Wednesday, January 11, 2012

అర్ధాంగీ కారం !

అర్ధ అంగీ కారం

అర్ధాంగీ కారం

అర్ధాంగీకారం

ఏమీ చెయ్యలేం

పెళ్లప్పుడే అంగీ చుట్టి

కట్ట బెట్టేసుకున్నారు !



చీర్స్
జిలేబి.

Tuesday, January 10, 2012

వేదం లో ఏముంది ?

వేదం లో

'ఉప' యోగానికి

పనికి వచ్చేవి ఉన్నాయి

'పని' కి

వచ్చే ఉపయోగాలు లేవు



జిలేబి.

Monday, January 9, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - 10 - భామా విజయం - 5

"తమ పాద స్పర్శతో మా ఇంటిని పరమ పావనం చేసిన
శ్రీశ్రీశ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద పెద్ద స్వామీవారు,
శ్రీ శంకర విజయం గావించిన చిన బుజ్జి పండూ కుర్ర స్వామీ వారు,
గీతా కేసు విజేతా రాజీ వారు 
స్వాగతం సుస్వాగతం"


మధుర ఇంటి తలుపులు తెరిచి నాటకీయ ఫక్కీలో అందర్నీ ఆహ్వానించింది.

"మధుర గారు, నెనర్లు. కానీ ఈ ఫ్లైట్ లో తిన్న బ్రెడ్డు ముక్కలతో జిహ్వ రుచి అన్న దే మరిచి పోయింది. మాంచి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ వేసుకుని, వేడి వేడిగా అప్పుడే కాచిన నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది" అన్నారు బులుసు వారు, దహించు కు పోతూన్న ఆకలి తాళ లేక ఇంటిలోకి ప్రవేశిస్తూనే నీరస పడి పోతూ.

మధుర సంతోష పడి, "ఓస్, బులుసు గారు, అదెంత సేపవుతున్దండీ. దాంతో బాటే  నేను మీకు నిముషం లో మాంచి పసందైన దొండకాయ కూర చేసేస్తాను చూడండీ " అని వెంట నే కిచెన్ లో కి ఎంటర్ అయ్యింది.

రాజీ వారు కొంత సందేహ పడ్డారు!

మధుర బుజ్జి పండు వైపు తిరిగి "పండూ అండ్ కో, వంటయ్యేంత దాకా ఈ బుడత జిగురు ముక్క నోట్లో నములుతూ వుండండి. ఇక్కడి వెదర్ కి ఇది అవసరం " అని వారందిరికి బు జి ము ఇచ్చి తానొక్క ముక్క నోట్లో వేసుకుని దొండకాయ కూర చేసే ప్రాజెక్టులో పడ్డారావిడ.

వంట గదిలో కాకుండా హాల్లో మధ్యలో ఓ పేద్ద సెట్టింగు వేసుకుని దొండకాయలు కోసే ప్రాజెక్టు కోసం, ఓ పేద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుని, అందులో దొండకాయలేసి అది తీస్కెళ్ళి అక్కడ పెట్టుకుని ఆసాంతం తీరికగా కూర్చుంది మధుర.

ఇంకో గిన్నేమో కోసిన ముక్కలేయడానికి, మరొకటేమో, తీసేసిన ముచ్చికలు వెయ్యడానికి పెట్టు కుని . కడిగిన కాయలు తుడవడానికి ఒక నేప్కిన్ పెట్టుకుని, . కాయలు కోయడానికి ఓ చెక్క, కోసే ముక్కలు ఆ చెక్క మీద నుంచి కింద పడిపోకుండా జాగ్రత్త కోసం దాని కింద ఓ పేద్ద ప్లేటు, ఓ కత్తి, యీ సెట్టింగు అంతా పెట్టడానికి ఒక పీట, అలాగే తను కూర్చోడానికి మరో కుర్చీ ... ఇదీ ఆవిడ సెట్టింగు.

ఇలా ఓ అరగంటసేపు అటూ ఇటూ తిరిగి, అదెక్కడుంది ఇదెక్కడుంది అని వెతుకుతూ కావలసిన సరంజామా అంతా అమర్చుకున్నా క . ఎదురుగా టీవీ పెట్టుకుని, చేతికందేట్టు రిమోట్ కూడా పెట్టు కుని మధుర, ఇహ జైహింద్ అనుకుని దొండకాయలు తరిగే మహా యజ్ఞం మొదలు పెట్టింది.

ఎంతో పద్దతిగా, ఒద్దికగా ఒక్కొక్క దొండకాయ మీదా స్పెషల్ కేర్ తీస్కుంటూ తరగడం మొదలెట్టి, . అదేంటో, అంత ఇదిగా శ్రద్ధ తీస్కుని తరుగుతున్నా ముక్కలన్నీ ఒక్క షేపులో రావడం లేదు సుమీ అని హాశ్చర్య పోతూ

"బుజ్జి పండూ, నీకో కథ చెప్పనా" అన్నారు మధుర గారు.


ఇక్కడ ఈ తతంగం అంతా అర్ధ గంట పై బడి చూస్తూన్న ముగ్గిరికి ఆకలి పెట్రేగి పోతోంది.

"అమ్మాయ్ మధుర , నువ్వు నిజం గానే వంట చెయ్య బోతున్నావా ? లేక కథ అయ్యేకే మొదలెడతావా వంట వార్పూ? " బులుసు గారిని నీరసం కములు కొంది, "నా తల్లే నా బంగారమే....ఎంత పనిమంతురాలో ." అనుకుంటూ.

"సరే బుజ్జి పండూ కథ తర్వాత చెబ్తానే" అని వంట ప్రాజెక్టుని ప్లాంట్ బియో టెక్నాలజీ పీ హెచ్ డీ అంత శ్రద్ధ తో కొనసాగించి వంట ముగించి "టమాటో పప్పు వంట, అంతా రెడీ" అంది మధుర ఓ ముప్పావు గంట తరువాయి.

టమాటో పప్పు అనంగానే ముగ్గిరికీ మళ్ళీ జిహ్వ జివ్వు జివ్వు  మంది.

ఆ హా మన అదృష్టం జర్మనీ లో టమాటో పప్పు కలిపిన కాచిన వెన్న నేయి తో, దొండ కాయ కూరతో మధుర భోజనం - వొహ్ !

"వంట బాగుందండీ ? " మధుర అడిగింది అందర్నీ డిన్నర్ మధ్య లో

"మీ రాశి వారు వంట బ్రహ్మాండంగా చేస్తారు మధురా !" మెచ్చుకున్నారు రాజీ గారు.

బులుసు గారు "అమ్మాయ్ భోజనం బ్రహ్మాండం, కాకపోతే ఓ చిన్నమాట! ఇప్పుడు మనం అన్నం తిన్నాక మన అందరి చేతులూ రెండ్రోజుల దాకా ఇలా పసుప్పచ్చగా ఉంటే బాగోదు కదా! అందుకని, కొంచెం.. ఒక్క రవ్వ పసుపు తగ్గించాలేమో సుమా" అన్నారు తన పసుపు పచ్చని చేతులని చూస్తూ !

బుజ్జి పండు ఫక్కున నవ్వాడు.

"ఫ్రౌ మధుర గారు, రేపటి బ్రేక్ ఫాస్ట్ వేడి వేడి ఇడ్లీని కారప్పొడి, నెయ్యిలో ముంచుకు తింటే ఎలా ఉంటుంది! " అన్నాడు ఆ బుడతడు.

"థాంక్ యు థాంక్ యు " అని మధుర గారాలు పోయింది.

(ఇంకా వుంది )

Sunday, January 8, 2012

జిలేబి ఎచట ఉండును ?

జిలేబి

క్కువగా

దివిన

పాలలో

ఉండును!

చీర్స్

జిలేబి.

Saturday, January 7, 2012

ఛుక్ ఛుక్ బండి - ఆస్సాము ప్రయాణము- 1

డాక్టరు ఆవుల వారు వివేకానందా ఎక్స్ ప్రెస్సు గురించి రాసి మా ఆస్సామును గుర్తుకు తెచ్చారు మళ్ళీ నాకు.

ఆస్సాము ప్రయాణము అనేది ఒక మెగా ఎపిసోడు ! ఇలా మా మద్రాసు నించి ఆ త్రివేండ్రం గువాహాటీ ట్రైను ఎక్కినా మంటే ( ఎక్కడం అంటూ జరిగితే , అంటే ఆ ట్రైను ఎప్పుడు వచ్చునో మా ఏడుకొండల వాడికే ఎరుక, వచ్చినను, ఆ ట్రైను ఎప్పుడు గమ్యం చేరునో అనునది కామాక్యా మాతా వారి దయే!) ఇక మన ప్రయాణం లో పదనిసలు మజా మజా యే

ఆ మద్రాసు సెంట్రాలు గోల , మద్రాసు వేడి బాడీ ని ఓ పట్టు పడుతోంటే , దానికి తోడైన ట్రైను ఎంత లేటో అన్న 'ముఖ్య గమనిక ' మన మైండు ను తోలిచేస్తోంటే ఓహ్ ఈ ట్రైన్ మనం ఎక్కాల్సిన రైలు ఓ జీవిత కాలం లేటు అన్నది గుర్తుకు రాక మానదు.

పెద్ద పెద్ద ట్రంకు పెట్టలు, ఆ సి ఎమ్ సి కాకుంటే అపోల్లో హాసుపత్రి కై వచ్చిన పేషంట్ల తిరుగు ప్రయాణాలు, మద్రాసులో నే ఆస్సామీ , బెంగాలీ గల గల లు - ఒక మిక్స్డ్ ఫీలింగు ! - అబ్బా సెలవులు అయ్పోయాయి ఆల్రెడీ , ట్రైను జర్నీ తో టే మన నౌకరీ మొదలై పోయే అనుకోవటం కద్దు.

మొత్తం మీద ఆ ట్రైను నింపాదిగా సెంట్రాలు స్టేషన్ కి వచ్చాక ఇక కుస్తీ పడి ట్రైను ఎక్కేసామను కుంటే మన టిక్కట్టు ఎప్పుడు ఆర్ ఎ సి టిక్కెట్టే మరి - కాబట్టి ఆ సైడు బర్తు లో సీటులో అడ్జస్టు ఐపోయి ఆ వచ్చీ పోయే వారి, ప్లాటు ఫారం మీది ట్రైను వాళ్లకి బాయ్ బాయ్ చెప్పే వాళ్ళని చూస్తూ కాలం కొంత ఆ ఉక్క లో సాగిస్తే , ఆ పై రైల్వే వాడు కనికిరించి బండి ఛుక్ ఛుక్ అంటే ఓహ్ వాట్ ఎ  గ్రేట్ రిలీఫ్ !

చీర్స్
జిలేబి.

Friday, January 6, 2012

మీ శ్రీ వారు ఇంటి పనుల్లో మీకు సహాయం చేసేలా చెయ్యడం ఎలా ?

ఈ టపా లేడీస్ స్పెషల్. -- టాప్ సీక్రెట్ ! మగవారు చదివే ముందే చదివెయ్యండి !

అంటే మగవారు చదవ కూడదని కాదు. (చదివితే వాళ్లు ఈ కిటుకు తెలుస్కుంటే మనకి మేలు లేఅడు కాబట్టి వాళ్లు చదవరని ఆశిస్తాను!)


మీరు కిచెన్ తో తలమునకలయ్యే పనుల్లో బిజి బిజి గా ఉంటే, మీ వారు  పడక్కుర్చిలో నింపాదిగా కూర్చుని ఏ ఈనాడు పత్రికో లేకుంటే లాప్ టాప్ పెట్టేసుకుని ఈ లాంటి బ్లాగో దివేస్తుంటే మీకు మరీ చిరాకు ఎక్కువై దమ్మని ఈ గరిటో లేకుంటే ఏ గిన్న్నో కింద గిరాయించి ప్రొటెస్ట్ చేస్తారా?

లేక తెక్నికులు ఉపయోగించి మీ వారిని వంట గది లోకి రప్పించి వారిచే మెప్పుగా కార్యసాధన అయ్యేలా చేస్తారా?


ఈ రెండు పద్దతిలో నూ ఒక్కో మారు ఒక్కో ఫలితాన్ని సాధించవచ్చు. ఈ మీరు పనిచేస్తుంటే మీ శ్రీ వారు ఈజీ చేరు  సీను మమ్మీ లేజీ బాయ్ కి మధ్య జరిగే తమాషా!

 లేజీ బాయ్ ని నిద్ర లేపాలంటే గదమాయింపు లేకుంటే బుజ్జాగింపు రెండు అవసరం.

నారదాయ నమః !

చీర్స్
జిలేబి.

Thursday, January 5, 2012

రాదే చెలి నమ్మ రాదే చెలి (సభ్య వివస్త్ర!)

పరికిణీ పరిచితే   
పిట పిట లాడుతోన్దంటారు

సల్వారు సాయిస్తే
సరసాంగి అంటారు

శుభ్రం గా చీర కడితే
సింగారి అంటారు

ప్యాంటూ షర్టూ వేస్తే
పైలా పచ్చీసు అంటారు

జీన్సు జమాయిస్తే
జిల్ జిల్ జిలేబి అంటారు

మిడీ వేస్తే
మిటారి అంటారు

షార్టు వేస్తే
షకీలా అంటారు

కోటూ  సూటూ వేస్తే
కోణంగీ అంటారు

వెస్టర్న్ వేస్తే
వగలమారి అంటారు

స్విమ్ సూటు వేస్తే
సిగ్గే లేదంటారు

బురఖా వేస్తే
భావ ప్రాప్తి లేదంటారు

అబ్బ పోనీ
బట్టబయలు అవుతానంటే  
బరి తెగిన్చిన్దంటారు  

నేనేమి చేతురో  నా ముద్దుల దినేశా

రాదే చెలీ నమ్మ రాదే చెలీ
ఈ మగువలెపుడు మగవారిని
నమ్మ రాదే చెలీ!

ఛీ
రాస,
జిలేబి.

Wednesday, January 4, 2012

అద్దానికి బురఖా

అద్దం ముందు నిలబడ్డాను
నీవేనా అంది

ఎం నేను కానా ?
కొన్నేళ్ళ ముందు నా ముందు వున్నావ్
అప్పుడూ ఇదే ప్రశ్న అడిగావు
ఎందుకీ ప్రశ్న మళ్ళీ ఇప్పుడు ?

అద్దం నవ్వింది
నేనాలనే ఉన్నా
ఏమిటో నిన్ను చూపించేటప్పుడు
మారి పోతున్నా
ఎందుకో ?

నువ్వు నా ప్రతి బింబం అంతే
నాతొ వాదించకు
అద్దానికి బురఖా కప్పాను

.

చీర్స్ 
జిలేబి.

Tuesday, January 3, 2012

"లింక్ లీక్స్"- రాధా ఎంత పని చేసావు !!!


"ఏమోయ్ రాధా , మా బులుసు గారి, మరిన్ని బ్లాగువాళ్ళ కథల్  వేసుకున్నావ్ ! మరి నా టపా ఒక్కటి కూడా ప్రచురించ లేదే ?"

మా మనవడు రాధ ని నిలదీసి ఇవ్వాళ అడిగాను. అడగటమే కాదు కడిగేసాను కూడా.

"ఇదిగో , బామ్మ, ఆల్రెడీ ప్రాబ్లెం లో వున్నాను, మధ్య లో నీ సోదేమిటి ?" అన్నాడు మా రాధ.

"ఆయ్ అంత మంది బ్లాగర్ల లిస్టు ఇచ్చాను నీకు వాళ్లదంతా  టపాలు సర్ప్రైస్ గ పబ్లిష్ చెయ్య వోయ్ అని - కొత్త సంవత్సరం లో వాళ్ళంతా సంతోష పడతారు అని . దాంతో బాటే నాదీ పబ్లిష్ చేస్తావనుకున్నానోయ్ మనవడా " అన్నా ఉన్న చనువుతో .

"అన్నావు, మరి ఆ లిస్టు లో నీ బ్లాగు ఎందుకు చేర్చ లేదు నువ్వు  ?" చికాకుగా ముఖం పెట్టాడు వాడు, "తప్పు నాది కాదు, ఆ లిష్టు ది "

"చెప్పాగా, నీకు తెలిసిన ముసలవ్వనేగా నా టపా ప్రింటు చేస్తే నీ కేం పొయ్యేది ?" అడిగాను డిమాండు చేసి.

"ఇదిగో బామ్మా,  అసలే ప్రాబ్లెం లో వున్నా, మరీ చీకాకు పెట్టకు " చెప్పాడు రాధ.

"ఏమిటోయ్ నీకొచ్చిన తంటా" ?

"వాళ్ళందరూ ధ్వజం ఎత్తారు నా మీద "

"ఎవరూ?"

"వాళ్ళే"

"ఏమని "

"ఇలా మాకంతా చెప్పా పెట్టకుండా ఎట్లా నువ్వు ప్రచురిస్తావోయ్ మా టపా లని అని "

"చెప్పొచ్చు గా జిలేబి చెప్పింది ఆవిడ భరోసాతోనే చేసానని "

"ఆ మాటా చెప్పా"

"ఏమన్నా రేమిటి ?"

"జిలేబి ఎం చెబ్తే అదే చేస్తా వా ? అయితే జిలేబి టపా ఎందుకు వెయ్యలేదు అని క్రాస్స్ ఎగ్జాం చేసారు "

"ఓహ్ మై గాడ్, మరి నువ్వేం చెప్పావ్"

"ఎం చెప్పమంటా వే, అసలు బుర్ర పనిచెయ్యడం లేదు "

"ఏదో ఒకటి చెప్పి నీ తంటాలు నువ్వు పడు. కాదూ, కూడదనుకుంటే , చెప్పేయి అందరకీ క్షమాపణలు "

"అంతే అంటావా ?"

"అంతే "

"నా తరపున నువ్వే చెప్పెయ్య రాదటే బామ్మా  "

"ఎం నే నెందుకు  చెప్పాలి అంట ?"

"నువ్వే కదా ఆ లిష్టు ఇచ్చింది - అందుకే "

"ఆశ దోస, అప్పలం వడ !  నేనెందుకు చెప్పాలోయ్,  అధమ పక్షం నా టపా పెట్టి వుంటే, పోనీ లే మనవాడే కదా అని కొంత సిఫారిసు చేసే దాన్ని, కాకుంటే నీ తరపున క్షమాపణలు అడిగే దాన్ని"  

"మళ్ళీ మొదటికే వచ్చావ్ ?"

"చెప్పు క్షమాపణలు దాని కి ముందు " అన్నా. "నా టపా ఎందుకు పెట్టలేదు ? "

"నీ టపా లో హెడింగ్ లో ఎం పెట్టావ్ ?"
"When its Hot its Really Cool "


"అది తెలిసిందే లే ఆ తరువాత ?"
"Copyright © 2008-2020. All rights reserved"

"సో, ?"

"సో , బామ్మా - నువ్వెంత హాట్ వైనా ట్వెంటీ ట్వెంటీ నీతో ఆడలేనే "

"ఓహ్ మై గాడ్, పోనీ వాళ్ళందరికీ పారితోషికం ఇస్తావా లేదా ? "

"తప్ప కుండా ఉంటుందే బామ్మా "

"మరి దాన్తోటే వాళ్ళు నీ మీద మా రాజీ అడ్వొకేటు గారిని కేసు పెట్టమంటే ?"

"ఓహ్ మై గాడ్ "


అడ్వొకేటు రాజీ గారు, మీకు కొత్త సంవత్సరం కి సరి  కొత్త కేసు వచ్చేసింది. ఆల్ ది బెస్ట్


చీర్స్
జిలేబి.

Sunday, January 1, 2012

Full Long குழல் - నూతన సంవత్సర శుభాకాంక్షలు ! - ಎರಡು पूर्णं ഒന്ന് दो !!

Full Long குழல் 

 నూతన సంవత్సర శుభాకాంక్షలు ! 

 ಎರಡು पूर्णं ഒന്ന് दो

బ్లాగ్ భాన్ధవులందరికీ
ఈ నూతన సంవత్సరం మీకు సర్వదా అన్ని శుభములను కలుగ చేయాలని కోరుతూ !

 యు ట్యూబ్ బ్లాగ్ 'శివాజీ  ' శ్రీ ఎందుకో ఏమో గారు

మీరు Full Long குழல் కి ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ మార్వేల్లాస్. ! నమో నమః !! 

ஒரே கிலி கிலி ப்பா இருககும்கோ!
நன்றி 'நீடோடி வாழ்க ! 'வளர்முடன்' !

?! గారు ఇచ్చిన గిఫ్టు ఇక్కడ చూడవచ్చు.



శ్రీ కృష్ణం వందే జగద్గురుం

జిలేబి.