తెలవారదేమో స్వామీ, నీ తలపుల మునుకలో ... అని పాడేసేరు ఆచార్యులవారు.
స్వామీ తలపుల మునుకల గురించి మాటేమో గాని, మా అయ్యరు వారి తలపుల మునుకలో మేము పరేషాను ! మొదట్లో మా అయ్యరు వారికి మనసు పారేశాను , దాని పర్యవసానం ఇప్పుడు పరేషాను !
జిలేబీ నీకో సంబంధం తెచ్చేరు మీ నాన్న గారు చెప్పింది మా బామ్మ.
నేను చేసుకోను అన్నా.
ఫోటో తెచ్చేరు లే చూసాకే చెప్పు అంది బామ్మ, అబ్బా ఈవిడకి చాలా టెకినీకులు తెలుసు సుమీ అంది మనసు.
చూస్తె పోలే. చూసి నచ్చలే అని చెబ్తే పోయే అనుకున్నా. మా బామ్మ నే వద్దంటే కాదంటుందా అన్న రాంభరోసా అన్న మాట. బామ్మ పెంపకమాయే మరి మనది.
బ్లాకు అండ్ వైటు ఫోటో. అయ్యరు మూడు పట్టీలు నుదిటి పై పట్టి ఉన్నారు. బానే ఉన్నాడను కున్నా.
ఏం చేస్తారేమిటి ? అడిగా
మా బామ్మ ఊరుకుంది.
మళ్ళీ అడిగా .
'వాళ్ల్లకి హోటలు ఉందట అది ' అంది బామ్మ వంటా వార్పూ బాగా వచ్చట ' మళ్ళీ ఆశ పెట్టింది. అట్లా అనటం లో మరో ఆంతర్యం కూడా ఉందాయే మరి. బామ్మ పెంపకం లో లేడీస్ కి వంట నేర్వడమన్నది లేనే లేదు. కాబట్టి వంట చెయ్యడం లో జిలేబీ జీరో. కాబట్టి బామ్మ జిలేబీ చూసుకో నీకు మరో లాభం అన్నట్టు చెప్పింది ఆ ' వంటా వార్పూ బాగా వచ్చట' అని చెప్పటం లో '
'అరవ దేశం కాబట్టి తెలుగు తెలీదు, హిందీ అసలే రాదు' మళ్ళీ అంది.
నన్ను హిందీ ప్రావీణ్యత ఉన్న మేధావి వర్గం గా మా బామ్మ తయారు చేసిందాయే మరి ! మా ఫ్యామలీ లో నేనే మొట్ట మొదట హిందీ తెలిసిన దాన్న ట ! కాబట్టి ఇది మైనసు పాయింటు ఆయే మరి అయ్యరు వారికి!
మొత్తం మీద ఇట్లాంటి శుద్ధ పప్పుచారు అయ్యరు వారిని మాకంట బెట్టి మా బామ్మ బాల్చీ తన్నేసింది.
అబ్బ , మనసు పారేసుకుంటే, పరేషానే పరేషాన్ మరి !
కాబట్టి పారేసుకున్నా పరేషాను కాకండీ మరి !
జిలేబి.