మృచ్ఛకటికం – రూపక పరిచయం- బ్లాగాడిస్తా రవి గారి అద్భుతః !
ఉపోద్ఘాతం - నిన్న శంకరాభరణం సమస్యా పూరణం లో శకారుని మాటలంటూ శ్రీ కంది శంకరయ్య గారు
"రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే" అన్న పూరణ చేయడంతో ఎడ్డం టే తెడ్డు లా గున్న ఈ పూరణ చూసి , ఏమీ అర్థం గాక దీని అర్థం ఎట్లా చేసు కోవాలో చెప్పండంటే గుర్రం సీతా దేవి గారు, ఆ ముందు పలుకులు (శకారుని మాటలు ) గమనించండి అన్నారు.
సరే అర్థం కాకపోతే ఆంధ్రభారతే శరణ్య మానుకుని శకారుడు అని వెతికితే ఆంధ్ర భారతీ వారు జాన్తా నై అనేసారు.
మళ్ళీ అర్థం కాలే అంటే, మధ్యలో జీపీయెస్ వారు ఈ క్రింది లంకె నిచ్చారు శకారుడు అంటే ఏమిటో అర్థం చేసు కోవడానికి. ! ఓహో "శకారు" కూడా మరో జిలేబి యే యని దాంతో తలే ఉంగలీ దబాయా !
మృచ్ఛకటికం – రూపక పరిచయం- బ్లాగాడిస్తా రవి గారి అద్భుతః !
బ్లాగాడిస్తా రవి గారు విరివిగా పంచ దశ లోకం లో టపాలు రాసేవారు ! ఈ మధ్య మానుకున్న బ్లాగుధీర మంతుల లో మరొక్కరు వీరు కూడా :) జేకే !
http://blaagadistaa.blogspot.com/ వీరి ప్రైవేటు బ్లాగై పోనాది :)
సరే వారి పూర్తి నిడివి వ్యాసం పొద్దు లో పై లింకు లో చదవ వచ్చు !
ఈ టపా ఎందుకంటే - ఈ టపా చూస్తే వారు మళ్ళీ బ్లాగు తెర తీస్తారని ఆశ తో :) - విన్నపాలు వినవలె వింత వింతలు !
వారి వ్యాసం నించి కొన్ని -
సంస్కృత భాష సౌందర్యం గద్గద నదీప్రవాహ ఝర్జరిత గాంభీర్య ప్రాధాన్యమయితే, ప్రాకృత భాష సొగసు మలయమారుత స్పర్శిత కిసలయోద్భూతమైన సౌకుమార్యం.
మృచ్ఛకటికం - మృత్ + శకటికం, మృచ్ఛకటికం అయింది. శకటం అనకుండా శకటికం అన్నారు కాబట్టి, (మృత్) శకటానికి సంబంధించిన లేదా “చిఱు శకటం” అని వ్యుత్పత్తి చెప్పుకోవాలి.
శకారుడి గురించి-
విధవిధాలుగా అపభ్రంశపు ఉపమానాలు చేస్తుంటాడు. ఉదాహరణకు –
◾రావణుడికి కుంతిలాగా నువ్వు నా పాలబడ్డావు.
◾రాముడికి భయపడ్డ ద్రౌపదిలా భయపడకు.
◾విశ్వావసువు సోదరి సుభద్రను హనుమంతుడు అపహరించిన రీతిలో నేను నిన్ను అపహరిస్తాను.
◾అడవికుక్క లాంటి నేను పరిగెడుతుంటే, ఆడునక్కలా నువ్వు పారిపోతున్నావు.
మృచ్ఛకటికం కథ టూకీ గా (రవి గారి మాటల్లో )
పాలకుడనే రాజు ఉజ్జయినీ నగరం రాజధానిగా అవంతీ రాజ్యాన్నిపరిపాలిస్తుంటాడు. ఆ రాజొక దుష్టుడు. శకారుడు – రాజు గారి బావమరిది. శకారుడు మూర్ఖుడు, అవకాశవాది, కౄరుడు. నగరంలో చారుదత్తుడనే బ్రాహ్మణశ్రేష్టుడు నివసిస్తుంటాడు. ఇతడు దానధర్మాలు చేసి దరిద్రుడయిన వాడు, సుందరుడు, సచ్ఛీలుడు. ఇతడికి ధూతాంబ అనే భార్య, లోహసేనుడనే పుత్రుడూ ఉంటారు. వసంతసేన ఆ నగరంలోని గణిక ప్రముఖురాలు. ఈమె చారుదత్తుడిపైన మనసు పడుతుంది. వసంతసేనను రాజశ్యాలుడు – శకారుడు మోహించి వెంటబడతాడు. ఓ ఘట్టంలో అతణ్ణుండి తప్పించుకుందుకు వసంతసేన చారుదత్తుడి ఇంట్లో జొరబడుతుంది. తననో దుష్టుడు నగలకై వేధిస్తున్నాడని, ఆ నగలను దాచమని చారుదత్తుడి కిస్తుంది. చారుదత్తుడు ఆ నగల బాధ్యతను తన సహచరుడు మైత్రేయుడికి అప్పజెపుతాడు.
ఈ రూపకం యొక్క కథాసంవిధానం గురించి పండితులు ఎన్నో రకాల ఆసక్తికరమైన వివరాలు చెప్పారు. ఎన్ని రకాలుగా చెప్పబడినా, తిరిగి ఇంకొక విధంగా, మరో కోణంలో ఆవిష్కృతమయే విలక్షణ కథాసంవిధానం ఈ రూపకం సొంతం.
శర్విలకుడనే చోరుడు ఓ రోజు రాత్రి చారుదత్తుడి ఇంటికి కన్నం వేసి, ఆ నగలను అపహరిస్తాడు. ఈ శర్విలకుడికొక ప్రేయసి ఉంటుంది. ఆమె ఎవరో కాదు. వసంతసేన పరిచారిక అయిన మదనిక. ఆమెను దాస్యవిముక్తి చేయడం కోసమే శర్విలకుడు చౌర్యానికి పాల్పడ్డాడు. అపహరించిన నగలను తీసుకుని శర్విలకుడు వసంతసేన ఇంటికి వెళ్ళి, మదనికను కలిసి, జరిగింది చెబుతాడు. మదనిక భయపడి, ఆ నగలు తన యజమానురాలివేనని, ఆమే స్వయంగా వాటిని చారుదత్తుని వద్ద దాచిందనీ చెప్పి, చౌర్యారోపణ పాలుబడకుండా “చారుదత్తుడే తనను పంపినట్టుగా వసంతసేనతో చెప్పి, నగలను ఒప్పజెప్ప”మని శర్విలకుడికి ఉపాయం చెబుతుంది. చాటునుంచి వసంతసేన ఈ సంభాషణ వింటుంది. శర్విలకుడు మదనిక చెప్పమన్నట్టుగా తనను, చారుదత్తుడు నగలను అందజేయడం కోసం పంపాడని, నగలు తీసుకొమ్మని వసంతసేనకు అందజేస్తాడు. వసంతసేన అతని సద్బుద్ధికి మెచ్చి, మదనికను శర్విలకుడితో సాగనంపుతుంది. శర్విలకుడు మదనికను తీసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో, తన స్నేహితుడు ఆర్యకుడు రాజు పాలకుడిచేత బందీ అయినట్టు తెలుసుకుంటాడు. మదనికను ఇంటికి పంపి, ఆర్యకుడిని కారాగారం నుండి విడిపించడం కోసం పథకం రచిస్తూ బయలుదేరతాడు.
సంవాహకుడనేవాడు చారుదత్తుడి వద్ద పరిచారకుడిగా ఉండి, చారుదత్తుడి ఐశ్వర్యం క్షీణించిన తరువాత పొట్టకూటికై తపిస్తూ, జూదవ్యసనపరుడయి పరిభ్రమిస్తుంటాడు. ఇతడు ఓ జూదంలో పది సువర్ణాలను ప్రత్యర్థికి బాకీపడి, అవి చెల్లించలేక, పారిపోతూంటాడు. పారిపోతున్న తనను జూదంలో నెగ్గిన ద్యూతకుడనే మరొక జూదరి పట్టుకుని చితకబాదుతాడు. దెబ్బలకు తాళలేక పారిపోతూ, సంవాహకుడు ఓ ఇంటిలో జొరబడతాడు. ఆ ఇల్లు వసంతసేనది. ఆమె వివరాలన్నీ తెలుసుకుని, ధనం ఇచ్చి సంవాహకుణ్ణి విడిపిస్తుంది. ఆ సంవాహకుడు విరక్తి చెంది, బౌద్ధ శ్రమణకుడవుతాడు.
వసంతసేన నగలు పోయిన తర్వాత, ఆ నగలు తనే దొంగిలించాడని ప్రజలు చెప్పుకునే అవకాశం ఉందని, తన దారిద్ర్యానికి తోడు అపవాదూ వచ్చి పడబోతున్నదనీ చారుదత్తుడు క్రుంగిపోతాడు. భర్త పరిస్థితి గమనించి ధూత, ఆ నగలకు పరిహారంగా వసంతసేనకు తన రత్నాల హారాన్ని ఇచ్చి బదులు తీర్చేసుకొమ్మని చెబుతుంది. ఆ రత్నాల హారాన్ని తన సహచరుడి చేతికి ఇచ్చి అతని ద్వారా వసంతసేనకు అప్పజెబుతాడు చారుదత్తుడు.
తన నగలు తనకు ఇదివరకే ముట్టాయని, జరిగిన విషయాలన్నిటినీ విశదీకరించే ఉద్దేశ్యంతో, వసంతసేన శర్విలకుడి ద్వారా తన వద్దకు చేరిన నగలను, చారుదత్తుడు పంపిన రత్నాల హారాన్నీ తీసుకుని చారుదత్తుడి ఇంటికి ఓ సాయంత్రం పూట వెళ్తుంది. ఆ రాత్రి ఆమె చారుదత్తుడి ఇంట విశ్రమిస్తుంది. మరుసటి రోజు ఉదయం చారుదత్తుడి ఇంటిలో బాలుడు రోహసేనుడు ఓ మట్టిబండితో ఆడుతూ, తనకు సువర్ణశకటం కావాలని మారాం చేస్తూ ఉంటాడు. వసంతసేన ఆ బాలుణ్ణి ఊరడించి, ఈ నగలతో నువ్వూ సువర్ణ శకటాన్ని కొనుక్కోవచ్చని, నగలను ఆ మట్టిబండిలో పెట్టి పిల్లవాడిని సముదాయిస్తుంది.
ఆ తర్వాత –
శకారుడి బండిని చారుదత్తుడు తనకోసం పంపిన బండిగా పొరబాటు పడి వసంతసేన పుష్పకరండకమనే ఉద్యానవనానికి బయలుదేరుతుంది. నిజంగా చారుదత్తుడు పంపిన బండిలో కారాగారం నుండి తప్పించుకున్న ఆర్యకుడు ఎక్కుతాడు. అక్కడ ఉద్యానవనంలో శకారుడు వసంతసేనను తన బండిలో చూసి ఆశ్చర్యానందాలకు లోనవుతాడు. ఆమె తన చేతికి చిక్కిందనుకుంటాడు. తనను వరించమని వసంతసేనను హింసిస్తాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో, ఆమె గొంతు నులుముతాడు. వసంతసేన స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆమె చనిపోయిందని తలచి శకారుడు – ఆమెను హత్య చేసినది చారుదత్తుడని న్యాయాధిపతుల వద్ద అభియోగం మోపుతాడు. చారుదత్తుడి వద్ద, వసంతసేన తాలూకు నగలు దొరకడంతో న్యాయనిర్ణేతలు అతనికి కొరత శిక్ష విధిస్తారు. కొరత శిక్షను అమలు జరిపడంలో భాగంగా, అతడిని పుష్పమాలాలంకృతుణ్ణి చేసి, వధ్యశాలకు తీసుకొని వెళుతుంటారు.
ఇక్కడ ఉద్యానవనంలో స్పృహ తప్పిన వసంతసేనను ఓ బౌద్ధ శ్రమణకుడు (ఇదివరకటి సంవాహకుడే) రక్షించి, ఉపచర్యలు చేసి బయటకు తీసుకువస్తాడు. చారుదత్తుడికి కొరత విధించబడే సమయానికి వసంతసేన అక్కడ చేరి, న్యాయాధికారులకు విషయం వివరించి అతడిని విడిపిస్తుంది. శకారుడికి జనం బుద్ధి చెపుతారు. ఈ లోగా ధూతాంబ అగ్నిప్రవేశం చేయబోతుంటే, చారుదత్తుడు వచ్చి, ఆపుతాడు. నేపథ్యంలో ఆర్యకుడు పాలకుడిని చంపి రాజవుతాడు. చారుదత్తుడిని, మరో నగరానికి రాజును చేస్తాడు ఆర్యకుడు. వసంతసేనను చారుదత్తుడు రెండవ భార్యగా ధూత అనుమతితో స్వీకరిస్తాడు.
ఆనందో బ్రహ్మ !
సావేజిత
జిలేబి