ఈ మధ్యన తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళడం జరిగింది.
ముందురోజున సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా దర్శనం చేసుకుని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందామని VIP బ్రేక్ లో టికెట్స్ బుక్ చేశాము.
సరే ఉదయాన్నే లేచి స్నానాలు కానిచ్చి ఆరింటికల్లా క్యూలో నిలబడ్డాము.గేట్ దగ్గరకు వచ్చేసరికి అందరికీ ID కార్డ్స్ ఉండాలని గేట్లో ఉన్న ఉద్యోగులు పట్టుబట్టారు.టికెట్స్ బుక్ చేసేటప్పుడు నా ఐడీ మీద బుక్ చేశాము.సరిపోతుందిలే అనుకున్నాము.కానీ అలా కుదరదనీ,ఒక కుటుంబంలో నలుగురు ఉంటె నలుగురికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలనీ ఉన్నవాళ్ళే లోనికి వెళ్ళమనీ లేకుంటే ఆగిపోమ్మనీ గేట్లో ఉన్న TTD ఉద్యోగులు పట్టుబట్టారు.మాలాగే దాదాపు ఒక 50 మంది ఆగిపోయారు.వారిలో అహమ్మదాబాద్ మొదలైన దూరప్రాంతాలనుంచి వచ్చ్సినవారే గాక,విదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వారందరూ బిక్కముఖాలు వేసుకుని ఉద్యోగులను బ్రతిమిలాడుకుంటున్నారు.
ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండవచ్చు.దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు.ఎవరూ కాదనరు.కానీ దూరం నుంచి వచ్చినవారినీ,ఒకే కుటుంబంలోని వారినీ,కొందరిని వదిలి,కొందరిని వదలకుండా వాళ్ళు పెట్టె హింస చాలా చండాలం అనిపించింది.
అంతంత దూరాలనుంచి వచ్చి అంత చలిలో పొద్దున్నే క్యూలో నిలబడే వాళ్ళు టెర్రరిస్టులా లేక భక్తులా అన్న విచక్షణ అక్కడి ఉద్యోగులకు లేకపోవడం చూసి అసహ్యం కలిగింది.
కొద్దిసేపు అక్కడే ఉండి,ఆ గొడవ అంతా పరిశీలిస్తూ ఉన్నాను.బ్రతిమిలాడే వాళ్ళు రకరకాలుగా బ్రతిమిలాడుతున్నారు.ఉద్యోగులు కరగడం లేదు.
పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది.
ఎంతో దూరం నుంచి వచ్చి,డబ్బులు కట్టి టికెట్స్ బుక్ చేసుకుని,తీరా వాకిట్లోకి వచ్చేసరికి లోనికి వెళ్ళనివ్వకపోతే ఎంత బాధ కలుగుతుందో ఆ బ్రతిమిలాడే వాళ్ళను చూస్తె అర్ధమౌతుంది.నాకైతే వాళ్ళను చూస్తె అయ్యో పాపం అనిపించింది.వారి తరఫు నుంచి నేనూ కొంత సేపు ఉద్యోగులతో వాదించాను.కానీ వాళ్ళు వినడం లేదు.
పరాయి మతాలవాళ్ళు చర్చిల తలుపులు బార్లా తీసి లోనికి రమ్మని పిలుస్తుంటే మనం మాత్రం దైవదర్శనానికి టికెట్లు పెట్టి, డబ్బులు కట్టినవారిని కూడా నానా మాటలంటూ,పొమ్మని తోసేస్తున్నాము.
మన హిందూమతం ఎలా బాగుపడుతుంది?
ఇలాంటి అవమానాలు పొందిన కొందరు ఈ ఖర్మ మనకెందుకంటూ ఇతర మతాలకు మారడం నాకు తెలుసు. అక్కడైతే ఎదురు డబ్బులు ఆస్తులు ఇచ్చి మరీ లోనికి రమ్మంటారు. ఇక్కడేమో వాకిట్లోకి వచ్చినవారిని పోపొమ్మంటున్నారు.