Tuesday, April 3, 2012

హై 'టెక్కు' మహిళలకు గులాం !

"చ చ చ అసలు ఈ లోకం లో మగ వాళ్లకి అసలు తమకంటూ ఓ స్టేటస్ లేకుండా పోతోందీ, అంతా హై టెక్ మహిళలకు గులాం సలాం అయి పోయింది " విసుగ్గా కనబడ్డ ప్రతి ఒక్క దాన్నీ తన్నేసు కుంటూ ఇంటి లోపలి వచ్చాడు మనవడు.

'ఏమిరా మనవడా, వస్తూ వస్తూ నే ఆండోల్ల మీద పడ్డావు ' గదమాయించాను మనవడి ని.

'ఇదిగో బామ్మా, మీ కాలం నించే ఇది మొదలయ్యింది ' అన్నాడు వాడు.

ఏమిట్రా అన్నా

'ఏమిటి అంటే ఏమిటి ? అసలు మేమంటూ అసలు ఉన్నామా ? మా కంటూ ఒక స్టేటస్ ఉందా ? ' అన్నాడు.

ఏమయ్యిందేమిటి ?

ఎల్కేజీ లో మిస్సు కస్సు బస్సు. ప్రైమరీ లో మేరీ టీచరు అథారిటీ. ఆ పై కాలేజీ లో లేడీ ప్రోఫెస్సర్స్ గదమాయింపు. పోనీ లే అని ఈ 'హాయ్ టేక్' ఐటీ ఉద్యోగం లోకి వస్తే ఇక్కడా ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లో వుమనేజ్ మెంట్' అన్నాడు వాడు.

ఫక్కున నవ్వు వచ్చింది. అదేంట్రా , ఉమనేజ్ మెంట్ అంటా వేమిటి ?

'అవునే బామ్మా, పెళ్లి అయ్యేంత వరకు ప్రాజెక్టు లో దేశాలెంబడి తిరిగి ఆ పై పెళ్లి అయ్యాక ప్రాజెక్ట్ లీడ్ అయ్యి ఇంటి కుంపటి ని తీరిగ్గా చూసు కుంటూ, క్వాలిటీ మేనేజ్ మేంటూ, మన్నూ మషానం అంటూ,   see, ఎంత బాగా, eye పెట్టి  CMMI V ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అని క్రెడిట్ కొట్టేస్తూ, చ చ చ అసలు మాకు రెస్పెక్ట్ అంటూ ఏదైనా ఉందా అంట ' అన్నాడు

వాళ్ళ అమ్మ వచ్చింది .

కోడలా, మనవడు వయసుకు వచ్చేడు. ఓ మంచి అమ్మాయి ని చూసి కట్ట బెట్టేయి ' అన్నా . 'ఆ వచ్చే అమ్మాయే, వీడి మానేజ్ మెంట్ చూసేసు కుంటుంది కూడాను'

'వాడు వింటేనా ? అసలు ఉద్యోగంకి పోయినప్పటి నించి వాడికి వైరాగ్యం వచ్చేసింది ' అంది కోడలు పిల్ల.

'ఇదే సరి ఐన సమయం చూసి ముడేట్టేయి '

'దేశం లో అమ్మవారి రాజ్యం ! ఇంట్లో  ఆండొల్ల రాజ్యం. చ చ చ ' అన్నాడు మనవడు.

చూడమ్మాయి, వాడు వద్దని చెప్పటం లేదు కదా ! ఓన్లీ కంప్లైంట్ అంతే !

మా అయ్యరు వారు హిందూ దిన పత్రిక నించి ఓ మారు తల బయట పెట్టి, మళ్ళీ పేపర్లోకి తల దూర్చేసేరు.
వారికి పేపరు కనబడితే చాలు, వేరే ఏదీ అక్కరలే మరి. మనమోహనుల వారి పాలిసీ. అన్నీ పాలిసీ మేటరు లోనే ఉండాలి అంతే.


రాజ్యం వీర భోజ్యం ! ఈ జమానాకి, 'రాజ్యమే' హైటెక్ మహిళా భోజ్యం !

చీర్స్
జిలేబి.

Sunday, April 1, 2012

ఇచ్చట మీ ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వ బడును !

'జై స్వామీ యోగి మహారాజ్ గారికి !

జై జై జై ! సభా ప్రాంగణం దద్దరిల్లింది.

స్వామీ యోగీ మహారాజా వారు వేంచేశారు. !తెల్లటి కాషాయ వస్త్రం. (కాషాయ వస్త్రం తెల్లగా ఉంటుందా ? అవును ఇది లేటెస్టు ఫేషను!) నుదిటి పైన నైస్ స్మేల్లింగ్ విభూతి పట్ట !  బవిరి గడ్డం. నిగ నిగ లాడే ఇటాలియన్ షూస్ కాలికి. చేతిలో కమండలం. కమండలం లో నీళ్ళు స్విట్జెర్లాండ్ నిండి ఫ్రెష్ గా దిగుమతి చెయ్య బడ్డది.

"ఇప్పుడు స్వామీ యోగీ మహారాజా వారు మీ ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెబుతారు. మీ ప్రశ్నల తో బాటు పదివేల ఒక్క డాలరు నోటులను స్వామీ వారీ పాదాల చెంత బెట్ట వలెను " బోస్ మైక్రో ఫోన్ నించి అనౌన్సే మెంట్ చేసాడు ఓ స్వామీజీ.

'మొదటి ప్రశ్న' లక్షా వెయ్యిన్నొక్క నూట పద హారు డాలర్ లతో మొదలవు తుంది స్వామీ యోగి మహారాజ్ వారి శిష్య స్వామీ వారని ఖండించి తానె కొత్త వరవడి చుట్టేరు !

'ఆహా ! స్వామి వారి జ్ఞాన దృష్టి ముందు మనది ఏపాటి అని ' ఆ కుర్ర శిష్య స్వామీ ఈ మారు అట్లాగే స్వామీ అని చెంపలేసుకుని, కొత్త అనౌన్సు మెంటు చెప్పాడు ప్రశ్న విలువకి !

'మొదటి ప్రశ్న, ఓ సూటూ బూటూ వేసుకున్న పెద్ద ఆసామీ నిండి వచ్చింది. శిష్య పరమాణువు వాడి వద్దకెళ్ళి మొదట లక్ష పై చిలుకు డాలరు డబ్బులు తీసుకొచ్చి స్వామీ వారి పాదాల చెంత బెట్టేరు. ! స్వామీ వారు గబుక్కున తన కాళ్ళని వెనక్కి లాగేసుకుని ' ఛీ ఛీ' మీరే ఆ పక్క పెట్టండి అన్నారు.

'ఆహా స్వామీ వారికి ఎంత వైరాగ్యం !' అని భక్త పరమాణువు మరో మారు జై జై జై అని ఘోషించింది. !

ఆ సూటూ బూటూ వాడు ప్రశ్న మొదలెట్టేడు..

'స్వామీ ! క్రితం సంవత్సరం నా వ్యాపారం నష్టాల్లోకి పోయింది. ఈ సంవత్సరం ఏమైనా గిట్టు బాటు అవుతుందా "

స్వామీ వారు విచారం గా చూసేరు తన భక్త సూటూ బూటూ బాబుని.

'ఇదిగో, సూటూ బూటూ, విచారించకు. ఆధ్యాత్మిక పరంగా నీకు ఉచ్చ స్థితి ఈ ఉగాది నందన సంవత్సరం లో జరుగు తుంది. కాబట్టి దాంతో బాటే నీ కు వ్యాపారాభి వృద్ధి కూడాను ' అని ఓదార్చేరు !

రెండో ప్రశ్న మూడు లక్షల డాలర్లకి స్వామీ యోగి మహారాజ్ వారు సంత బేరం పాడేరు

మరో సూటూ బూటూ ఆసామి లేచి ఇల్లు విడిచి పారిపోయిన కూతురి 'ఆధ్యాత్మిక' స్థితి గురించి విచారించాడు.

స్వామీ వారు గతుక్కు మన్నారు. ఆ అమ్మణ్ణి  మొన్నే తన ఆశ్రం లో కి , తన ఆశ్రయంలోకి వచ్చి ఉన్నదాయె !

బవిరి గడ్డం తడివి, మరో శిష్యుడి కి సైగ చేసి ఆ అమ్మణ్ణి ని తోలుకు రమ్మన్నారు !

'అమ్మణ్ణి వచ్చింది, మొత్తం తెలుపే తెలు పు ఐన నిగ నిగ లాడే చీరలో.

కూతురిని జూసి తండ్రి ఆనంద పడేడు ! ఎట్టకేలకు కూతురు దక్కింది అని. మూడు లక్షల పై మరో లక్ష కానుక గా చెల్లించు కున్నాడు !

ఇట్లా స్వామీ యోగీ మహారాజ్ వారు ఆధ్యాత్మిక ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం అలా భక్త పరమాణువులు ఆ హా ఒహో అని వంత పాడడం మొత్తం మీద అవ్వాల్టి సభ ముగిసింది.

'స్వామీ వారు రేపే స్విట్జేర్లాండు వెళుతున్నారు. కావున వారితో బాటు వెళ్లాలనుకునే వారు ఆశ్రమ ఆఫీసు ని సంప్రదించండి '  అని మరో కుర్ర సన్యాసి నోటేస్సు చెప్పేడు.

పోలో మని జన సందోహం ఆశ్రం ఆఫీసు మీద పడ్డది.

ఇంతటి తో కథ జెనీవా కి ! మనం యధా ప్రకారం మన గూటికి !!


చీర్స్

జిలేబి.
(స్విస్సులో ఓ స్వామీ వారిని కలిసిన శుభ సందర్భాన!)


Friday, March 30, 2012

ఇచ్చట 'బ్లాగు వైద్యం ' చెయ్య బడును


బ్లాగ్ శిఖా 'నాని' బ్లాగ్ జిలేబీ అమ్మ వారు తీరిగ్గా లాఫ్ టాప్ ముందు కూర్చుని తన 'రచనా విరహ తాపాన్ని ' చల్లార్చుకుంటూ ఆన్ లైన్ 'చేట' లో రాళ్లేరుకుంటూ, కామెంట్లలో గోళ్ళు గిల్లు కుంటూ కాలం వెళ్ళ బుచ్చు తోంది.

ఆ దారి వెంబడే వెళ్ళే ఓ అమరికను కన్సల్టంటు జిలేబీ బ్లాగ్ పైత్యాన్ని గమనించి,

'జిలేబమ్మా, జిలేబమ్మా' నీకు ఓ ఐడియా ఇస్తాను దాంతో నీ బ్లాగ్ లోక దురద తో బాటు పైసలూ రాలుతాయి' అన్నాడు.

డబ్బెవరకి చేదు అన్న చందాన జిలేబీ ఆశ పడింది.

'ఏమిటోయ్ ' అంది.

'చూడూ, ఆన్ లైన్ చేట లో రాళ్ళేరు కుంటూ వుంటావు గా, దాంతో బాటు, నీకు తెలిసిన బ్లాగ్ గురించి చేట లో రాళ్ళేస్తూ చెప్పు. ఐడియా కి ఓ డాలరు అను నీకు పైసలు రాల్తాయి'

'నిజంగా నే అంటా వా ?'

'అవ్ మల్ల' అమెరికన్ ఎక్సంట్ నించి ఈ మారు ఆ తెలుగోడు ఆదరబాదర ఎక్సంట్ కి వచ్చాడు !

సరే అని జిలేబీ ఆన్ లైన్ చేట లో 'బ్లాగ్ వైద్యులమ్మ జిలేబమ్మ ' మీ సర్వ రోగముల నివారణ కు ఇచ్చట ఉపాయం చెప్ప బడును ' అని బోర్డు బెట్టు కుని నాలుగు రాళ్ళూ వెనకేసుకుంది !

చదువరులారా ! మీకు ఏమైన్నా రోగము ఉందా ! ఆ రోగము తీరి పోవుటకు వెంటనే చక్కని బ్లాగ్ లింకు తెలుప బడును ఇచ్చట ! మీ రోగం హుష్ కాకి! వెంటనే ఓ డాలరు కామెంటు కొట్టుడు ! మీకు వైద్య సలహా ఇవ్వబడును !

ఇట్లు
బ్లాగ్ వైద్యులమ్మ
జిలేబమ్మ !
(దీనికి స్ఫూర్తి చెప్పాలంటారా! ఈ టపా వారికే అంకితం!)

Thursday, March 29, 2012

భామనే 'నిత్య' భామనే !

భామనే 'నిత్య' భామనే !

మన ముంబై మరదల్ని పలకరించి చాలా రోజులయ్యిందని శ్రీ శర్మ గారు  రాసినప్పటి నించి కొంత ఈ ముంబై మరదల్ని ఓ కన్నేసి చూద్దామని ఓ రెండు వారాలు గా టంచను గా ముంబై మరదలు వారి తెల్లారి సోకు మధ్యాహ్నం 'బాకు' గమకాన్ని, నాట్య విలాసాన్ని గమనించడం మొదలెట్టాను !

ఆ హా ఏమి ఆ నాట్యం !

నాట్య కళా మణులు ఈ ముంబై మరదలు నాట్య కళా నైపుణ్యం  చూసి నేర్చుకోవటానికి ఎన్నో పాయింట్లు ఉన్నాయి సుమా అని పించింది.

ఒకటి జనావళి కి ఓ కిక్కు ఇచ్చి, 'ఇండియా జూమింగ్' అన్న 'బ్రాందీ' భ్రాంతి ని కలిగించి 'శభాష్ ! భువి మండలం లో భారద్దేశమంత మహామహిమాన్విత దేశం మరెక్కడా లేదు సుమీ ' అని పించడం ! ( మధ్య లో నిఫ్టీ ఐదు వేల నాలుగు వందల చిలుకుకి వెళ్ళడం జరిగింది )

రెండు, సాయంత్రం వేళ 'మోహిని ఆట్టం' ! అంటే , జుమ్మంది నాదం , నిప్పు కుంపటి లో నీళ్ళు చల్లితే, 'సోయ్యన్నట్టు ' నీరసం గా ఊగి పోవటం !

మూడు మళ్ళీ పోద్దవగానే, ముంబై మరదలు రాత్రి ప్రియుని చిలిపి చేష్టల సిగ్గు  దొంతరలతో మళ్ళీ ముస్తాబు !

ఈ సరసమైన కేళీ విలాసం లో ముంబై మహానగరం లో ఉండడం అక్కడి జన సందోహాన్ని గమనించడం జరిగింది.

ఈ ముంబై నగర వాసుల వేగాన్ని వర్ణించడం అంత సులభమైన విషయం కాదు సుమీ అని కూడా అనిపించింది

అసలు ఈ నగరం నిద్ర పోతుందా ? లేదనే అనుకుంటాను.

మొత్తం మీద బృహన్ ముంబై మహా నగరం జయహో ! ముంబై మరదలు జయహో !

'భామనే నిత్య భామనే ' అన్న తీరులో ఉన్న వీరి అందం చందం భారద్దేశ జనావళి కి , భారద్దేశ ఎకానమీ దీపానికి ఓ నిత్య నూతన రమణీ నాట్య నటరాజ పాద సుమాంజలి !

చీర్స్
జిలేబి.

Tuesday, March 27, 2012

విడాకుల పర్వం లో పిడకల వేట !

పిడకలు అగ్గి పెట్టడానికి బాగా పనికి వస్తాయి.

అవీ, మా బాగా ఈ ఎండా కాలం లో ఎండిన పిడకలైతే, మరీ బాగు ! సర్రుమని రాజు కుంటాయి. కొంత నిప్పెడితే చాలు.

పూర్వ కాలం లో (హమ్మో అంత లోపలే పూర్వ కాలం అయిపోయే!) పిడకలతో అగ్గి బెట్టి, వంట కి , వేన్నీళ్ళు కాచుకోవడానికి చేసుకునేవారు (ట) !

మా బామ్మ కి పెళ్ళయ్యే నాటికి , పదేళ్ళు లోపు.

మా అమ్మగారి కాలానికి పదిహేను.

మా కాలానికి ముచ్చట గా, స్వీట్ సిక్స్టీన్ కాక పోయినా, గవర్నమెంటు వారి లెక్కల ప్రకారం పద్దెనిమిది దాటేక !

మా తరం తరువాయి 'ఇప్పత్తైదు' !

ఇప్పుడు థ్రిల్లింగ్ థర్టీ ప్లస్ !

ఇంకా కొంత ముందు కెడితే, మా బామ్మ , బామ్మ అయిన నాటికి, అమ్మాయి పెళ్లీడు కొచ్చును !

సో, ఈ మారుతున్న కాలం లో లేటు 'మ్యారేజీలు ' విడాకుల కి మూల కారణాలా ?

రెండు, మా బామ్మ చదివింది లేదు.

మా అమ్మ మూడో ఫారం .

మా తరం డిగ్రీ (కాఫీ!)

ఈ తరం హాయ్ టెక్ చదువులు !

రాబోయే తరం హాయ్ హాయ్ టెక్ చదువులు

పెరిగిన చదువులకి , విడాకుల సంఖ్యా జోరు కి 'అణు' బాంధవ్యం  ఏమిటే ?

మూడు,

మా బామ్మ 'ఫైనాన్సియల్' జీరో.

మా అమ్మగారి 'ఫైనాన్సు' అయ్య గారి బొక్కసం మేనేజ్ మెంటు మాత్రమె

మా కాలానికి, చేతుల్లో డబ్బులు ! (జాకెట్లలో పర్సులు అని చెప్పాలి కామోసు !)

ఈ కాలానికి, వానిటీ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు 'హాయ్ టేక్' ఉద్యోగాలు !

రాబోయే కాలానికి మరీ జూమింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడం !


సో, ఈ మారుతున్న కాలం లో 'లేటు మ్యారేజీలు ' విడాకుల కి మూల కారణాలా ?

పెరిగిన చదువులకి , విడాకుల సంఖ్యా జోరు కి 'అణు' బాంధవ్యం  ఏమిటే ?

పెరిగిన సో కాల్డ్, 'ఫ్రీడం' కి , విడాకుల సంఖ్యా జోరు కి 'అనుమాన' బాంధవ్యం  ఏమిటే ?


మూడు ప్రశ్నలతో పిడకల వేట మొదలు !


జిలేబి.

Monday, March 26, 2012

అమ్మాయి పెళ్లి

ప్రియమైన చెల్లెలు వరూధిని కి -

అక్కయ్య ఆశీర్వదించి వ్రాయునది. ఉభయ కుశలోపరి. 

అమ్మాయి  సౌమ్య పెళ్లి విషయమై మై బామ్మ కాబినెట్ మీటింగ్ ఇవ్వాళ పెట్టింది.

మన ఇంటి పెద్ద మంత్రులు ఐన అన్నయ్యలు హాజారైనారు మీటింగుకి. 

మీ  బావగారు జంబూ వారు నిమిత్త మాత్రులు కాబట్టి బామ్మే మీటింగుని ఖరారు చేసి ఉచిత పీఠాన్ని అలంకరించింది.

మూడోతరం మంత్రులు అంటే చిన్న చితకా కుర్రకారు అందరు క్వాలిటి కంట్రోల్ ప్రోగ్రాం కోసం దేశాల మీద ఉన్నారు కాబట్టి (నిన్నూ చేర్చి) వాళ్ళంతా గైరు హాజారు మీటింగుకి.

దరిమిలా బామ్మ నీ పెళ్లి ఖాతా వెతికి దాని ప్రకారం అమ్మాయి సౌమ్య పెళ్లికి బడ్జెట్ తయారుచేసింది. ఆ లెక్కల  ప్రకారం పెళ్లి ఖర్చులు వెరసి పది రెట్లు ఎక్కువై పోయినాయి.

బడ్జెట్ బ్రతుకులు కాబట్టి బామ్మ బుగ్గలు  నొక్కేసుకుని బావ గారి వైపు చూసింది -

మీ బావగారు ఎలాంటి ఫీలింగు లేకుండా నా వైపు చూడడం నేను ఏమి చెయ్యాలో పాలుపోకుండా మన ఇంటి పెద్ద మంత్రులు వైపు చూడడం వాళ్లు ఏమి చెయ్యాలో తెలియకుండా బామ్మ వైపు చూడడం,

బామ్మ తీక్షణ ద్రిష్టి తో మమ్మల్ని వీక్షించి "ఒరేయి బడుద్దాయిలు - మీరేమి చేస్తారో నా కవసరం. ఎట్లా చేస్తారో నాకనవసరం. అమ్మాయి పెళ్లి మూడు నెలల్లో ఖరారు అయిపోవాలి " అని అల్టిమేటం జారి చేసింది.


ఈ తంతు తో ఇవ్వాల్టి కాబినెట్ మీటింగ్కి బామ్మ వీడుకోలు చెప్పి అందర్నీ పని మీదికి అంటే అమ్మాయి సౌమ్య పెళ్లి పని మీద  పురమాయ్యించడం తో నా మనసు కొంత కుదుట పడింది.

ఈ మీటింగు తరువాయి మీ బావగారు యథా ప్రకారం దిన పత్రిక పడక కుర్చీలో కూర్చుని తిరగేయ్యటం మొదలెట్టేరు !

ఏమి చేతును నా చిట్టి చెల్లీ?

ఇదీ కథ!


బావగారికి నా నమస్సులు. !


ఇట్లు
నీ పెద్ద అక్కయ్య
జిలేబీ.

Sunday, March 25, 2012

నాడు-నేడు ఫ్యామలీ జస్టిస్ !

నాడు

ఏనాటిదో మన బంధం
ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా
ఇది ఇగిరిపోని గంధం

నేడు

ఏనాటి దో మన బాండూ
ఎరుక వచ్చేను అణు బాంబూ !
ఈ యుగములోనే
ఇంకి పోయేను బంధం !

***

ఫ్యామలీ కోర్టు లో జస్టిస్ !

'ఇదిగో రాంబాబు , గీత పై చెయ్యేసి చెప్పు, అంతా సత్యమే చెబుతానని '

'అయ్యా జడ్జీ వారు, నా పెండ్లాము గీత పై ఒక్క సారి చెయ్యేసి నందుకే ఇప్పుడు ఈ బోనులో నిలబడ్డా. మళ్ళీ మరో మారు వెయ్య మంటారా !చస్తే కుదర దండి !'

***

ఆంధ్ర లోకం లో కలకలమైన కేసు !

నాలుగో మొగుడితో మూడో పెళ్ళాం తలాక్ !

***

రూపాయ్ మొగుడు డాలరు పెళ్ళాం
సంచలనాత్మక చిత్రం
నేడే చూడండి
మీ అభిమాన ధియేటర్ లో
డైవోర్స్ సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ స్పెషల్ !


చీర్స్
జిలేబి. 

Saturday, March 24, 2012

'వి' డాకినీ మారాజు పర్వం !

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జమ్బునాధన్ కృష్ణ స్వామీ అయ్యరు వారికి చిరాకు పుట్టు కొచ్చింది.

చ, చ, ఈ మధ్య ప్రతి రోజూ కేసులలో ఒకటి 'విడాకినీ' విడాకుల కేసు చూడాల్సి వస్తోంది.  వీళ్ళ పిండా కూడు దేశం ముందుకు పోతోందా లేక వెనక్కి పోతోందా తెలియక పోయే వారికి !

ఇంటికి విసురుగా వచ్చి, జిలేబీ అని కేక బెట్టి ఉసూరు మని సోఫా లో కుదేలు మన్నారు జంబూ వారు.

'ఏమిటండీ' అంటూ వినయంగా మంచి నీళ్ళ గలాసు వారికి అందించింది జిలేబీ, వీరు ఇంత విసురుగా వచ్చే రంటే ఏదో విపరీత్యం వచ్చినట్టే సుమీ అని అనుకుంటూ. 

మంచి నీళ్ళని కోకో కోలా లా చప్పరిస్తూ, నిట్టూర్చి 'జిలేబీ, మనం పెళ్లి అయి ఎన్ని రోజుల, ఎన్ని సంవత్సరాల బట్టి ఆలూ మగలం గా ఉన్నాం' అన్నారు అయ్యరు వారు.

జిలేబీ కి తన పెళ్లి రోజులు గుర్తుకొచ్చి వెంటనే సిగ్గు వచ్చేసింది.

'చ చ, ఈ ఆడాళ్ళకి పెళ్లి మాట ఎత్తితేనే మరీ సిగ్గు వచ్చేస్తోంది. నేనడుగు తున్నది సూటి ప్రశ్న మాత్రమె కదా ' చెప్పారు జంబూ వారు.

'మన పెళ్లి అయిన సంవత్సరం లో నె కదండీ  , చాచా వారు బాల్చీ తన్నేసింది ?'

'మరి ఇన్నేళ్ళ బట్టి మనం కలిసే ఉన్నామా?'

'కాదుటండీ మరి? వద్దని వెళ్లి నేనెక్కడి కి పోయే దండీ ?'

'మరి ఈ కాలం కుర్ర కుంకలు అలా పెళ్లి అయిందో లేదో, ఇలా కోర్టు లో కోచ్చేస్తారు , విడాకులు కావాలని'

'మరి ఇవ్వక పోయారు ?'

విడాకులంటే అదేమన్నా విస్తరాకులా ?'

'మరి?'

మొద్దు మొహమా, డైవోర్స్ '

'ఓహ్, డై వార్నీషా, , పోదురు లెండి, లేటు మేరేజీ ఏమో, డై ' వేసుకోవాలను కుంటున్నారేమో, వేసుకోమని ఆర్డరు వెయ్య కూడదు?'

'జిలేబీ నువ్వు ఐదో క్లాసు ప్యాసు అయ్యవన్న మాట తోనే మా బామ్మ ఆ కాలం లో నిన్ను కట్ట బెట్టింది నాకు. నీకు తెలుగూ రాదు, అంగ్రేజీ రాదు' విసుక్కున్నారు జంబూ వారు. ' మొద్దు, వాళ్ళిద్దరూ, వేరే కుంపటి పెట్టుకోవాలని ఉబలాట పడుతున్నారోయ్'

'ఓహ్, 'విడాకినీ' పర్వమా ?'

'అవ్'

'పోదురు లెండి, కుర్ర కుంకలు ముచ్చట పడుతున్నారు గదా, వేరే కుంపటి కి , చెరో కొత్త కుంపటి కొనుక్కొమ్మని చెప్పండి '

ఈ మారు జంబూ వారు విశదీకరించారు పూర్తి గా, విడాకుల గురించి.

జంబూ వారు చెప్పింది విని జిలేబీ ఆలోచన లో పడింది.

'అయ్యరు వారు నేనో ఉచిత సలహా ఇస్తాను వింటారా?' జిలేబీ అన్నది.

'ఏమిటోయ్'

మన మన మొహనుల వారి తో చెప్పి కొత్త చట్టం తెప్పించండి '

'ఏమనోయ్'

'పెళ్లి కి ముందే విడాకులు తీసుకుని వారు విడిగా వేరు కుంపటి తో కొన్ని సంవత్సరాలు ఉండాలని. ఆ తర్వాత కూడా, ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలని పిస్తే, మ్యారాజు చేసుకోవచ్చు అని'

'జిలేబీ మరి ఆల్రెడి పెళ్లి అయిన వాళ్ళ మాటేమిటీ?'

అదేంటో, మీ భాష లో 'సబ్బాటికల్' లీవు అంటారు గదా ? అట్లా, 'సబ్బాటికల్' వేరు కుంపటి ....!!"


చీర్స్
జిలేబి.

Friday, March 23, 2012

నందనోత్సాహం !

నందనోత్సాహం !

అందరికీ

శ్రీ నందన నామ సంవత్సర

ఉగాది శుభాకాంక్షలు !

సంవత్సరోవా అపామాయతనం ఆయతనవాన్ భవతి
యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి
ఆపోవై  సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి
య ఏవం వేద యో ఆప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి 

జిలేబి  

Thursday, March 22, 2012

నీ కడుపు చల్లగా పసి పాపను కని పెంచ వమ్మా !

నీ కడుపు చల్లగా పసి పాపను కని పెంచ వమ్మా !
సర్వభూతాలను ఇముడ్చుకుని
సర్వ వనరులను తనలోనే పెంపొందించి
గిరి పర్వతాలకు ఆలవాలమై వెలుగొందే భూమాత లా
సర్వ జంతు జాలాలకు జగన్మాత వై న పుడమి తల్లి లా
నీ కడుపు చల్లగా -
పసి పాపను కని, పెంచ వమ్మా !


శుభ కామనలతో

జిలేబి
(ఆధారం - అధర్వ వేదం - ఆరవ కాండం , పదిహేడవ సూక్తం - భావానువాదం - టూకీ గా - ఈ సూక్తం - గర్భిణి స్త్రీ కి ఆశీర్వచన సూక్తం )

అధర్వ వేదం - ఆరవ కాండం - 17 వ సూక్తం

యథేయం పృథ్వీ మహీ భూతానాం గర్భ మాద్ధే
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం  సవితరే

యధేయం పృథ్వీ మహీ దా ధార ఇమాన్ వనస్పతీన్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం  సవితరే

యధేయం పృథ్వీ మహీ దా ధార పర్వతాన్ గిరీన్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే

యధేయం పృథ్వీ మహీ దా ధార విష్టితం జగత్
ఏవా తే ద్రియతాం గర్భో అను సూతుం సవితరే