Wednesday, May 25, 2016

శ్రీ కష్టే ఫలే వారికి వివాహ దిన వార్షికోత్సవ శుభ సందర్భం గా - 'వడి యాలు' - 'కండ' కావ్యం !

శ్రీ కష్టే ఫలే !- వడియాలు - 'కండ' కావ్యం !
 
బ్లాగ్ గాంధీ కాలక్షేపం కబుర్లు శ్రీ  శర్మ గారు,
 
మీ మే ఇరవై అయిదు తారీఖు  తారీఫ్ :)

మీ జీవితం లో 'బంగారం' మీ శ్రీమతి ప్రవేశించిన దినం ఇవ్వాళ (సరియనే అనుకుంటాను!)
ఇది సరిగ్గా ఓ యాభై నాలుగు సంవత్సరాల మునుపు జరిగినట్టు మీ బ్లాగ్ లో చదివి నట్టు గుర్తు.
సో , మీ కిదే , యాభై నాలుగు వసంతాల గ్రీటింగ్స్!
మీ జీవితం అమోఘం. మీ జీవితం లో జరిగిన సంఘటన ల ఆధారం గా మీరు బ్లాగ్ లో సహృదయులై    మీ జీవిత అనుభవాలను టపాల ద్వారా   పదుగురి తో పంచుకోవడం, తద్వారా మీరు పదిమందికి మార్గదర్శకులు గా ఉండడం ఈ పంచ దశ లోకం లో జరిగిన అపురూప విశేషం.
ఈ సందర్భం గా మా గురువులుంగారు శ్రీ శ్రీ పాద వారి చలువ గా మీ వడియాల టపా  స్ఫూర్తి గా 'కండ' కావ్యం సమర్పయామి :)


శ్రీ కష్టే ఫలే బ్లాగు లోని వడియాల టపా ఈ 'కండ' కావ్యానికి స్పూర్తి !

****

కష్టే ఫలే -వడియాలు -'కండ' కావ్యం !
---------------------------------
 
బండగ గాడిద గంపెడు
తిండియు వోలెన్ తినంగ దిటవు గలుగునా !
నిండుగ, చూపుకు బాగగు,
మెండగు, రుచికర జిలేబి మేలిమి, వలయున్ !  
 
కండలు ఊరక పెంచిన
దండగ ! మేధా జిలేబి ధారణ వలయున్
గుండెలు తీసిన బంటుకు
దండము  వేయ మనిషికి నిదానము వలయున్ !
 
గ్లాసెడన కొట్టు పిండి
ధ్యాసగ నుప్పు జిలకరయు తగు కారములున్
ఆ సెగ నెసరున నీళ్లున్ 
ఆశగ  బెట్టె నిట నొజ్జ మాచన జూడన్
 
మరియొక గ్లాసెడు నీళ్ళన
నురగగ  పిండిని గలుపుము ఉండలు గాకన్
మరిగిన నీళ్ళన పోయుడు
సరిసరి కారపు దినుసును చక్క గలుపుమా !
 
దరి నుండుము సరి కలుపుము
మరి యుండలు కట్టక మరిమరి కలుపవలెన్
సరి జూచి గరిట జారుగ
తిరికగ  ముద్దయునుగాక దించు జిలేబీ!
 
యిదియొక కళ !సాఫ్టుస్కి
ల్లిది!  తెలుసుకొను వడియాల లీలను గను!స
న్నదయిన తడిబట్టను పిం
డదగును ! ఎండన పరిచి బడయ వలయు గనన్ ! 
 
నాలుగు పక్కల రాళ్ళను
వీలుగ, బట్ట యెగురకను, వేగిర  నిడుమా !
గోలుగ ఉడికిన పిండిని
వాలుగ పెట్టుకుని వెళ్ళవలెను జిలేబీ !
 
ఎండల వాటుగ వడియం
ఎండును, మధ్య తడిపచ్చి ఎంచక మరు నా
డెండన నిడుమా వాటిన్
మెండుగ యగునే  జిలేబి మేటి వడియముల్ !
 
ఆపై వాటిని తియ్యడ
మో? పై బట్టను వడియము మొత్తము లోనన్
కోపుగ ఉండునటుల జే
యన్! పై నీళ్ళచిలికి వడియాలను మీటన్ !
 
చకచక వచ్చును నొకటొక
టిగ, యొక  పళ్ళెము న యుంచు ! టీచరు జెప్పెన్ !
నికరముగ వడియముల మరి
యొక దినమున నెండ బెట్ట యోగ్యము వినుమా
 
చక్కగ నారగ వాటిని
టక్కని డబ్బా నిడవలె టపటప యనగన్ !
మిక్కిలి ముదము జిలేబీ !
చెక్కితి వీ కండ కావ్య చెణుకుల నిచటన్ ! 
 
శ్రీ మాచన వడియముల ట
పా మూలము గొని జిలేబి పద్యము గూర్చెన్ !
రామా ! ఆ దంపతులకు
నీ మాటగ యీ దినమున నిధియన నిత్తున్ !
 
 
శుభాకాంక్షల తో
చీర్సు సహిత
జిలేబి
 

Tuesday, May 24, 2016

ఫైర్ బ్రాండ్ జిలేబి !

Fire Brand Zilebi !




చీర్స్
జిలేబి 

Tuesday, May 17, 2016

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు !

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు !

అయ్యా! యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు !

మీరీ  బ్లాగ్లేఖ చదువుతారో లేదో తెలియదు !

పై బడి తెలుగు బ్లాగు లోకపు కబుర్లు జనవాహిని లోకి వెళతాయో లేదో కూడా తెలియదు ! (ఇది మరో క్లోజేడ్ సిర్క్యూట్ జాలమేమో అన్న అనుమానం కూడాను !:)

అయినా చెప్పాలని అనిపించింది కాబట్టి !

ఈ మధ్య మీరు నిర్వహించిన లోక్ నాయక్ పురస్కార సభా  కార్యక్రమాన్ని యు ట్యూబ్ లో చూడడం కాకతాళీయం గా జరిగింది !

పురస్కారాన్ని మహా సహస్రావధాని ధారణా బ్రహ్మ రాక్షస శ్రీ గరికిపాటి నరసింహా రావు వారికివ్వడం ముదావహం !

శ్రీ గరికిపాటి వారు ఆ సభలో చేసిన ప్రసంగం వారి అమోఘ ప్రతిభా పాటవానికి మచ్చు తునక !

సరే , అంతా బాగున్నది ఈ పాటి దానికి విన్నపాలు ఏమిటీ అంటారా ?  అవధరించండి !

ఒక పురస్కార గ్రహీత ని పిలిచి అదిన్నూ  శ్రీ గరికిపాటి లాంటి సహస్రావధాని వారిని పిలిచి , వారిచే   ఒకటిన్నర గంట సేపు బాటు ప్రసంగం చేయించి వారు నిలబడి మంచి నీళ్ళు కూడా తాగ నిచ్చే వీలు లేకుండా మాట లాడ జేయించడం ఎంతవరకు సబబు ?

సభా మర్యాద గా వారిని సుఖాసీనుల జేసి , వారికి తగు మర్యాద ఇచ్చి, మీరందరు  కూడా హాయిగా వారి ముందు కూర్చుని  ప్రసంగాన్ని ఆస్వాదించి ఉంటే , చూసి ఉంటే  ఎంత బాగుండేది ?  ఈ సహృద్భావం చూపడం సభా మర్యాద గాదా ?

ఒక్క సారి ఆలోచించి చూడండి !

శ్రీ గరికి పాటి వారు వారు మంచి నీరు తాగడానికై సైగ చేస్తే , అడిగితే,  ఆ తెచ్చిన వ్యక్తి మంచి నీళ్ళు వెనుక కుర్చీ పై పెట్టేసి వారు తాగడానికి సౌకర్యం కలిగించ కుండా చేయడం ఎంత వరకు సబబు ?

వారు మాటల మధ్యలో ఖచ్చితం గా నీరు త్రాగడం ఎన్నో సభల్లో మనం చూడ వచ్చు ; మాట్లాడే వారికది అవసరం . ఆ వేగం లో మాట్లాడే టప్పుడు గొంతుక పిడచకట్టుకు పోవడం సర్వ సాధారణం !

అట్లాంటి ది మీరు సన్మానానికి పిలిచి వారిని ఇట్లా చెమటలు కక్కించే లా వారి చేత నిలబడి ప్రసంగం చేయించడం ఎంత వరకు సబబు ? *ఈ క్రింది వీడియో లో ప్రస్ఫుటం గా స్వేదం తో తడిసిన శ్రీ గరికి పాటి వారి క్లిప్పింగ్ చూడ వచ్చు );

యిది యేమి సభా మర్యాద ? స్వేద సేద్యము చేయకున్న కవివరులకు పురస్కారము దక్కునా అన్నట్టు ఉన్నది :)

ఈ టపా  వ్రాసినందు వల్ల అయిపోయిన కార్య క్రమానికి జరిగే లాభం ఏమీ లేదు అని తెలుసు ,అయినా వ్రాస్తున్నది ఎందు కంటే , రాబోయే  ఉత్సవాల లో నైనా సన్మాన గ్రహీత లకు ఉచిత స్థానాన్ని ఇస్తారనే నమ్మకం తో !.

మీరు పిలిచే సన్మాన గ్రహీత లు ఎట్లాగూ అరవై వసంతం దరిదాపుల్లోని వారే ఉంటారు ఖచ్చితం ఇది మన సంప్రదాయం పాటించండి !

ఇట్లాంటి సుదీర్ఘ సంభాషణ ఉన్నప్పుడు మీరు కూడా హాయిగా వారి ముందు వైపు కూర్చుని ఆస్వాదించండి వారి పాండిత్యాన్ని !

వేదిక మీద నిలబడి మాట్లాడే వారికి వీలుగా మంచి నీటి కమండలం కాకున్నా కనీసం వాటర్ బాటిల్ నైనా వీలుగా పెట్టండి !

ఒక సభలో గరికిపాటి లాంటి వారు మంచి నీళ్ళు తాగకుండా ఒకటిన్నర గంట సేపు వారి ధాటి కి మాట్లాడటం అంత సుళువైన విషయం కాదు !

నాకు తెలిసినంత వరకు యిదే అట్లాంటి వారి మొదటి సభ అయి ఉంటుంది అనుకుంటా ! ఆ క్రెడిట్ యార్ల గడ్డ వారికే దక్కే ! జేకే !


కార్య నిర్వాహకులు గా ఉన్న మీరు పని ఒత్తిడి లో మరవటం సహజమే !

అయినా కనీసం రాబోయే మీ సభ ల లో నైనా ఈ కనీస సభా మర్యాద పురస్కార గ్రహీత ల బాగోగులు వేదిక పై చూడ వలసినది గా విన్నపాలు !

సన్మాన గ్రహీత లు నిలబడే మాట్లాడా లనుకునే పక్షం లో కనీసం వారి దగ్గిర వీలుగా త్రాగడానికి మంచి నీళ్ళైనా ఉంచండి ; కనీస మర్యాద ఇదే వారికి మనమివ్వడం.

శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అద్భుత ప్రసంగం ! లోక్ నాయక్ పురస్కార గ్రహీత గా వారి ప్రసంగం క్రింది లింక్ లో ఒక గంట పది నిముషాల దాపుల్లో నించి మొదలవు తుంది ! వీలు చేసుకుని వినండి !

చెమటలు ధారా పాతము
గ, మన గరికి పాటి వారి కంఠపు శోషన్
విమలాకృతియన పద్యము
లమరెను నరసింహము ! కవి లాఘవము గనన్ !
 
ఆణి ముత్యపు బిందువు లనగ నచట
నయ్య వారికి తలపయినమరె; కొంచు
చెణుకులవి యన కవివర్య చెంప తడిసె
యార్ల గడ్డ లక్ష్మీప్రసాధ్యాత  చలువ ! :)
 

శ్రీ గరికిపాటి వారు తమ బట్ట తల మీద చెణుకులు ప్రతి సభ లోనూ వేస్తూంటారు ! అట్లాంటి వారి బట్ట తల మీద ఆణిముత్యాల్లాంటి స్వేద బిందువులను తెప్పించిన యార్లగడ్డ వారు మరెంత గొప్ప వారు :)

క్రింది యు ట్యూబ్ లింక్ లో శ్రీ గరికిపాటి వారి ప్రసంగం సుమారు ఒక గంటా పది నిముషాల ప్రాంతం నించి మొదలవు తుంది ! హాట్సాఫ్ టు శ్రీ గరికిపాటి !



చీర్స్
జిలేబి

Wednesday, May 11, 2016

ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)

ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)
 
బ్లాగ్వీరుల కు బ్లాగ్వీరాంగణలకు శుభోదయం !
 
ఈ రోజు వచ్చెను
జిలేబి వేడిగా
తూరుపు తెల్లారకముందే
ధారాధరము లా !
 
కామెంటులు కురిసేనా
బ్లాగుల చెమక్కుల చమ్కీల తో  !
వాడిగ జిలేబి
తియ్యందనాల ట్వీటు ల తో !
 
తక్కువ కాని టపాలతో  
తగ్గని కామింట్ల మేళము తో
అగణిత మౌ సిరి నగవులు
బ్లాగ్ లోకమంతా పరేషాన్ !
 
 
హాటు హాటు పాటలతో
స్వీటు స్వీటు జిలేబి
వెచ్చని వెన్నెల
కొల్లలై వచ్చెను వచ్చెను
 
పరాక్ బహు పరాక్ :)
 
 
చీర్స్
జిలేబి
 

Friday, April 15, 2016

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !


శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
 
బ్లాగు లోకానికి !
 
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
 
 
 
సీతాయాం పతి !
 
చిత్రం - దిహిందూ ఫేమ్ శ్రీ కేశవ్
 
Sita's Rama in Privacy :)
 
 


ఒక తండ్రి మువ్వురమ్మలు
నికరము నాల్గన కొమరులు నిచ్చట జూడన్
ఒక నీశుడు మూడు గుణము
ల కలువ  వేదంబు నాల్గు లచటన గంటిన్ !
 
జిలేబి
 
 

Thursday, April 14, 2016

ఏమి చేయవలెనో చెప్పుమందువా !

 




       




      
ఏమి చేయమందు ఈశ్వరా !

ఏమి చేయ వలనని నన్నే
అడిగిన నేనేమి చేతును మానవా !


 
తెల్లవారినది మొదలు కల్లలాడు బ్రతుకాయె

దానికి కారణంబెవరు ? మానవా ?

నెల్లప్పుడు  నా కిచట నెవరి నే మందునయా

నెవరి నేమనుటకు నీకేమి అధికారము గలదు ?
అనవలయు నన్న ఈశుడొక్కడే నీ కాధారంబుగాద ?

అల్లకల్లోలవార్థి యైనది నా చిత్తము
చల్లగా నిన్ను తలచజాలు వీలేదయా

చిత్తమది నీదను మాట వదులుము మానవా
ఇంకను నాచిత్తము అనిన నేనేమి చేతును ?
నా నీ లు ఉండ నీవు నీవే గాదా నేనెక్కడ యిక ?
 


ఏ వారికి హితుడనో ఎరుగరాని లోకమున
నా వారని యెవ్వరిని నమ్ముకొని యుందురా

ఎవరు నీవారని లోకము నకు వచ్చినాడవు ?
నమ్మి ఎవరిని వచ్చినాడవు ? ఆ నమ్మకము
వీడి నీ వెవ్వారిని నమ్మ వలయు ?

ఈ వసుధ మీద వీర  లెఱుక గల్గి యున్నారని
నీ వారని యెవ్వరిని నేను తెలిసికొందురా
 


అందరు నావారే గాదా మానవా ? నన్ను వలయు
నన్న వాడివి మధ్యవర్తి నేల తెలిసి కొనవలయు ?
నన్నెరుక గొనుమా ! నన్నెరుగ నేనే నువ్వు !


మస్తకము దురూహల మయమాయె విసివితిని
దుస్తులవలె తనువులను త్రోసిత్రోసి విసివితిని
పుస్తకముల పరమసత్యమును వెదకి విసివితిని
ప్రస్తుతకర్తవ్య మేమొ బాగుగా తెలుపరా
        


తత్పర పరాత్పరాత్పర
మత్పర చిత్పరమువోలె మారుతి నాత్మన్
సత్పుర రాముని సన్నిధి
తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్ !

శ్రీ శ్యామలీయం వారి టపా చదివాక

శివోహం !

జిలేబి




Wednesday, April 13, 2016

వాకిట వేచిన జిలేబి !

వాకిట వేచిన జిలేబి !
 
రేఖా చిత్రం పొన్నాడ !
 
 
వాకిట జిలేబి ఓరగ
దాకుని వేచెను గదోయి తాపము తోడన్ !
ఆ కురు లందము గాంచన్
తూగెను ప్రేమికుడు మన్మధుని గానయటన్ !
 
చీర్స్
జిలేబి

Saturday, April 9, 2016

జిలేబి త్రిభంగి :) - భంగు తాగక నే కిక్కు నిచ్చు :)


జిలేబి త్రిభంగి :) - భంగు తాగక నే కిక్కు నిచ్చు :)


వడివడి చదువగ పదముల నటునిటు గుదురుగ వేసితి యీ వ్యాఖ్యను ఓ వాద్యమ్ముగ గావన్ !
బడబడ నటునిటు తిరుగుచు చకచక పనులను చాకువలే భార్యయు గాపాడన్, మరి సోఫా
నటునిటు జరుపుచు కుదురుగ జలజల నడకలు గూడన, “ఓహ్! నా,పని రాణమ్మా ” యని ఓ నా
డటు బిలువ మరి మురిపెము గొనెను గద! పెనిమిటి తోడను నీ డంగగు పాడన్రా యన, “పోడా”
సడి వలదని యరవపు సరి చెణుకుల విసిరె జిలేబి! సదా సౌమ్యము గా సాగాల మదీశా !


***

కుదురుగ నొకరికొకరు నిటు పరిమితముగ గదియే గుడిగా కూర్చుని నీకున్నూ మరిమాకూ
యిది సరస సమయమనుచు గడుపుదము విను !రమణీ !నిజమే ఈ రవి సాయిత్తే మనదోయీ !
విధిగను వినుదము నతని పలుకులను !మనలకు మేలుయనన్ వీరుడు గావించే నిది సువ్వీ !
గదిన మనము కులుకు చిలుకలవలె పరవశముగా నిటు యీ కాలము ఓంకారంబని రాగా
ల ధునిగ కలకలముల గనగ సరసపు పలుకులన్ మురిపాలాటల వేళాయే జవరాలా !



జిలేబి
(త్రిభంగి)

Friday, April 8, 2016

ఉగాది జిలేబీయం !

ఉగాది జిలేబీయం !
 
న్నది ఒక్క భూమి
గానము చేతము రండి
దినము ప్రతిదినము
జిగజిగ లాడు నది వోలె
లేమిని పారద్రోలి
బీరపు నడకన
యందరి జీవనము
శుభస్కరము
గానన్ !
 
అందరికీ
దుర్ముఖి నామ సంవత్సర
శుభాకాంక్షలతో
జిలేబి
 
వినుమ! జిలేబీ ! తొలగును 
జనగణ బాధాకరము! వసంతము వచ్చెన్,
మన యధినాయకులు తెలివి
గొని యెల్లర మేలుగూర్చగోరిన మేలౌ !
 
ఇదిగో వచ్చెను దుర్ముఖి !
ఇదియెల్లరికిని శుభముల నిచ్చును జూడన్!
పదవే యుగాది ముగ్గులు
విధముల వాకిట జిలేబి విరివిగ వేయన్ !