ఏమండీ నే పోతా అన్నా.
అసలు మడత కుర్చీ లో కూర్చున్న పెద్ద మహారాజు తలెత్తి చూస్తేనా ? అదేమీ హిందూ పేపరో మరి ? దాంట్లో వేరే ఏమి మజా యో తెలియదు కాని పెండ్లాము కన్నా అది గొప్ప మజా ఇచ్చు అయ్యవారికి.
మళ్ళీ గట్టి గా అన్నా ... నే పోతా అని.
ఈ మారు తలెత్తి చూసేరు అయ్యరు గారు.
హమ్మయ్య దిన పత్రిక నించి ముందర ఉన్న పత్ని వైపు చూసేరు అదే పది వేలు కదా అనుకుని 'ఇదిగో ఇట్లా పెండ్లాము చెప్పింది ఏమీ వినకుంటే ఎట్లా ?' అన్నా ఉపోద్ఘాతం గా.
'ఏమిటోయ్ నీ బాధ ? అన్నట్టు చూసేరు అయ్యరు వాళ్ .
అబ్బో, ఏమి వీరి టెక్కు ? అసలు పెండ్లి ఎందుకు చేసుకుంటారో ఈ మగ మహాపుంగవులు మరి !
పక్కనున్న పెండ్లాము కన్నా అట్లా పేపరో, కాకుంటే లాపు టాపో పెట్టేసుకుని, ఆ హా దేశం లో మేమొక్కరమే చేతి నిండా పని పడిన వారమని చెప్పు కోటానికి కాకుంటేను మరి ?
అదే మాట చెప్పా.
ఏమోయ్, నీ వ్యాపకం నీకు ఎట్లాను ఉంది . నా దగ్గర కొంత సేపు హస్కు కొట్టి తెల్లారి గట్లా అట్లా ఆ బ్లాగుల్లో 'బరహ బరహ' అంటూ ఏదో గీకుతావు వాటికి వచ్చిన కామెంటు మెతుకుల్ని చూసి వావ్ అని మురిసిపోతావు ఆపై నా మీద చెణుకులు కూడానూ ...
అసలు ఇంట్లో ఒక మగ మారాజు ఉన్నాడన్న విషయం నీ ' కేటలాగు' లో ఎట్లాగూ లేదాయే ! మరి నన్ను నా మానాన వదిలేసి నువ్వట్లా బ్లాగు లాడు తొంటే నాకూ ఏమీ తోచక ఇదిగో ఇట్లా పేపరు పెట్టు కుంటాను ... నే పేపరు చేత పట్టినప్పుడే నీకు నాతొ మాట్లాడా లని పిస్తుంది మరి ! ఏం , నేను తీరిగ్గా ఉన్నప్పుడు, నువ్వు ఆ బ్లాగో 'టం' టం' మూత బెట్టి నాతో మాట్లాడ వచ్చుగా ? అని ఇంత ఎత్తుకు ఎగిరేరు.
వామ్మో, సుడి గాలి మన వైపు తిరుగుతోందే , దీన్ని వెంట నే అరి కట్టాలి అనుకొని ... ' ఆ, ఈ లాపుటాపు, ఈ బ్లాగు లగురించి చెప్పినదెవరు ? మీ మనవడే గా ... వాడిదే తప్పంతా ' చెప్పా.. నా తప్పు ఇందులో ఏమీ లేదు సుమీ అన్నట్టు చూసా .
అంటే ? వాడేదో చెప్పె. అందుకని అట్లా పొద్దస్తమానం బ్లాగు లోకం లో తలమునకలై అసలు భరించు వాడు భర్త అన్న మానవుడు అసలు ఉన్నాడన్న తలంపు కూడా లేకుండా ఉంటే ఎట్లా మరి ?
అదేం ? మేము బ్లాగు లు రాయ కూడదా ? మా గురించి ఆంధ్ర జ్యోతి లో కూడా బాలా బాలా గు అని చెప్పేరు సుమీ ' చెప్పా.
చెప్పారనుకో, కాదంటా నా ? అందుకని నేను పేపరు చదివే టప్పుడే నీకు నాతొ మాట్లాడాలని అనిపిస్తే ఎట్లా చెప్పు మరి ' అన్నారు ఈ మారు కొంత శాంతం గా.
హమ్మయ్య, మన దారికి మానవుడు వచ్చేసేడు అనుకుని, అట్లా కాదండీ ఆ పేపరు చదివి ఏమి సాధిస్తారని ? కూసింత ఇంటి పని , వంట పని చూడాకూడదూ ... మురిపెం గా అడిగా .
'చస్తే కుదరదు మరి ! ఆ పనంతా నా నెత్తి కి నెట్టి మళ్ళీ ఆ బ్లాగు లోకం లోనే సెటిల్ అయి పోదామనే ! ఆశ దోస, అప్పడం వడ ' మళ్ళీ పేపర్లో తల దూర్చేరు అయ్యరు గారు.
హబ్బా, ఈ 'మొగోండ్లు ' ఇట్లా పెండ్లాముల మాటలు వినకుండా ఇట్లా చెడి పొతే గెట్లా అని నిట్టూర్చి సరే ఎట్లాగూ ఇవ్వాళ పని ఏమీ లేదు కాబట్టి కూసింత బ్లాగు లాడు తామని .....
శుభోదయం !
చీర్స్
జిలేబి !