“బ్లాగు మొదలుపెట్టిన రోజుల్లో సమోసా ఎలా తయారు చేయచ్చో, కారప్పూస ఎలా చేయచ్చో, మరోటీ, ఇంకోటీ స్నాకుల గురించీ రాసేవారు. కానీ ఉత్తరోత్తరా ఆటవెలదీ, తేటగీతి అనే తెలుగు పద్యాలు రాయడం నేర్చుకుని జనాల్ని చంపుకు తినడం సాగించారు. ఉదాహరణకి చూడండి:

ఏ.తె. నిజమాటల ననుచును త
            నజబ్బలను చరచుచు, టపటప మనుచు
            నిజమేనని చెప్పుటమేలా?
             ఈజనులకు వేస్టు సామోసా గరగరం పల్కు!

“ఏ.తె. అన్నారేమిటి? ఇదేమి వృత్తం? కందమా, ఆటవెలదా, తేటగీతా?” యముడు కాస్త అనుమానంగా అడిగేడు.
“ప్రభో, నన్నా అడుగుతున్నారు? నాకు ఈ చిట్టా చూడ్డానికే సమయం సరిపోవట్లేదు.” చిత్రగుప్తుడు అరిచేడు.


“అయినా అసలు కధ చెప్పబోతున్నాను వినండి. ఇలాంటి పద్యాలు ఈవిడ తన బ్లాగులోనూ, ఇతర బ్లాగుల్లోనూ కామెంట్ల రూపంలో వేయడం మొదలు పెట్టింది. దాంతో ప్రతీ ఒక్కరూ పద్యాల్రాయడం మొదలెట్టారు. అది ఎంతవరకూ వచ్చిందంటే నాలుగు లైన్లు రాయడం కూడా రాని వాళ్ళు, వచ్చినా రాయని వాళ్ళు, అసలు ఛందస్సంటే ఏవిటో తెలీనివాళ్ళు, కొత్తరకం ఛందస్సు మొదలు పెట్టి ఇలా ఏ వృత్తానికీ పట్టని పద్యాలు రాయడం సాగించారు. ఈవిడ సృష్టించిన ఈ పద్యం ఏ.తె. అని ఎందుకన్నారంటే ఎవరైనా ఇదేం వృత్తం అని అడిగితే ‘ఏమో తెలియదు’ అని చెప్పడానికి అంటున్నారు. అదీ కష్టం అనుకున్న జనాలు…”


“ఏవిటీ, నాలుగు లైన్లు రాయడం కష్టమా?”


“…అదేకదండి మరి వింత? అదీ కష్టం అనుకున్న జనాలు నానీలనీ, మినీలనీ, వానీలనీ మొదలుపెట్టి రెండు లైన్లతో, ఒక్కలైనుతో రాస్తున్నారు. ఇదేమి వృత్తమయ్యా అంటే ఇదో కొత్తది మీరూ నేర్చుకోండి అనే ముక్తాయింపు మొదలైంది. రెండు ఇంగ్లీషు పదాలు లేకుండా ఓ తెలుగు వాక్యం నోట్లోంచి రావట్లేదు వీళ్ళకి.

ఈవిడ పద్యాల దగ్గిరకొస్తే ‘సమోసా’ అనే పదం వచ్చేలాగ పద్యాలు రాస్తో జనాలని కుడీ, ఎడమగా వాయిస్తోందీవిడ.”

పూర్తిగా చదవండి !

చీర్స్
జిలేబి

Saturday, October 29, 2016

దీపావళీ శుభాకాంక్షలు !



 
 
దీపావళీ శుభాకాంక్షలు !
 
 
అందరికీ దీపావళి
యందము గా వెలుగు దివ్వియల జీవితమై
డెందంబానందంబుల
బొంద వలయు నిలన యష్ట భోగముల గనన్ !
 
 
 
 
శుభకామనలతో
జిలేబి

Friday, October 28, 2016

పొట్టలో చుక్క !

 
పొట్టలో చుక్క !
 
 
ఒక వృత్తానికి
 
ఒకే ఒక కేంద్రం
 
ఒక కేంద్రానికి
 
అనంతమైన
 
వృత్తాలు !
 
శుభోదయం
జిలేబి