కన్నయ్య మళ్ళీ పుట్టాడు !
కన్నయ్యా మళ్ళీ పుట్టవా అంటూ మిల్లీనియా ల తరబడి జనాలు మొత్తేసు కుంటూ ఉంటే, శ్రీ నాథుండు, సిరి వైపు చూసి , దేవీ , జనాలు మళ్ళీ రా రా కన్నయ్యా అంటూ గగ్గోలు పెట్టేస్తూ ఉన్నారు. వెళ్లి రానా ? అడిగాడు గోముగా .
అమ్మవారు కూడా ఇట్లా ఎట్లా వత్సరాల తరబడి స్వామి వారి కాళ్ళు అదుముతూ కూర్చోవడం అనుకుంటూ 'వెళ్లి రండి స్వామీ, అక్కడే ఉండాలని మాత్రం అనుకోకండే ; మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ నేనూ రావాల్సి ఉంటుంది' అని డామ్మని వారి కాలు అదమడం వదిలి పెట్టింది హమ్మయ్య భారం తప్పింది ; చేతులకి అనుకుంటూ.
ఆ అదాటు కి స్వామి వారు జొయ్యని 'ఆంధ్ర దేశంలో 'ఆర్తి' తో పిలిచిన కష్టమున , శ్రమ దానమ్ముల చేసేసు కుంటున్న ఓ భక్తాగ్రేసాంబర మణి యింటి ముందు దిగ బడ్డాడు.
యింటి లోపలికి రా రా అంటూ పిలుస్తోన్న చిన్ని చిన్ని పాదాలు కనబడ్డాయి.
తన పాదాల వైపో మారు చూసుకున్నాడు స్వామి . అన్ని భువనాల్నీ మూడు అడుగుల తో లెక్క పెట్టేసు కున్న పాదాల తో ఈ చిన్ని పాదాల్ని ఎట్లా సమీకృతం చేయాలో అనుకుంటూ తలగోక్కుని ముక్కు గోక్కో పోయాడు.
ముక్కు మీద ఏదో తగిలింది. ఏమయ్యుంటుందో అనుకుంటూ తడిమి చూసాడు.
లోచనా ! కమల లోచనా అంటూ ఉంటారు ; ఇదే కామోసు లోచనాలు ఆనుకుంటూ ఉసూరు మనుకున్నాడు.
పై లోకం లో నించి ఎట్లాంటి కళ్ళద్దాలూ లేకుండా చూసేసు కుంటూ వచ్చేసాడు. ఇక్కడ దిగ బడగానే కళ్ళద్దాలు కావాల్సి వచ్చె అనుకుంటూ .
అంతలో - "కన్నయ్యా ! మళ్ళీ పుట్టవా ! రారా ! సంపాదనకే సమయం సరిపోతూ ఉంది. పుట్టినప్పటినుంచి పాలకేడిచి, ఆ తరవాత మురిపాలకేడ్చి బతకంతా ఏడుపయిపోయింది" అంటూ ఓ ఆర్తి లోపలి నించి వినబడింది.
ఓహో ! ఈ లాంటి నినాదేలన్న మాట అక్కడ నాకు వినిపిస్తా ఉండేది అనుకుంటూ స్వామి వారు, బహు సంతోష పడి పోయి -
భక్తా ! వచ్చితిని యిదిగో అంటూ దీక్షను బూనిన యా దీక్షితుని ముందు కనబడ్డాడు.
ఎవరయ్యా నీవు అడిగాడా ఆసామి.
శ్రీ కన్నయ్య వారికి దుఃఖం తన్ను కొచ్చే సింది. 'హే కృష్ణా ! ముకుందా !' అంటూ , జయ కృష్ణా ముకుందా మురారే అంటూ వెంటనే పాట అందేసుకుని పరవశించి పోతాడనుకున్న అంబరమణి ఇట్లా తనను తుస్సు మనిపిస్తా డను కోలే స్వామి వారు.
దీక్షితా ! నేనయ్యా ! కన్నయ్య ను అన్నాడు స్వామి.
సందేహం తో చూసాడు భక్తుడు. 'ఆధార్ ?" అడిగాడు.
ఆధార్? అంటే బిక్క పోయాడు స్వామి .
సరే కన్నయ్య వేషం తో వచ్చావు కదా. ఆధార్ డీటెయిల్ ఉందా ? అని అడిగా .
ఓ
అవ్ :)
సరే ఏమిటి చత్వారమా ? కళ్ళద్దాలు ? మళ్ళీ సందేహం భక్తుడికి.
కాదోయ్ ! అదేంటో మీ లోకం లోకి దిగ బడగానే ఇది అదే వచ్చేసింది.
జలధరదేహు నాజాను చతుర్భాహు అని విన్నా . నీగురించి. ఇట్లా పొట్టిగా, బుడుంకాయ లా , జలధర దేహం లేకుండా , ధూళి మట్టి కొట్టు కున్న దేహం తో ఉన్నా వేమి టయ్యా ? మళ్ళీ సందేహం.
ప్చ్ ఏమంటావు భక్తా ! మీ హై వే మహాత్మ్యం ఇది. దుమ్ము కొట్టు కు పోయిన తన శరీరం వైపో మారు చూసు కున్నాడు స్వామి. వచ్చే దారిలో అమరావతి కనబడింది; ఆశ గా దిగా. చూస్తే మన్నూ మషాలం అంటేసు కుందయ్యా !
"అయినా, ఏ మాట కామాటే చెప్పు కోవాలయ్యా దీక్షితా ! కలియుగం లో భక్తి మా బాగా ఉందయ్యా ! ప్రతి ఒక్కడూ నన్ను చూసి "నమో ! నమో ! నమో" అంటూ బోతా ఉండారు. ఆహా భక్తి ప్రపత్తులంటే ఇట్లా ఉండాలి గదా! నా యుగం లో కూడా అట్లా జనాలు లేక పోయేరయ్యా !" స్వామి వారు తాదాత్మ్యం తో కళ్ళు మూసు కున్నారు .
స్వామీ మీరు మరీ వెర్రి వెంగళాయి అని అసలు విషయం చెబ్దా మని నోటి దాక వచ్చేసిన మాటల్ని గబుక్కున మింగే సుకున్నాడు అంబర మణి - చెబ్తే భాజాస్ఫాలన మాచరించి భాజ్పా జనాలు ఎక్కడ మీద పడి పోతారో అనుకుంటూ :)
మరి స్వామీ , ఆ గెడ్డెం, మీసాలు ?
వచ్చే దారిలో వాల్ పోస్టర్లు చూసానయ్యా . మీ సినిమా హీరోలంతా ఎంచక్కా గెడ్డాలు మీసాల తో కనబడ్డారు. ఓహో ! ఈ కలియుగపు అలంకారాలు ఇవే కామోసు అనుకున్నా. అంతే అవే వచ్చేసాయి. సంకల్ప బలం గదా !
ఓహ్ ! జే, జే అయి పోయా రన్న మాట !
జే ,జే ఏమిటోయ్ ?
జుట్టాడు జగన్నాధుడై పోయారన్న మాట :)
అదేమిటోయ్ ?
అదంతే లెండి. ఇంతకీ , స్వామీ ! నిజ్జంగా నీవు నీవేనా ?
నీవే నేనుగ, నేనే నీవుగ భావించిన శుభ పక్షం వోయ్, ఈరోజు. అట్లా కుటిల తర్కం తో 'నిజ్జంగా' అంటూ సందియ మేలా భక్తా ?
భక్తుని కి కొంత ఆశ, చిగురించింది.
ఇంత అందంగా వేదాంతమ్ చెబ్తున్నా డంటే ఈయన శ్యామలుడే అనుకున్నాడు.
అయినా , మరికొంత పరీక్షించాలి.
స్వామి వారు పరీక్షితుడికే ప్రాణ దాత గదా మరి అనుకుంటూ ,
స్వామీ, వెన్న తింటా రా ? అన్నాడు ఆప్యాయం గా.
స్వామి వారికి నోరూరింది.
చాలా కాలమయ్యింది. వెన్ననారగించి. ఆహా ! బృందావనం ! ఆహా యశోదమ్మ తల్లి. అంటూ ఫ్లాష్ బాక్ గుర్తు కొచ్చే సింది.
అదేంటో , వైకుంఠం లో లక్ష్మి బువ్వ గురించి న ఊసే ఎత్తదు. ఎప్పుడు చూసినా అట్లా కాళ్ళు అదుముతూ నే కూర్చొని ఉంటుంది అనుకుంటూం టే, భక్తుడు,
స్వామీ వెన్న అన్నాడు.
మా రేపల్లె దా ? స్వామి వారి ముఖం చాంతాడంత అయ్యింది.
కాదు సామీ చైనా మాల్ ;
ఓహో చీని చీనాంబర మా ?
అవునండి.
స్వామి వారు వెన్న నోట్లో పెట్టాడు. డామ్మని నీల్గుడు చెంది క్రింద పడ్డాడు.
స్వామీ స్వామీ అంటూ భక్తుడు నీళ్ళు చల్లి స్వామి వారిని లేపడానికి బదులుగా 108 నెంబరు డయల్ చెయ్యడం మొదలెట్టాడు :)
Chocolate Krishna Copy Right - Crazy Creations
శ్రీ కృష్ణాష్టమి సదర్భం గా
అందరికి ఆ కన్నడి
ఆశీస్సులు ఉండాలని
కోరుకుంటూ ....
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్!
జిలేబి