ప్రియమైన చెల్లెలు వరూధిని కి -
అక్కయ్య ఆశీర్వదించి వ్రాయునది. ఉభయ కుశలోపరి.
అమ్మాయి సౌమ్య పెళ్లి విషయమై మై బామ్మ కాబినెట్ మీటింగ్ ఇవ్వాళ పెట్టింది.
మన ఇంటి పెద్ద మంత్రులు ఐన అన్నయ్యలు హాజారైనారు మీటింగుకి.
మీ బావగారు జంబూ వారు నిమిత్త మాత్రులు కాబట్టి బామ్మే మీటింగుని ఖరారు చేసి ఉచిత పీఠాన్ని అలంకరించింది.
మూడోతరం మంత్రులు అంటే చిన్న చితకా కుర్రకారు అందరు క్వాలిటి కంట్రోల్ ప్రోగ్రాం కోసం దేశాల మీద ఉన్నారు కాబట్టి (నిన్నూ చేర్చి) వాళ్ళంతా గైరు హాజారు మీటింగుకి.
దరిమిలా బామ్మ నీ పెళ్లి ఖాతా వెతికి దాని ప్రకారం అమ్మాయి సౌమ్య పెళ్లికి బడ్జెట్ తయారుచేసింది. ఆ లెక్కల ప్రకారం పెళ్లి ఖర్చులు వెరసి పది రెట్లు ఎక్కువై పోయినాయి.
బడ్జెట్ బ్రతుకులు కాబట్టి బామ్మ బుగ్గలు నొక్కేసుకుని బావ గారి వైపు చూసింది -
మీ బావగారు ఎలాంటి ఫీలింగు లేకుండా నా వైపు చూడడం నేను ఏమి చెయ్యాలో పాలుపోకుండా మన ఇంటి పెద్ద మంత్రులు వైపు చూడడం వాళ్లు ఏమి చెయ్యాలో తెలియకుండా బామ్మ వైపు చూడడం,
బామ్మ తీక్షణ ద్రిష్టి తో మమ్మల్ని వీక్షించి "ఒరేయి బడుద్దాయిలు - మీరేమి చేస్తారో నా కవసరం. ఎట్లా చేస్తారో నాకనవసరం. అమ్మాయి పెళ్లి మూడు నెలల్లో ఖరారు అయిపోవాలి " అని అల్టిమేటం జారి చేసింది.
ఈ తంతు తో ఇవ్వాల్టి కాబినెట్ మీటింగ్కి బామ్మ వీడుకోలు చెప్పి అందర్నీ పని మీదికి అంటే అమ్మాయి సౌమ్య పెళ్లి పని మీద పురమాయ్యించడం తో నా మనసు కొంత కుదుట పడింది.
ఈ మీటింగు తరువాయి మీ బావగారు యథా ప్రకారం దిన పత్రిక పడక కుర్చీలో కూర్చుని తిరగేయ్యటం మొదలెట్టేరు !
ఏమి చేతును నా చిట్టి చెల్లీ?
ఇదీ కథ!
బావగారికి నా నమస్సులు. !
ఇట్లు
నీ పెద్ద అక్కయ్య
జిలేబీ.