Thursday, December 15, 2011

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ - పై వారమే- సరి కొత్త ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ - పై వారమే

 సరి కొత్త

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

మీ అభిమాన బ్లాగర్ తో

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే

బ్లాగ్ముఖీయం !

ఎవరా బ్లాగర్ ?

ఏమిటి వారి గొప్పదనం

ఇది ఒక

ABN- ఆంధ్ర జిలేబి సహ సమర్పణ

స్పాన్సరేడ్  బై

వరూధిని బ్లాగ్స్పాట్ డాట్ కాం

ధమాల్ ధమాల్ డబాల్ డబాల్!

say చీస్ to  జిలేబి !

చీర్స్
జిలేబి.

Wednesday, December 14, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 4 - (శంకర విజయం - 3)

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !

శ్యామలీయమైన నెమిలి పై నుంచి బుజ్జి పండు నిదానముగా దిగాడు.

ఆతన్ని జూసి సభా స్థలి అచ్చేరువొందింది. ఈ బుడతడి ముఖమున ఏదియో తెలియరాని జ్యోతి (ఆ మాత జ్యోతిర్మయీ మహత్వమేమో ?)  ప్రస్ఫుటిస్తోంది.

ఇది అని చెప్ప నలవి కానిది.

షణ్ముఖుడు పంచకక్షం కట్టినవాడు.

ఈ బుడతడు జీన్స్ ప్యాంటు పై టీ షర్టు ధారి యై వున్నాడు.  కంటికి హారీ పాటర్ అద్దములు కూడాను. నెత్తి పై నామము. కాలికి నైకే షూస్.

షణ్ముఖుడు వేలాధయుడు. ఈ బుడతడు శర్కరీ ధారీ !

 ఒక చేత శర్కరీ , మరియొక్క చేత అంకోపరుండై వున్నాడు వీడు.

బుజ్జి పండు  సభా స్థలి కి ప్రణమిల్లి ,

"సభ యందు  వెలసిల్లిన పెద్దలన్దలికీ నా నమస్కాలములు ! నా పేలు బుజ్జి పండు , నేను మీ చెంత తెలుగు  నేల్చు కొనవలె నని మా మాత ఆదేశానుసాలముగా ఇచ్చటికి వచ్చితిని " అని,

రాజేశ్వరీ అక్కయ్య వారి వైపు తిరిగి , " నమో మాతా , నమో నమః ! పెద్దమ్మ వాలికి నమస్సులు " అని 'స్పెషల్' గా నమస్కరించడం తో రాజేశ్వరీ అక్కయ్య వారు తబ్బి మొబ్బిబై 

"రారార కన్నయ్య , రార వరాల పంట, రారార గారాల పట్టి ,తెలుగు నేర్వంగ " అని మురిసి పోయింది.

సభాస్థలి బుడతడి వైపు ఒక్క మారు , రాజేశ్వరీ అక్కయ్య వైపు ఒక్కమరూ చూసింది. 

ఈ మాతలు ఎల్లప్పుడూ వెన్నె హృదయులే సుమా అని అచ్చెరువొంది న వారు, వీరు వెన్నపూసై కరిగి పోవడానికి అర నిముషము చాలు సుమా అని తీర్మానించు కున్నారు.

బుజ్జి పండు ఈ మారు శంకరార్యులవైపు తిరిగి నమస్కరించి,

"అందమగు బ్లాగు నిలిపిలి యందలి
హ్లుదయముల నిలిచి యానందము
పెంపొందిచిన గులువు గాలికి
నమస్సులు కవివల , జేజే"

అని సాదర ప్రణామము గావించాడు. 

ఈ మారు  శంకరార్యుల వారికి సందేహం వేసింది,  " ఈ బుడతడు, మరీ తన బ్లాగు మొత్తం పరిపూర్ణముగా శోదించి వచ్చి వున్నాడేమో సుమీ " అని సందేహ పడిన వారై చిరునగవు ఒకటి నొసగి పండిత నేమాని వారి వైపు జూసినారు, ఆర్యా మీరు ప్రశ్నింపుడు బాలకుడిని అన్న చందాన.

పండిత నేమాని వారు, ఔరా , ఈ శంకరార్యుల వారి చాతుర్యమే చాతుర్యం - అన్నిటికీ నన్నే ముందు వుండమనటం అనుకుని,

ప్రకాశాముగా  " బాలకా, నీవు ఇచ్చట తెలుగు నేర్చుకొనుటకు మీ మాత పంపగా వచ్చినావని మా శ్యామలీయం మాష్టారు జెప్పారు. మంచి ప్రయత్నమే. కానీ వచ్చినవాడివి ఎటువంటి వ్రాత పుస్తకములు లేకుండా వచ్చి నావే" అని ధర్మ సందేహం లేపారు.

అసలు బాలకా నీవు నిజంగానే నేర్వడానికి వచ్చినావా అని వారు నేరుగా అడిగి ఉండవచ్చు. కాని సూక్ష్మం గా వారు ఈ లా ప్రశ్నించారు. అది వారి చాతుర్యం.

బుజ్జి పండు తడుము కోకుండా టపీ మని,

" అయ్యా పండిత నేమానీ గులువా - హస్తభూషణముగ అంకోపలుండగా  పుస్తకం బదేల హస్తమందు?" అని చిరు నగవుతో జెప్పి "అయ్యా చేత మా మాత నొసంగిన 'శల్కలీ ' సహిత ఇచ్చట వచ్చి వున్నాను ' అన్నాడు.

ఈ బాలకుడి రేఫమును ఎటుల సరి దిద్ద వలె నని శ్యామలీయం మాష్టారు తీవ్రముగా ఈ మారు చింతించడం మొదలెట్టారు.

" ఆర్యా, పండిత నేమాని వారు , ఆ బుడతడు శర్కరీ అన్న పదాన్ని అలా 'శల్కలీ' అన్నాడు. రేఫాలోపము అంతే.
ఒక చిన్న సందేహము నాకు ఇది దుష్ట  సమాసమేమో " అన్నారు శ్యామలీయం వారు - నానాటికీ తీసికట్టు నాగంభట్లు అయిపోతున్నానే సుమీ అని కొంత నివ్వెర పడుతూ.

ఆ రేఫా లోపమును మీరి ఆ బుడతడు జెప్పిన సమాదానమునకు పండిత నేమాని వారు సంతసించి,

" శ్యామలీయం మాస్టారు, మీ సందేహ నివృత్తి వేరుగా చర్చించ దెము , ముందు ఈ బుడతడి సమాధానం మాకు బాగుగా నచ్చినది " అని ఆప్యాయముగా తన మనవణ్ణి జూసినంత గా బుజ్జి పండుని గాంచి నారు పండిత నేమాని వారు. మనవళ్ళ వయసులో వున్న పిల్లలని గాంచిన తాత గార్లకు ఎల్లప్పుడూ సంతోషదాయకమవడం ప్రకృతి సహజ మే గదా!

పండిత నేమానీ వారు ఇంత శీఘ్రం గా కరిగి పోతారని అనుకోని గోలీ వారు దీర్ఘముగా బుడతడు బుజ్జి పండు ని గాంచి,

"నాయనా బుజ్జి పండు.. నీ ఇచ్చుకని మేము మేచ్చితిమి. అయినన్ను , మీ మాత మాట మీదుగా ఇచ్చటికి వచ్చి నాడవని అంటున్నావు. మరి మీ మాత గురించి నీకు తెలిసిన ఒక పద్యము జెప్పుము అని ఒక బాణాన్ని ఎక్కు పెట్టారు సూటిగా. వారు పేరు కు తగ్గట్టు గోళీ సూటిగా వేయుదురు -మధురమైన పద్యము ముందు వారు "తేనె రుచిని జూడ తీయదనము లేదు - పటిక బెల్లమందు పసయె లేదు - చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు"  అని అంతర్జాల పథముగా నొక్కి వక్కాణించినవారు కూడాను!

ఇలా సూటిగా గోలీ వారు బుజ్జిపండు ని బరిలోకి లాగడం తో , సభాస్థలి బుజ్జి పండు ఏమి జేప్పునో అని కుతూహల పడి ఆతురతతో బుడతడిని గాంచినది !

బుడతడు నిదానముగా సభా స్థలి ని కలయ జూసి, పండిత గోలీ శాస్త్రు లవారి కి ప్రణామం బులు వొనరించినాడు .

(సశేషం)

Sunday, December 11, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 3 - (శంకర విజయం - 2)

సభా ప్రాంగణమున బుడతడి గురించి చర్చా ఘట్టము

శ్యామలీయం మాష్టారు సభా ప్రాంగణమున ప్రవేశించి పిడుగు బుడతడి రాక ని కవి పండితాదులకి తెలియజేసారు.

"మన ఈ కవితా ప్రాంగణమున ఆ బుడతడు ఏమి నేర్చుకునును? దీనికి కొంత తెలుగు జ్ఞానము కలిగిన వారై , గ్రాంధికము తెలిసిన వారై వుండిన కదా ఏమైనా వారికి అర్థమగును ? అందులోనూ , బుడతడు అంటున్నారు శ్యామలీయం వారు . అంత చిన్న పిల్లవాడు మనతో ఎలా సంభాషించ గలడు ? "అన్న పండిత నేమాని వారి  పృచ్చ తో సభా ప్రాంగణమున కలకలము, మంచి విషయము చర్చకు వచ్చినది అన్న సంతోషము వారిలో కలిగినది.

ఈ ప్రశ్న కి స్వయముగా సమాధానము జెప్పక ఎప్పటి వలె శంకరార్యులవారు అష్ట దిగ్గజముల వైపును, మీదు మిక్కిలి పండిత లోకమును గాన్చినారు చిరునగవుతో , మీ సమాధానం ఏమిటి జెప్పుడు అన్నట్లు. ! ఆర్యులవారు ఎప్పుడు తమ అభిప్రాయమును మొదటే జెప్పరు. అది వారి సొబగు. అప్పుడే కదా కవితా లోకమున ఇంద్రధనుస్సులు వెల్లి విరియును !

లక్కాకుల వారు వెంటనే లేచి, 'అయ్యలారా, మనం ఇంత సంకోచించ రాదు. మనము వృద్ధులమై పోతున్నాము. ఈ సభ మనతో నే ముగిసి పోవలెయునా ? నది పారును. తటాకము ఒక్క చోటే ఉండును. మనము తటాకం వలె ఒక్కరే ఉన్నాము. మనము నదియై పారవలె. అప్పుడే కదా ఈ కవితా లోకము అభివృద్ధి చెందును ? కాల ఘట్టములో చూడుడు, నదీ ప్రవాహక ప్రదేశములలో నే కదా జన జీవనము ? కావున నా అభిప్రాయం , మనము నదియై  పారవలె. మనతో బాటు చిన్న కాలువలు రావచ్చును. అవి కొంత కాలం తరువాత మనలో కలసి, ఆవియును నదియై , మహానదియై రాబోవు కాలమునకు స్ఫూర్తి నిచ్చుదురు " అని భావవేశాముతో తమ నిర్దుష్ట అభిప్రాయమును తెలియ జేసినారు.

ఈ మారు శ్యామలీయం వారికి  'భేషో లక్కాకుల మాష్టారు' అని మొదటి మారు అనాలన్న సంతోషము గలిగినది. తన మనసున వున్న మాటయే వారు కూడా అనేయటం తో వారికి ఇక బ్లాగ్కామెంటు ఇవ్వటం కుదరక శ్యామలీయం వారు లక్కాకులవారికి బ్లాగ్కామ్ప్లిమెంటు ఇచ్చి ముసి ముసి నవ్వులతో తమ ఆనందాన్ని తెలియ జేశారు.

ఇక మిగిలిన మాష్టార్లు , ఓ మోస్తరు గా , తమ అభిప్రాయమును లక్కాకుల వారి వలె తెలియజేసారు, తమదైన స్వంత శైలి లో. రాజేశ్వరీ అక్కయ్య గారికి మొదటి మారు సంతోషం వేసినది. ఇప్పటిదాకా అందరు పెద్ద మనుషల సాంగత్యం తో తన చిలిపిదనం కట్టు బెట్టి కొంత గంభీరం గా ఉండవలసి వచ్చే. ఈ బుడతడి రాకతో వారి మాతృ హృదయము కొంత ఊరట జెందినది.

పండిత నేమాని వారు ముసి ముసి నవ్వులతో, మొత్తం చర్చని గమనించి, 'ఆర్యులారా, నేనలా మొదటే అనడం వల్ల మన చర్చా కార్యక్రమము రమ్యముగా జరిగినది. గురువు గా తమ మొదటి కర్తవ్యం శిష్యులలో ఉత్సుకతతని నెలకొల్పటం ! ఆ కర్తవ్యమును నేను సరిగ్గా నెరపినానని భావిస్తాను ! ఇక మనం శంకరార్యులవారి అభిప్రాయమును తెలుసు కొందుము ' అని ఆర్యులవైపు చూసారు వారు.

శంకరార్యులవారేమైనా తక్కువ వారా ? నాలుగు పదుల సంవత్సరం అధ్యాపక వ్రత్తి ని కడు రమ్యముగా గావిన్చినవారు. వారు అవుననీ కాదనీ అనకుండా , ఎప్పటి వలె,
' ఆర్యులారా, మనం ఏదైనాను సమస్యా పూరణము ద్వారానే కదా అన్నిటికి పరిష్కారము గావిన్చేదము. కావున ఈ బుడతడికి కూడా ఒక ప్రశ్న ఇచ్చెదము . వాడు దానికి జెప్పు జవాబు బట్టి మనము తీర్మానించ వచ్చును ' అని శ్యామలీయం వారి వైపు తిరిగి, ' శ్యామలరావు గారు, ఆ బాలకుడు జేప్పినది ఏమి ? తన మాత మాట గా వచ్చితి నని కదా ? " అన్నారు

' అవును ఆర్యా' అన్నారు శ్యామలీయం మాష్టారు. ' ఇందులో ఏదైనా వేరే సూక్షమ్ము ఏదైనా ఉందా ' అని ఆలోచిస్తూ.

'కావున ఆ బాలకునికి, వారి మాత గురించి జెప్పుమని ఒక ప్రశ్న వేసెదము. వాడు దానికి ఏమి జేప్పునో దానిని బట్టి మనము ఆతనికి సభా ప్రవేశము ను ఇచ్చుట యో లేక తిప్పి పంపి వేయుటాయో జేసేదము !' అని ఆర్యులవారు జెప్పారు.

అష్టదిగ్గజములు ఎప్పటి వలె  దీనికియునూ తలయూపి, శ్యామలీయం మాష్టారు వైపు జూసినారు.

శ్యామలీయం వారు, 'నెమిలి' యై చెంగున ఎగిరి, బుజ్జి పండుని తమ మూపురము పై నిడుకుని సభా ప్రాంగణమున తిరిగ రాగా, ఆ షణ్ముఖు డే వచ్చాడా అన్నంత గా ఆ సభా ప్రాంగణము దివ్య కాంతులతో ప్రజ్వరిల్లినది. !

(సశేషం)

(నేడు డిసెంబర్ పదకొండు ! -

 ప్రముఖ  తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి(సుందర తెలిన్గినిలే పాటిసై త్తేన్ అని తెలుగు సొబగు ని మెచ్చుకున్న తమిళ కవి వారు )  గారి జన్మ దినం అని మా సింగపూరు వారి oli ఎఫ్ఫెం వారి  మాంచి తమిళ పాటలు పెడుతున్నారు. ఈ శుభ దినమున మన బుడతడు శంకరాభరణము కొల్వును జేరుట శుభ సూచకం గా భావిస్తాను !

మీదు మిక్కిలి కందుకూరి పంతులుగారి జన్మదినం అని మన నవ రసజ్ఞ వారు తెలుపుతున్నారు రాజమహేంద్రవరం నించి.. ఆ పై ఎందుకో ? ఏమో ? గారు  తెలుగు బ్లాగు మహోత్సవ దినం కోసం ఒక మాంచి వీడియొ తయారు జేసి అందరినీ ఆశ్చర్యామ్భుధిలో ఓల లాడిస్తూ వున్నారు !  - ఈ శుభ దినాన శ్రీమాన్ బుజ్జి పండు వారు శంకరాభరణం కొలువు ప్రవేశం మరీ శుభ సూచకం! జ్యోతిర్ మాయీ వారు సంతోషమే కదా !

 - చీర్స్  జిలేబి )

Saturday, December 10, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 2 - (శంకర విజయం) !

శంకరార్యుల వారి శంకరాభరణం కొలువు జగజ్జేగీయ మానం గా కవి పండితాద్యులతో వెలుగొందుతోంది.


మహామహులైన పండితులు , నిష్ణాతులు , గ్రాంధికం , గ్రామ్యం కాచి వడబోసిన పెద్దల కొలువు అది.

ఆర్యులవారు చిరునగవుతో వీక్షించు చూ , తమ సహ పండితులని అష్ట దిగ్గజములై న వారిని ఒక మారు కలయ జూసినారు

కొలువులో

పండిత నేమాని వారు,
చింతా వారు
సుబ్బారావు గారు
శ్యామలీయం గారు
లక్కాకుల వారు
గోలీవారు
శ్రీపతి  గారు,
రాజేశ్వరీ అక్కయ్య గారు

లాంటి అష్ట దిగ్గజములను గాంచి ఆ పై నను వున్న మీదు మిక్కిలి పండిత లోకమును గాంచి, ఆ నాటి కొలువు విశేషములు వారు మొదలు బెట్ట బూనినారు.

ఈ శంకరాభరణము కొలువు కు శ్యామలీయం గారు మంజరీ ద్వార పాలకులై ( ఆంగ్లములో గేటు కీపరు అందురు) కొలువుని కడు జాగ్రత్తగా కాపాడుకొంటూ తమ అసామాన్య ప్రతిభా పాటవాలతో ఒక వైపు ఐటీ రంగమును మరొక వైపు కవితా వెల్లువలను సమ పాళ్ళలో 'క్రోడీకరించి' న వారై , ఒక కన్ను ను ఎప్పుడు మంజరీ ద్వారముపై పెట్టి ఉందురు - ఏల అన ఎవరైనా తుంటరులు అనానిమస్సులై అక్కడ ప్రవేశించి ఏమైనా సభా భంగము గావించిన వారికి వెంటనే వారు ఝాడూ చూపించి తరిమి వేయుదురు.

అటువంటి గురుతరమైన భారముతో వారు శంకరార్యుల కొలువును గాపాడుచూ, ఒక వైపు గ్రాంధి క మా , మరో వైపు గ్రామ్యమా అన్న లక్కాకుల వారికి సమానముగా తమ బ్లాగ్కామెంట్ ఫటిమ లో నెగ్గుకుని వస్తూ, మంజరీ ద్వారమున ఒక్క మారు వీక్షించినారు శ్యామలీయం వారు.


(బుజ్జి పండు ప్రవేశం)

శ్యామలీయం మాష్టారు - తనలో

ఎవరో ఒక బుడతడు ఇటు వస్తున్నాడే !  ఈ సభా ప్రాంగణములో ఈ బుడతడికి పని ఏమి ?
ముక్కుపచ్చలారని ఈ పసిబాలుడికి ఈ ప్రబంధ ప్రదేశమున పని ఏమి ? అనుకున్న వారై,

(ప్రకాశముగా)

ఓరీ బాలకా, ఎవరవు నీవు ఎచట నుంచి నీ రాక ? అని గంభీరముగా చూసినారు. వారు గంభీర స్వరూపులు. వారి చూపులు నిశితమైనవి.

బుజ్జి పండు కొంత బెదిరి,

మలీ అండీ, మలీ అండీ... మలీ అండీ ....

ఈ మలీ మలీ ఏమిటి ? స్ప్రష్టముగా చెప్పుము !  నీ పెరేమిటోయీ ?

మలీ మలీ అండీ, నేను మా మాత పంపగా వచ్చినానండీ !

శ్యామలీయం మాష్టారు  గారు అబ్బురు పడి పోయారు. ! ఈ బాలుడు మాత అన్న పదమును ఎంత స్వచ్చముగా స్వేచ్చెగా పలికినాడు సుమీ ! ఈ మమ్మీ ల కాలములో వీడు మాత అని పలకటం గొప్ప విషయమే !

వారు ఈ మారు కొంత స్వాంతన స్వరముతో బాలకా, నీ పేరు ఏమి ? అని నిదానముగా అడిగినారు

నా పేలండీ , నా పేలండీ, ...

ఓహో ఈ బాలకునికి సాధు రేఫములు పలకడం కష్టమైనట్టున్నది ! అని భావించి శ్యామలీయం వారు, పోనీ, మనమే వేరు విధముగా అడిగి చూతము అని,

బాలకా, నీ నామమేమి ? అని రేఫములు లేక సాధు గా అడిగారు ఈ మారు .

మీలు పెద్ద వాలండీ, నామమేమి అనకూడదు. నీ నామమెక్కడ అని అడగ వలె ! నా నెత్తిపై వున్నది  చూడుడు , అని ఒక చెణుకు మన బుజ్జి పండు వేసి,

స్వామీ, నా నామము బుజ్జి పండు అని తనను పరిచయము చేసుకున్నాడు.

హార్నీ, బుజ్జి పండు , ఏమి ఈ తెలుగు పేరు ! ఈ కాలములో పిల్లలకి ఇంత మంచి స్వచ్చమైన  పెరెట్టిన తల్లులు గారు వున్నందువల్లే కదా, ఈ శంకరాభరణము వంటి కొలువులు ఇంకనూ వర్దిల్లుచున్నవని వారు సంతోషపడి,

బుజ్జి పండూ, నీ చెణుకు కి నేను మైమరిచితిని. ! నీ విక్కడి కి వచ్చిన కారణం బెద్ది ? అని వారు ప్రశ్నించారు.

"మా మాత, జ్యోతిల్మాయీ వాలు, నన్ను మలింత  తెలుగు నేల్చుకొనుటకు మీ శంకలాభలనము కొలువుకి నన్ను పంపినాలు మా మాత నన్ను అమలికా నిండి ఇక్కడి కి పంపించినాలు మీ వద్ద అంతల్జాల వాసము చేయమని ' అన్నాడు బుజ్జి పండు.

శ్యామలీయం మాష్టారు, ఈ అబ్బాయి ని గాంచి ముచ్చట పడి, వీడికి ఒక్క  రేఫమే కదా సమస్య ! ఈ తెలుగు లోకం లో ఎంత మందికి అసలు తెలుగే రాదు. అటువంటి కాలములో వున్న ఎందరికో కన్నా, ఈ బుడతడి ఉత్సుకతకి ఆ రేఫలోపము ( ఇది దుష్ట సమాసమా అని రేపు ప్రశ్న టపా లో వేయవలెనని గుర్తు పెట్టుకుని ) ఒక్కటే కదా, మన్నించి, శంకరాభరణం కొలువలో ఈ బుడతడికి ప్రవేశము కలిపించి ఈ బుజ్జి పండుకి తెలుగు నేల్పుదము ( హమ్మో, నాకు రేఫలోపము వస్తున్నదే సుమీ!, జాగ్రత్త గా వుండవలె అని మనస్సులో అనుకున్న వారై)  అని తీర్మానించి,

బాలకా, బుజ్జి పండు, వేచి వుండుము, నేను సభా ప్రాంగణములో మా పండితుల వారి అనుమతి గైకొని వచ్చి నిన్ను తోడ్కొని పోవుదునని వాక్రుచ్చి, వారు సభా ప్రాంగణంలోనికి వెళ్ళారు !

(సశేషం)

Wednesday, December 7, 2011

బుజ్జి పండు తెలుగు చదువు !

బుజ్జి పండు తన తల్లి గారైన శర్కరీ జ్యోతిర్ 'మాయీ' వద్ద వారు నేర్పిన తెలుగుని నేర్చుకుంటూ తెలుగు కాంతుల విరజిమ్ముతూ తెలుగు బిడ్డగా అమెరికా దేశమునందు పెరుగు చున్నాడు.

ఆ తల్లికి, తన తనయుడు మరి ఇతర తెలుగు గురువుల వద్ద తెలుగు ని నేర్చుకోవలె అనెడి కోరిక గలిగెను. తాను ఎంత నేర్పినను , సరియైన గురువు చెంత నేర్చిన విద్యయే కదా విరాజిల్లు అని ఆ తల్లి తలబోసి

'పుత్రా, బుజ్జి పండూ,  నీవు నా దగ్గిర నేర్చిన తెలుగు ని ఇంకను అభివృద్ధి చేసుకొనుటకై నేను నిన్ను మరి కొందరు మన 'తెలుగు బ్లాగ్ గురువుల  చెంత గురుకుల వాసము చేయుటకు పంపవలెనని నిశ్చయించితి అని ఆ మాత పలుకగా,

తనయుడు బుజ్జి పండు 'మాతా, నీ వాక్కు నాకు శిరోదార్యము. వెంటనే సెలవీయుడు , నేను మొదట ఏ e-గురువుల వారి వద్ద వాసము చేయవలె నని అడుగగా

 ఆ మాత కడుంగడు ముదావహము తో

'పుత్రా బుజ్జి పండూ,  నాకొక్క దినము అవకాశము నిమ్ము, నీకు ఆ గురువుల పేరు తెలిపెదను ' అని బహు సంతోషానంద  భరితు రాలై 'పుత్రోత్సాహముతో' ఆ నాటి కార్యక్రమములను ముగించుటకు సంసిద్దురాలాయెను.

పుత్రుడు బుజ్జి పండు తాను నేర్చుకోబోవు తెలుగు ను దృశ్య కావ్యముగా జూచుచు నిదురయందు జారుకొనెను.


(సశేషం)

Tuesday, December 6, 2011

మాయన్ కాలెండరు - 12-Dec-2012 సారూప్యతలు - ఇది జిలేబి పరిశోధన!




మాయన్ క్యాలెండరు గురించి జరుగుతున్న పరిశోధనలు గురించి మీలో చాలామంది చదివే ఉంటారు.



దీనికి సంబంధించి కొంత చదివాక సరే - మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమైనా ప్లానెటేరి పొసిషన్స్ కనిపిస్తున్నాయా అని ఆ రోజు కి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి , రెండు వేల పన్నెండు కి చక్రం గీస్తే నాకైతే ఎలాంటి విశేషాలు కనిపించలేదు చార్ట్ లో.


సరే - ఇంత గగ్గోలు అవుతోంది కదా - ఈ మాయన్ కాలెండర్ సబ్జెక్టు అని కొంత ముందు వెళ్లి డిసెంబర్ పన్నెండో తేది ,(కాకుంటే పదమూడో తేది ) రెండు వేల పన్నెండు కి చార్ట్ చూస్తె - ఓ పాటి విలక్షణమైన జ్యోతిష చార్ట్ కనిపించింది. అంటే - రెండు ప్లానెట్ లు తప్పించి, ( మంగళ, శని గ్రహాలూ తప్పించి మిగిలిన వన్ని కల గట్టుకుని ఎదురెదురు గా కనిపించడం, ఆ పై డిసెంబర్ పదమూడో తేది అమావాస్య కూడా కావడం లాంటివి నాకు తట్టిన విశేషాలు. మీకు జ్యోతిష్య శాస్త్రం తెలిసి ఉంటె మరీ మీరు  పరిశోధించి ఉండ వచ్చు.

అంతె కాకుండా - పదమూడో తేది అమావాస్య కాబట్టి - డిసెంబర్ ఇరవై ఒకట వ తేది నవమి.

త్రేతాయుగ కర్త శ్రీ రాముని జననం     నవమి లో.

ద్వాపర యుగ కర్త శ్రీకృష్ణుడి జననం  అష్టమి లో.


కలి యుగ కర్త ( ఎవరు? ) తెలియదు, నాకైతే - కలి ప్రభావం అనుకుంటే - శ్రీ కృష్ణ పరమాత్ములవారు ఈ కలి యుగానికి కూడా అవతార పురుషుడు  గా అనుకోవచ్చు. (వచ్చే అవతారం దాక, లాస్ట్ అవతార పురుషుడు ఇన్-చార్జ్ అన్న మాట!)


సో, ఈ రీతిలో ఆలోచిస్తే - సప్తమి రోజున ఏదైనా విశేషం ఉండవచ్చా?

అంటే ఈ డిసెంబర్ పన్నెండు నించి ఇరవై ఒకటి లోగా ఏదో విశేషం జరగవచ్చు అని ఊహించవచ్చా?

ఈ టపా ముఖ్యోద్దేశం మీకు తెలిసిన ఏదైనా పాయింటులు వుంటే వాటి గురించి రాయగలరు.

ఈ శీర్షిక పై మొదటి సారి నేను రాసినప్పుడు, సందీప్ అనే బ్లాగరు, పంచవటి అన్న గ్రూప్ కి ఈ మేటర్ ని పంపిస్తానని అందులో నిష్ణాతులు ఏదన్నా చెబ్తారేమో చూస్తామని అన్నారు. కాని ఆ తరువాత ఆ సందీప్ అన బడే ఆసామి దీని ని పంచవటి కి రెఫెర్ చేసారా, దాని పర్యవసానాలు నాకు తెలీదు. వారి నించి ఎట్లాంటి స్పందనా రాలేదు. శ్రీ తెలుగు యోగి శర్మ గారి ప్రకారం ఈ తేదీలలో ఎట్లాంటి విశేషాలు లేవు. (నా కు తెలిసి వారు రాసిన టపాలని బట్టి, - వేరుగా పంచవటి లో వేరే ఏమైనా సవివరం గా చర్చించి వుంటే నాకు తెలియదు)

ఆ  పంచవటి వారు గాని, వేరే వారేమైనా దీని ని పరిశోధించి వుంటే వివరాలు తెలుప గలిగితే మరీ సంతోషం !

సర్వే జనాః సుఖినో భవంతు ! సమస్త  మంగళాని భవంతు. !!



చీర్స్
జిలేబి

Monday, December 5, 2011

శ్రీ రామరాజ్యం నేను చూడను గాక చూడను !

అయ్య బాబోయ్ ,

బ్లాగ్ లోకం లో ఎన్నెని టపాలు శ్రీ రామరాజ్యం పై

ఇన్ని చదివాక నా తెలివి మరీ ఎక్కువై పోయింది.

సినిమా చూడ్డం మరో ఖర్చు ఎందుకు?

ఫ్రీ గా ఇన్నిన్ని టపాలు చదివేక, మొత్తం చిత్రం కళ్ళ ముందు ఫ్రీ గా వచ్చేసింది.

నేను సినిమా చూడను, రివ్యూలు  చదువుతాను.  అంతే !

(నేను హార్లిక్స్ తాగను , తింటాను  అని మా మనవుడు అంటే , వీపు మీద విమానం మోగుతుందిరా మనవడా అన్న మాటలు గుర్తుకొచ్చి.... మనకూ ఎవరైనా విమానం మోత పెడతారేమో, ఇక్కడ్నించి వెంటనే పరారై పో జిలేబి!. )

చీర్స్

జిలేబి.

Saturday, December 3, 2011

ఖబడ్దార్ - మీరెక్కడి నించి రాస్తున్నారో , మీరెవరో అంతా మాకు తెలుసు !

బాబయ్యా - బిగ్ బ్రదర్ మిమ్మల్ని తోలుకు రమ్మన్నాడు !

బాబయ్య కి తానేం తప్పు జేసాడో తెలీలే ! తాను చిన్నప్పుడు సినిమాలలో జూసేడు - వూళ్ళో ఎవడైనా ఏదైనా జేస్తే , 'అన్న' కబురంపే వాడు - ఆ తరువాత ఆ కబురు అందుకున్నవాడు గాయబ్ !

ఆ మధ్య కోల్డ్ వార్ సమయాల లో వీడు వాణ్ణీ, వాడు వీణ్ణీ అద్దాలు బెట్టి గమనిమ్చుకునే వాళ్ళు.  స్పై , క్రాస్ , డబల్ క్రాస్స్ మొదలగు పేర్లతో వీళ్ళు ప్రసిద్ధులు.

మన ఒక కాలపు తెలుగు సినిమాలో 'అన్న' ఎప్పుడు  కరకు మనిషే. అన్న రమ్మన్న డంటే , మన కు మూడి నట్టే లెక్క అన్న మాట !

ఇప్పుడు ఆ పెద్దన్నయ్య మన భారద్దేశం అయి పోయిందని వార్తా పత్రికల భోగట్ట !

ఇక మీదట జిలేబి ఏదైనా రాస్తే వెంటనే (ఆల్రెడీ తెలుసేమో?) పెద్దన్నయ్యకి ఖబురు వెళుతుంది.

జిలేబి మీ గురించి రాసిన్దటండి !

ఏమి గీకిన్దిరా ఆవిడ ?

మీరు బిగ్ బ్రదర్ అనండి

వెంటనే ఆవిణ్ణి బొక్కలో పెట్టు. ఏమిటా ఖండ కావరం? నన్ను మిస్టర్ బిగ్ బ్రదర్ అని వుండాలి కదా !

ఇప్పుడు జిలేబి కి సందేహం వస్తోంది. ఈ సంకలునులు, హారం లు కూడా ఈ బిగ్ బ్రదర్ కి సీక్రెట్ ఎజెంట్లేమో ?

ఎందుకంటే మనం ఏమైనా రాస్తే, వీళ్ళకి వెంటనే తెలిసి పోతోన్దబ్బా ! అదే ఎలా నో తెలీయటం లేదు.!

వెంటనే మనం గాయబ్ అయి పోవటం మంచిది ఈ బ్లాగ్ లోకం నించి!

చీర్స్

జిలేబి.

Friday, December 2, 2011

కామెంటు కోసం ఒక టపా రాద్దామని !

అందరూ టపా కి కామెంటు రాస్తారు. సరే, కొంత వెరైటీ గా కామెంటు కోసం ఒక టపా రాద్దామని !

కామెంటడం అన్నది ఒక కళ. అది బ్లాగ్ లోకం లో కొందరికి అచ్చి వచ్చిన విద్య.

మరికొందరికి చాలా కామెంటాలని ఉంటుంది.

 కాని సమయాభావం వల్లో, సాంకేతిక కారణాల వల్లో, చిన్నగా రాసి ఊరుకుంటారు.

ఇవ్వాళ బ్లాగ్ లోకం లో జల్లెడ వేసామంటే ఎక్కువగా కనిపించే కామెంటు రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ! :)

ఆ తరువాయి - కనిపించే చాలా కామన్ కామెంటులు - సూపెర్, కెవ్వు, కేక ! హ హ హ , hahahaha ,
lol...ఇలా చిన్ని చిన్ని పదాలతో కామెంటు తారు.

సో ఇవన్ని తెలుగు లోకానికి బ్లాగ్ లోకపు సరి కొత్త పదాలు

కొన్ని ఇప్పట్లో ఉన్న తెలుగు పదాలే, కొత్త అర్థం ఆపాదించుకోవడం కూడా కద్దు. ఉదాహరణకి , కెవ్వు కేక - ఈ పదం టపా సూపెర్ అన్న అర్థం లో వాడతారనుకుంటా . అంతర్జాలం లో మరిన్ని సరికొత్త పదాలు పోను పోను వస్తూంటాయి అనుకుంటాను.

కొంత కాలం పోయాక , నిఘంటువు ఎవరైనా ప్రచురిస్తే , ఈ కొత్త పదాలు ఆ నిఘంటువులో వస్తాయేమో ? మొదట్లో కొంత విముఖం గా ప్రచురించినా పోను పోను వేరు వేరు ప్రచురణలలో కొత్త అర్థాలతో వస్తాయేమో !

మరో పోకడ, టపా కన్నా సుదీర్ఘ మైన కామెంటు- వ్యాఖ్య ! ఇది టపా కన్నా చాంతాడంత మరో టపా అంత నిడివి ఉండటం కద్దు.

కొన్ని చమక్కులు,
కొన్ని కవితలు,
కొన్ని పద్యాలు,
కొన్ని చేణుక్కులు,
కొన్ని సమస్యా పూరణలు
కొన్ని కొంటె దనాలు
కొన్ని ఇన్ఫర్మేటివ్
వెరసి నేటి బ్లాగ్ కామెంటులు
ఓ విన్నూత్న సాహితీ ప్రక్రియ !

ఇప్పటి దాకా రానిది చైను కథానిక, కామెంట్ల ద్వారా ! (టపా ల లో ఇంతకు ముందే గొలుసు కథలు వచ్చేయని ఒక మారు జ్యోతి గారు చెప్పారు - సో , కామెంటుల లో ఇప్పటిదాకా ఈ ప్రయత్నం రాలేదనే భావిస్తాను !


చీర్స్
జిలేబి.

Thursday, December 1, 2011

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఆడదాం రా!

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఆడదాం రా

నాకు

నాలుగు ముక్కలాట తెలుసు

నాలుగు స్తంభాల ఆట తెలుసు

నాకు

జోకాట తెలుసు

పేకాట తెలుసు

కానీ

ఈ కామెంటు లలో వచ్చే

రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట ఏమిటో

కాస్త వివరించి చెబ్దురూ !

:)


చీర్స్
జిలేబి.