గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.
***
పరహిత వైద్యం
కం. తరచుగ బహుదేహంబుల
తిరుగెడునది తానె యనుచు తెలిసి తగుగతిన్
పరిచర్య చేయునదియే
పరహితమన నెగడు చుండు వసుధ జిలేబీ
కం. కాలగతి చెందువిద్యల
కాలము పునరుధ్ధరించగల తరుణములున్
కాలస్వరూపుడగు హరి
లీలలచే నిలను పొటమరించు జిలేబీ
రాబోవు కాలం
కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ
చేతులు కాలాక
కం. చేతికి సెగ సోకినచో
మూతికి మహబాగ గోరు ముద్దలు దొరకెన్
తాతకు నాతికి నిద్దరి
కీ తీరున సంబరములు హెచ్చె జిలేబీ
కం. జరిగిన జ్వరమంతటి సుఖ
మరుదని చెప్పుదురు గాదె అటులే ముద్దల్
సరదాగ నోటికందుట
మరి యెందరి భాగ్య మన్న మాట జిలేబీ
కం. ఇది చాలా బాగున్నది
బ్రదుకున నిటుంవంటి తీపి ప్రతివారికి నం
దదు నిక్కంబుగ భళిరే
ముదిమికి ముచ్చట్లు లావు పుడమి జిలేబీ
కం. తప్పులు సైరించెడు సతు
లెప్పుడు పడుచుందు రిడుము లీ విధముగనే
తప్పున్న దిద్దకుండిన
తిప్పలు పెట్టుటయె మగల తీరు జిలేబీ
ప్రేమిస్తున్నా
కం. ప్రేముడి యెంతయు గొప్పది
కామంబును ప్రేమయొకటి గావను నెరుకన్
సేమంబుగాంచు టొప్పును
ధీమంతుండుండు దీని తెలిసి జిలేబీ
కం. అన్నన్నా దిన మొక్కటి
యున్నదనన్ ప్రేమికులకు యుర్విని ఘనమై
మున్నూరరువది నాలుగు
చిన్నదనము బొందు నేమి చేతు జిలేబీ
కం. ఆదిన మీదన మని యే
డాదిని గల దినములన్ని యటునిటు పంచన్
మీదెరుగు తలపు జేయగ
నే దినమును మిగుల లేదు నిజము జిలేబీ
సన్యాసి బుట్టలో పడ్డాడు
నచ్చిన సుందరి యెందుకు
వచ్చెడు నొక బుట్టలోన వయ్యారముగా
తెచ్చిన యా బుట్టనె విభు
ముచ్చట చెఱ గొనగ గాక పోదు జిలేబీ
అందాల బుట్ట లోపలి
సుందరవదనారవింద సుదతీమణి చే
యందుకొనిన సన్యాసియె
వందేళ్ళకు బంది యనగ వచ్చు జిలేబీ
సన్నాసిని చేసెడునో
సన్నాసిని చూసి కన్య సరదా పడునో
సన్నాసియగుట తథ్యం
బన్నన్నా పురుషు డాలి బంటు జిలేబీ
నల్లని కురులు
వెల్లుల్లి తలకు పూసిన
నెల్లరు దూరంబు జరుగ నిక కేశములా
తెల్లనివో నల్లనివో
అల్లరి యిక లేదు గనుక హాయి జిలేబీ
మధురాధిపతే అఖిలం మధురం