మా స్కూలు ముందు ఓ పెద్దమ్మ - అవ్వ బటాణీలు అమ్మేది.
తన మనవలు పొలం పనుల్లో కెళ్ళాక ఆవిడ మా వూరి దగ్గిరున్న గ్రామం నించి వచ్చి బటాణీలు అమ్ముకునేది. వరుమానం ఎంత వచ్చేదో నాకు సందేహమే. ఎందుకంటే ఆవిడ దగ్గిర ఒక చిన్న బుట్ట మాత్రమె ఉండేది. అంత చిన్న బుట్టలోని బటాణీలు ఎంత అమ్ముకుంటే పైసలు వస్తుంది అన్నది ఒక ప్రశ్నే.
అయినా తప్పనిసరిగా వూళ్ళో వున్న మా బడి కాడికి వచ్చి కూర్చొనేది. మేము ఐదు పైసలకి కాకుంటే ఓ పది పైసలకి బటాణీలు అడిగే వాళ్ళం. అంతకు మించి మా దగ్గిర పైసలు ఎక్కడ ?
ఓపిగ్గా బటాణీలు ఓ చేతిన్నర కాగితం లో పొట్లం ( చక్కటి కోన్ ఆకారం లో ) కట్టి ఇచ్చేది. దాని తో బాటు ఒక బోసి నవ్వు కూడాను. మా నవ్వూ ఆవిడకి (అప్పట్లో అంటే ఓ నాలుగో క్లాస్సో , ఐదో క్లాసో ఉండవచ్చు అనుకుంటాను ) బోసి నవ్వు లా అని పించేదేమో ? ఎందుకంటే మమ్మల్ని చూస్తె ఆవిడ నవ్వు ఇలా ఖాన్డ్లా నించి కొహిమ దాక లాగదీసిన భారద్దేశం అయ్యేది.
కొసరు అడిగితె ఆవిడ చెయ్యి ధారాళం. చాల సార్లు అడగకనే కొసరు వేసేది. అడిగామంటే బోసి నవ్వు ఇంకా సాగలాగి అలా పాకిస్తానూ, ఇలా బంగ్లాదేషూ భారద్దేశం లో కలిసి పోయేది.
ఓ వేసవి సెలవుల తరువాత ఈ పెద్దమ్మ కనబడ కుండా పోయింది. మాకు బటాణీలు అమ్మే అవ్వ ఏమైందో తెలియకుండా పోయింది.
ఓ పది రోజుల తరువాత , మా హెడ్ మిస్ట్రేస్సు మమ్మల్ని స్కూలు గ్రౌండ్ లో హాజరు పరిచి "అమ్మలూ , మీరు బటాణీల అవ్వ దగ్గిర దాచిన పైసలు , అవ్వ మీకందరికీ పలకా బలపం కొనిబెట్టమని చెప్పి ఇచ్చిపంపించి తాను దేవుడి దగ్గిరకి వేల్లిపోయిన్దర్రా" అని చెప్పి మౌనం గా ఉండి పోయింది.
ఆ తరువాయి మేమెప్పుడూ మా పెద్దవ్వ అంత భారద్దేశం నవ్వు చూళ్ళేదు. మీకెక్కడైనా ఆ బోసి నవ్వు అవ్వ కనిపించిందా ?
జిలేబి.