Friday, January 26, 2018

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !



గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !
 
 

కందము
 
మన దేశము కోశమయా
జినుగుల పాశమ్మును విడజిమ్మగ నరుడా !
మనవులు చెప్పితి నాశము
మన రీతియు గాదు సూవె మహిలో సఖుడా ! 
 
*****
 
తేటగీతి
 
దేశ మేమిచ్చెననకు నే దేశమునట
నెగడు కోశముగా నిల్ప నీమమున్ గొ
ని పని జేసి వినాశమున్నింకు జేయ
నేమి చేసితి పాశము నేర్వ దగును !
 
*****
 
ఆటవెలది
 
దేశమున్ జనాళి దేవళమ్ముగ జూడ
వలె వినాశ మెల్ల వదుల వలెను!
కోశ మవగ వేద ఘోష జిలేబియ
పాశము గను మేలు బాంధవమ్ము !
 
*****
 
మత్త కోకిల
 
దేశమాయెను భారతమ్ముర దేవభూమిగ వెల్గుచున్
కోశమాయెను వేదవిద్యకు కోరి పుట్టిరి దేవతల్
నాశమయ్యిరి దుష్టులున్ను సనాతనమ్మును గూల్చగన్
పాశమున్ గొని దీటుగానటు పాజమున్ గొ‌న మేలగున్
 
*****
 
ఉత్పలమాల
 
దేశము నీది నాది సయి దేవళ మై వెలి గెన్ జనాళికిన్
కోశము వేద వాక్కునకు, కోరిరి దేవతలున్ ప్రభూతి కా
వేషము లెల్ల తీరగను ; పెక్కు వినాశములన్నెదుర్కొనెన్,
భూషణ చేయు పాశముగ భూరిగ దీటుగ జైజవాన్! కిసాన్!
*****
 
చంపకమాల

చలిమల పైన సైనికులు శాంతిని జేర్చుచు దేశమున్ సదా
వలయము గావ కోశముగ వర్ధిలె భారత భూమియే ధరా
తలమున వేద సారముల తత్త్వము పాశము వీడ నేర్పుచున్
పలికె వినాశముల్ వలదు; పాడదగున్ భళి కీర్తి చంద్రికన్
*****
 
శార్దూలము

నాదేహంబను జాలమున్ విడుమయా! నాదేశ పాశంబు నీ
దై దారుఢ్యమవన్ వినాశముల నీదౌ కైపులన్ ద్రోలుచున్
వేదమ్మే మన కోశమై ప్రజలకున్ విద్యావిధానమ్ముగా
సాధించన్దగు శాంతి సౌఖ్యము నిలన్ శార్దూలమై నిల్చుచున్
*****
 
పంచ చామరము

నినాద మిద్ది దేశ మున్ సనీడ గాను నిల్పుమా
వినాశ మేల పాశ మేల విశ్వ మెల్ల నీదయా !
సనాతనమ్ము భావ మెల్ల సాగరమ్ము, నీదు దే
శ నాడి కోశమయ్య, మేలు జన్మ భూమి నీదయా


మత్తేభ విక్రీడితము

మన దేశమ్మది కోశమయ్య భువిలో మాన్యంబుగా వేదవా
క్కునకున్, ధర్మపథమ్మునన్ మెలయ నిగ్గుల్దేల్చు పాశమ్ము బో
వ నరుల్ జీవిత మందు నిమ్మళము గా భాసిల్ల! కాపాడు కొ
మ్మ నమస్సున్నిడి దేశ మాతకు నిటన్ మాన్పించి నాశమ్ములన్!

 
 
జైహింద్
జిలేబి
 
 


Saturday, January 20, 2018

మా అయ్యరు గారు దారి పోయారు ! కనబడ్డారా మీకేమైనా ?



మా అయ్యరు గారు దారి పోయారు ! కనబడ్డారా మీకేమైనా ?


పొద్దుటే లేచి భయభక్తుల తో అయ్యరు గారి కాళ్ళకు మ్రొక్కి ఆ పై గాని తన పద్య ప్రహసనం లో పడని జిలేబి,
నిదుర లేచి చూస్తే మంచం పై అయ్యరు గారు కన బళ్ళే

గుండె గొంతుకలో కొట్లాడింది జిలేబికి.

ఇంత పొద్దుటే అయ్యరు గారెక్కడ పోయేరబ్బా అనుకుని అటూ యిటూ చూసి జానాబెత్తెడు ఇంటి ని మొత్తం గాలించి గాలించి అలసి సొలసి కన్నుల్లో కన్నీళ్లు ఉబికేస్తోంటే ముక్కు చీదేసు కుంది !

హయ్యో !హయ్యో! నిన్న రేతిరి కూడా అయ్యవారు పక్కనే కదా ఉన్నారు !

వారిని ఓ మాటై నా అనలేదే ! ఇట్లా హఠాత్తుగా గాయబ్ అయిపోయారే రాత్రికి రాత్రి !

లైఫ్ లైన్ నూట పదహారు కి ఫోన్ చేద్దామా అనుకుని బెంబేలు పడి పోతూంటే దైవేచ్చ గా
"నా మొబైలు చార్జెరు ఎక్కడ పోనాది ; ప్రశ్న వేసి చూసా" కనిపిస్తే హా హా హా ! మా అయ్యరు గారు ఎక్కడ పోయేరనిప్రశ్నిస్తే చాలనుకుని

అయ్యరు అయ్యరు ఎక్కడ మీరు అని ప్రశ్న వేసుకుని సమయం చూసుకుంది - ప్రొద్దుట నాలుగు గంటల నాలుగు నిమిషాల నాలుగు సెకన్లు ! బ్రహ్మ ముహూర్తం !

ప్రశ్న వేసిన సమయానికి చార్టు లాగింది జూనియర్ జ్యోతిష్ నించి !


నోరు నొక్కేసు కుంది ఆ చార్టు అనాలిసిస్ చూసి !

హయ్యో హయ్యో ! ఇంత మోసమా ! ఇంత మోసమా !
ఏమండీ ! అయ్యరు గారు ఎక్కడ పోయారు మీరు ! ఇట్లా సన్యాసాశ్రమం మీకు సబబా ! హయ్యో హయ్యో !


దబ్బున మంచం మీది నించి క్రింద పడిన శబ్దం !

చెవుల దగ్గిర జిలేబి జిలేబి అన్న ఆతురత తో కలిసిన శబ్దం !

ఏమండీ ! అయ్యరు గారు మీరెక్కడ ! మీరెక్కడ ! హిమాలయాల్లో ఉన్నారా ! అంటూ వాగేస్తున్న జిలేబి ముఖం మీద కూసింత మంచి నీళ్ళు ప్రోక్షించి అయ్యరు గారు తట్టి లేపారు !
ఆ చల్లని జిల్లను నీటి కి నిదుర వీడి చూసింది జిలేబి

జానా బెత్తెడు ఇంటి లో జాన కన్న తక్కువ మంచం పక్కన తను క్రింద పడి ఉంది ! అయ్యరు గారు పరామర్శిస్తున్నారు !

హమ్మ ! ఇది నిద్రా ! కలా !

హా హా ! జిలేబి

ఏమాయెన్ బో లోకం !

అయ్యరు వాళ్ ! మీరు హిమాలయాల కెళ్ళి పోయేరని కల గన్నా ! చెప్పింది జిలేబి ఆందుకే ఈ ఆతురత!


ఓ నా పిచ్చి జిలేబి ! అట్లాంటి యోగం నాకీ జన్మలో లేదని నువ్వు నన్ను కట్టు కున్నప్పుడే తెలిసి పోయిందే ! అట్లా ఎట్లా కలగంటావు అని అయ్యరు గారు అంటే ,

హా హా మగడంటే మా అయ్యరే గా అని మురిసిపోయి జిలేబి మళ్ళీ ఫార్మ్ లోకి  వచ్చేసి 'అయ్యర్వాళ్ ఓ మంచి కాఫీ పట్టు కు రండి ఇవ్వాళ శంకరాభరణం లో దత్తపది వ్రాయాలి ; అతిరుచిరము తో ఓ జిలేబి వేస్తా అంటూ ఆర్డర్ వేసేసింది జిలేబి యథా ప్రకారము గా !

హా ! నా జ్యోతిష్య మా ! జిలేబి కతల కు కూడా పనికి రాకుండా పోయేవా !


చీర్స్
జిలేబి
నారాయణ నారాయణ !

Sunday, January 14, 2018

సంక్రాంతి శుభాకాంక్షల తో !



 
బ్లాగ్ వీక్షకుల కందరి కీ
 
సంక్రాంతి శుభాకాంక్షలు !
 
మైలవరపు వారి సంక్రాంతి వర్ణన
 
కొక్కొరోకో యను కోడికూతకు లేచి
నిత్యకృత్యమ్ముల నెఱపి యంత ,
క్రొత్త బట్టలు గట్టి కూరిమి బెద్దల
పాదమ్ములకు మ్రొక్కి పాలు త్రాగి ,
గోమాత నుదుటను కుంకుమదీర్చియు
భోగిమంటను జేరి మోదమంది ,
ముంగిట దీర్చిన రంగవల్లిక జూచి
పులకించి , నెమ్మది పొంగి , మురిసి ,
హరిలొ రంగా యను నాలాపనము విని
పరుగెత్తుకొని వచ్చి పలకరించి ,
గంగిరెద్దులవాని గమనించి పాతదౌ
పట్టుచీరనొకటి వానికిచ్చి ,
బుడబుక్కమని చేతిమునివ్రేళ్లతో డప్పు
వాయించు వానికి బట్టలిచ్చి ,
వంటింటి ఘుమఘుమల్ వడ్డింపగా దిని
మేలు మా యమ్మంచు మెచ్చి మెచ్చి ,

నవ్వు పువ్వుల రువ్వి యానందమంది ,
దాన ధర్మమ్ములొనరించి ధన్యత గొన ,
పదుగురొకచోట జేరుట పండుగ యగు !
తెలుగు లోగిళ్ల కొంగ్రొత్త వెలుగులమరు !! 

               శ్రీ  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

Wednesday, January 10, 2018

పదమూడన్న భయమ్మదేల రమణీ :)



పదమూడన్న భయమ్మదేల రమణీ ప్రార్థింపు మా యీశునిన్


అదేమో గానండి న్యూమరాలజీ, వాస్తు, సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్యం, 'దుష్ట తిథి' గట్రా లను చూస్తే , వాటి విషయం చదివితే వెంటనే ఓ కామింటు ఉల్టా వేయా లని పిస్తుందండీ :)

క్రితం రోజు మన దీక్షితులు గారు త్రయోదశి గురించి టపా రాస్తే టట్ అని వెంటనే 'తాత పల్కుకు సవాలు వేయము' అని ఓ డిండిమ కట్టేసా :)

అదేదో మరీ నారదాయ నమః అయి పోయినట్టుంది; శర్మ గారి మనసు నొచ్చేసు కున్నట్టుంది . తిట్టి నట్టు న్నారు సుమా జిలేబి గారు అనుకున్నారు !

అబ్బే ! మన యొజ్జ గారిని తిట్టడమా ! అనపర్తీశు ని తిట్టడమా ! అదిన్నూ మా గోజీ ల వారిని తిట్టడమా ! నెవర్ ! నో ! నో ! నో !


భట్టి తన భట్టి కావ్యము లో (రావణవధ) లో మొదటి పద్యాన్ని పదమూడు అక్షరాలున్న రుచిరమన్న రేర్ వృత్తము తో ప్రారంభించేడు ! సవాలే సవాలన్నట్టు త్రయోదశ పదము లతో :)

అదిన్నూ ఈ రుచిరము లో మొదటి గణము జగణము (మరీ జిలేబి ) :)

అభూనృపో విబుధ సఖా ! పరం తపః అంటూ  దశరథుని గుణ గణా లతో రుచిరమన్న పదమూడు అక్షరాలున్న వృత్తము తో ప్రారంభిస్తాడు :) అది గుర్తు కొచ్చి సవాలు వేసా :) అంతే నన్న మాట !

ఏమండీ దీక్షితుల వారు సరియా ?

అభూనృపో విబుధ సఖః పరంతపః
శ్రుతాన్వితో దశరథ ఇత్యుదాహృతః ! !

చీర్స్
జిలేబి

బిలేజి పద్యములవి భీతిగొల్పెనే :)
(రుచిరము)

Monday, January 8, 2018

జిలేబి వరుసల్ భళిభళి చిత్రమయ్యెనే !



జిలేబి వరుసల్ భళిభళి చిత్రమయ్యెనే !
 
దత్తపదికి డిండిమ తో చిన్న ప్రయత్నం !
 
నిషంగదియె కందివరులు! నెమ్మ దిన్ సదా
విషక్తముగ నిచ్చు ! భళి కవీశ్వరుండితం
డు! సంఘమును జేర్చెనదియె డోల నమ్ములా
డ! శంకరుని కొల్వు పదికుడా! రమించుమా
!

డిండిమ
జిలేబి
 
దత్తపది - 130 (నది-మది-పది-గది)
నది - మది - పది - గది
పై పదాలను ఉపయోగిస్తూ గురుశిష్య సంబంధాన్ని వివరిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో శివరామకృష్ణ గారు ఇచ్చిన దత్తపది)
 
 
 
 
డిండిమ
 
నిషంగదియె కందివరులు! నెమ్మ దిన్ సదా
విక్తముగ నిచ్చు !భళి కవీశ్వరుండితం
డు! సంఘమును జేర్చెనదియె డోల నమ్ములా
! శంకరుని కొల్వు పదికుడా! రమించుమా !
 
౦౦౦
 
డిండిమ

డిండిమ పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. అతిశక్వరి ఛందమునకు చెందిన 11230 వ వృత్తము.
  3. 15 అక్షరములు ఉండును.
  4. 20 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణి: I U I - I I U - I I I - I U I - U I U
    • త్రిమాత్రా శ్రేణి: I U - I I I - U I - I I I - U I - U I - U
    • పంచమాత్రా శ్రేణి: I U I I - I U I I - I I U I - U I U
    • షణ్మాత్రా శ్రేణి: I U I I I - U I I I I - U I U I - U
    • మిశ్రగతి శ్రేణి (5-4) : I U I I - I U I - I I I U - I U I - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు జ , స , న , జ , ర గణములుండును


చీర్స్
జిలేబి


Monday, January 1, 2018

2018 - నూతన వత్సర శుభాకాంక్షల తో !




బ్లాగ్వీక్షకుల కందరికి
 
నూతన సంవత్సర శుభాకాంక్షల తో
 
 
నూతన వత్సర మండీ !
చేతము సరికొత్త బాస చేకూర భళా
జోతలు మనకెల్లరికిన్
సాతము భువిలో నెలకొని సారంగమవన్ !
 
 
 
 
జిలేబి