Friday, January 11, 2013

అమెరికా బుజ్జి పండు - ఆంధ్రా బుడుగు

అమెరికా బుజ్జి పండు, అక్కయ్య అమ్మా నాన్నలతో గుడికెళ్ళి పులిహోర కానిచ్చాక ఎందుకో అట్లా తల తిప్పి చూసాడు.

అంతా కొత్తగా కనిపించింది గుడి.

అబ్బా తెల్లారి వచ్చినప్పుడు వేరేలా గుడి ఉండిందే? ఇప్పుడు వేరేలా ఉందేమి చెప్మా అని చెంపకు చెయ్యి ఆనించి చూసాడు.

తెల్లారి పైజమా లాల్చీ తో కదా, ఇప్పుడేమో, అర నిజారు పొట్టి చేతుల చొక్కాతో ఉన్నానేమిటి అని ఆశ్చర్య పోయాడు తన్ను తాను చూసుకుని.

ఏమయ్యిందో ఆతనికి అస్సలు అర్థం కాలేదు.

అమ్మా నాన్నలు తన ప్రక్కనే గదా ఉండాలి అని కలయ తిరిగి చూస్తే, అసలు వాళ్ళిద్దరూ కనిపించలే.

కొద్ది దూరం లో అక్కయ్య లా ఓ అమ్మాయి కనిపించింది. అచ్చు అక్క పోలికలో నే ఉంది. అయినా ఎందుకో సందేహం వచ్చింది అమ్మాయి తన అక్కయ్య కాదేమో అని. తెల్లారి పట్టు పరికిణీ లో ఉండింది
మరి ఇప్పుడేమో అదేదో గొట్టం ప్యాంటూ, పై తన లాల్చీ లా ఉన్న చొక్కాయి, ఆ పై ఓ దుపట్టా - అబ్బా, ఇట్లా అప్పుడప్పుడు అమ్మే కదా వేసుకునేది, ఇట్లా అక్క ఎందుకు వేసుకుని ఉంది అని

'అక్కా అని పిలిచాడు.

ఆ అమ్మాయి తిరిగి చూళ్ళేదు.

మరో మారు అక్కా అన్నాడు.

ఊహూ , జవాబు లేదు

వేరే ఎవరైనా ఏమో అనుకుని మళ్ళీ గుడి వైపు చూసాడు.

గుడి మరీ పాత కాలం గుడి లా ఉంది.

అబ్బే, తెల్లారి గుడి అంత శుభ్రం గా, మంచి కళ తో, కొత్తగా వెల్ల వేయబడి ఉండిందే మరి ? ఇప్పుడేమి ఇట్లా వెల వెల బోతోందీ  అని అనుకున్నాడు.

అసలే అమ్మా నాన్నలేక్కడా కనిపించడం లేదాయే. మరి అక్కయ్య లా ఉన్న అమ్మాయి కూడా అసలు తన వైపు చూడ్డం లేదు. తను పలకరిస్తే అసలు జవాబు ఇవ్వడం లేదు.

బుజ్జి పండు కి మొట్ట మొదటి సారి భయం వేసింది.

గుళ్ళో ఉన్న దేముడి వైపు చూసేడు. తెల్లారి కనిపించిన దేవుడిలా నే ఉన్నాడు (అమ్మ చెప్పింది గా ఉన్నాడు అని చెప్పొచ్చని , నా ఈడు వాడే అని ) ఈ మారు ధైర్యం గా అనుకున్నాడు, మరి ఈ దేవుడు ఇక్కడ ఇలా గోచీ తో ఉన్నాడే మిటి మరి? తెల్లారి ఎంత మా గొప్పగా అలంకారం తో ఉన్నాడే మరి ఇప్పుడెందుకు ఇలా పప్పీ షేం లా ఉన్నాడు చెప్మా అని మళ్ళీ చెంపకు చేయ్యేసు కున్నాడు.

బుజ్జి పండు గుళ్ళో నించి కాలు బయటకు పెట్టాడు.

తారు రోడ్డు కనిపించడం లేదు. చుట్టూతా మట్టి దారి. కొంత దూరం లో పచ్చిక బయలు. ఆ పై దూరం గా విసిరేసి నట్టున్న గుడారాల్లా  ఉన్నాయి. ఏమిటబ్బా అవి అనుకుని ఆ వైపు వెళ్ళాడు బుజ్జి పండు.

గుళ్ళో ని దేవుడు ముసి ముసి నవ్వు చిందించాడు.

నిశ్శబ్దం గా ఆ అబ్బాయి వెంబడే మరో చిన్న పిల్లవాడిలా మారి బయటకు కాలు పెట్టేడు దేముడు కూడా.



(సశేషం)

జిలేబి.

Wednesday, January 9, 2013

జాజి మల్లి సౌరభాలు వీస్తున్నాయి ! మరి తేనెటీగలు ఎక్కడో?

జాజి మల్లి సౌరభాలు వీస్తున్నాయి !
 
మరి తేనెటీగలు ఎక్కడో?
 
ఆ పూదోటలో జాజిమల్లుల
సౌరభాలు మకరందాలు గుభాళిస్తున్నాయి.
 
మరి తేనెటీగలు ఎక్కడ ?
 
ఏమి చేస్తున్నాయో పాపం!
 
An active bee alone creates Honey
అని ఓ జిలేబీ సామెత.
 
బ్లాగ్ లోకపు ఆక్టివ్ బీస్ ఎక్కడో మరి?
 
బ్లాగ్ లోకాయ సుప్రజా రామా, సంధ్యా పూర్వా ప్రవర్తయే !
ఉత్తిష్ఠ 'బ్లాగ్'శార్దూలా కర్తవ్యమ్ 'ఏక' మాహ్నికమ్!
 
 
చీర్స్ 
జిలేబి.

Tuesday, January 8, 2013

మౌస్ కిచ్చే పాటి మర్యాద స్పౌస్ కి లేదా ?

బ్యాక్ ప్యాక్ బకరా బాబు ఉస్సూరు మని కూలబడ్డాడు ఇంటికి వస్తూ రాకనే.
 
వాడి పెండ్లాము బక్రీ బేబీ ఇంకా 'ఓఫీసు' నిండి ఇంటికి రాలే.
 
ఏమిరా ఈ లైఫు అని ఆలోచిద్దా మనుకుని ,
అబ్బే ఇట్లాంటి సెంటిమెంటు ఫిలోసోఫీ లో కి వెళ్తే
మరీ 'బేజారే' సుమీ అని సోఫాలో పడి గురక పెట్టి నిద్దుర పోయేడు.
 
అపరాత్రి తలుపు కిర్రుమంది.
 
బక్రీ బేబీ మరో కీ తో తలుపు తెరుచుకుని ఇంట్లో కి వచ్చింది.
 
బకరా బాబు సోఫాలో అడ్డంగా పడి నిదురోతున్నాడు.
 
చేతిలో లాపు టాపూ అట్లాగే 'ఆన్' లో ఉంది.మరో చేతిలో మౌసు !
 
చ, స్పౌసు కౌగిట్లో నిద్దుర పోవాల్సిన మానవుడు ఇట్లా మౌసు కౌగిట్లో నిద్దుర పోతున్నాడే
అని ఆలోచిద్దా మనుకుని ,
అబ్బే, ఇట్లాంటి సెంటిమెంటు ఫిలోసోఫీ కి వెళ్తే మరీ బెజారే సుమీ
అని మరో సోఫాలో పడి బక్రీ బేబీ కూడా నిదుర పోయింది.
 
కథ స్వప్న లోకానికి, మనం మళ్ళీ మరో రోజుకి !
 
శుభోదయం.
 
జిలేబి 
(బక్రీ  Musings)
(My wife dresses to kill. She cooks the same way!).

Sunday, January 6, 2013

అయ్యరు గారితో మిథునం!

ఏమండీ అయ్యరు వాళ్ , మిథునం అని మాంచి చిత్రం వెళ్దామా? అన్నా మా జంబునాధన్ కృష్ణ స్వామి అయ్యరు గారితో.

ఇంతకు ముందే చూసేసా నోయ్ మలయాళం పిక్చరే గా ? మోహన్ లాల్ మా బాగా ఏక్ట్ చేసాడు.

'ఆడ మలయాళం కాదు స్వామీ, ఇది ఈడ తెలుగు మిథునం ' చెప్పా 'అబ్బా ఈ అరవం వోళ్ళ కి అరవం, మలయాళం తప్పించి వేరే ఏదీ పట్టదు సుమీ' అనుకుంటూ.

తెలుగు మితునమా ?

మితునం కాదు స్వామీ, మిథునం చికాకుగా అన్నా, ఈ అరవం మరీను, త,థ ,ద ధ  అన్నీ ఒక్కటే ఆయే మరి. మధ్య లో గుండు సున్నా కూడా ఉంది, చెప్పా.

అచ్చ తెనుగు చిత్రం కొంత గొప్పగా చెప్పా. 'తనికెళ్ళ భరణి అని మా గొప్ప మడిసి అచ్చ తెనుగు లో తీసేడు'

తెలుగు 'పురియాదె' ఎట్లా మరి ? అన్నారు

అబ్బా ఇంకేట్లా వీరిని లాక్కె ళ్ళేది మరి ?

'అమ్మా నాన్నల ప్రేమ కథ అయ్యరు వాళ్ ' ఈ మారు కొంత ఆశ పెట్టా.

అమ్మా నాన్నల ప్రేమకథ మనమెందుకు చూడడ మే ? మన కథే ఇట్లా తెలవారి పోతోంది కదా మరి ? మళ్ళీ ఓ రిటార్టు.

అబ్బా, ఎట్లా వీరిని లాక్కెళ్ళడం?

'బాలూ లేడు ? అదే నండీ శ్రీ పండితారాధ్యుల వారి గారబ్బాయి , మా బ్రహ్మాండం గా నటించాడంట ' ఈ మారు దీనికైనా బోల్తా పడతాడేమో అని చూసా.

'బాలూనా  మా బాగా పాడతాడు, ఇప్పుడు నటించడం కూడా మొదలెట్టేడు?'

అబ్బా, ఈ పాత కాలం వారికి మతిమరుపు చాలా ఎక్కువే మరీ ను.

'బాలూ ఎప్పుడో చిన్నప్పటి నించి అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నాడు కదండీ , ఆ మధ్య ఒక అరవం సినిమాలో గుక్క తిప్పు కోకుండా పాడాడు కదా మరి ?'

అవును కదా ? మర్చి పోయా. చెప్పేరు అయ్యరు గారు.

అయితే వెళ్దామా?

వద్దు లేవే ! అచ్చ తెనుగు అంటావ్, అర్థమయి చావదె మరి'

ఈ మారు ఫైనల్ బాణం వేసా.

లక్ష్మి కూడా ఉందండీ '

ఎవరూ, లక్ష్మే ? రుక్మిణి అమ్మాయే? యారగుడిపాటి వారే కదా,నుంగంబాక్కం జానకి మనవరాలే కదా?'

అబ్బా, ఈ పాతకాలపు జ్ఞాపకాలు మాత్రం ఎట్లా గుర్తుంటాయో వీరికి మరి?

వెళ్దామా అయితే?

అబ్బా, ఇంకా ఎవరెవరొయ్ ఎక్టర్లు?

మండి పోయి, 'వాళ్లిద్దరే! ఇంకా ఎంత మంది కావాలేంటి ?' అన్నా కస్సు మని బస్సు మని.

ఇద్దరే నా ? హాశ్చర్య పోయారు అయ్యరు గారు.

అవును.

ఇద్దరేనా మళ్ళీ నోరు వెళ్ళ బెట్టేరు.

అవును.

అయితే చూడాల్సిందే మరి ! ఇద్దర్ని పెట్టి ఎట్లా చిత్రం తీసారబ్బా?

అన్నిటికీ ఎట్లా ఎట్లా అంటే ఎలా మరి? చూసి వస్తే కాని తెలీదు కదా మరి ? చెప్పా.

'కారులో షికారు కెళ్ళి ఆ పై వెళ్దామోయ్

అబ్బా, ఒక్క చిత్రం చూడ్డానికి ఎన్ని అవస్తలో మరి.

ఈ అయ్యరు లేజీ బీ తో ఈ జిలేబీ మిథునం అన్నీ మా బామ్మ తెచ్చిన ఒక్క ఫోటో వల్లే కదా మరి, అని మురిసి పోయా. ఎంతైనా మా అయ్యరు గారే కదా మరి.


చీర్స్
జిలేబి.
'sevenhills musings'

Friday, January 4, 2013

శభాష్ ఆంధ్రజ్యోతీ!

తెలుగు ప్రపంచ మహా సభల పుణ్యమా అని
మా ఆంధ్రజ్యోతి వారు మొట్ట మొదటి మారు
నవ్య ని ఆంధ్ర పత్రిక లా తీర్చిదిద్దారు. !
శభాష్ ఆంధ్రజ్యోతీ!
జిలేబి
 
Source:
http://www.navyaweekly.com/



బావిలో చెందురూడు

 
వెన్నెల పిచ్చ కాసింది..
 
హాలికుడు బావి దగ్గరికి వెళ్ళేడు  నీళ్ళ కోసం.
 
బావి లో చెందురూడు కనబడ్దేడు .
 
అయ్యో చెందురూడు బావిలో పడ్డేడే !
 
చేంతాడు కొక్కీ తెచ్చి చెందురూణ్ణి లాగాడు 
 
చేంతాడు కొక్కీ బావిలో రాయి కి తగులుకుంది 
 
ఎంత లాగినా చెందురూడు రాలే.
 
గట్టిగా పట్టి లాగాడు హాలికుడు.
 
చేంతాడు పుటుక్కుమని తెగి ఊరుకుంది 
 
హాలికుడు వెల్లకిలా పడ్డాడు దబ్బున 
 
కొంత సేపటికి తేరుకుని చూస్తే ఆకసం లో చెందురూడు !
 
అబ్బా నేను పడ్డా ఫర్లేదు గాని,చెందురూణ్ణి  రక్షించా
 
హాలికుడు సంతోష పడ్డాడు!
 
 
 
జిలేబి.

Thursday, January 3, 2013

జిలేబీ డైరెక్ట్ టు హోమ్ !

జిలేబీ డైరెక్ట్ టు హోమ్ !

చాలా డబ్బులు ఖర్చు పెట్టి (ఆంగ్లంలో Time is Money అన్నారు మరి!) అంటే వంద కోట్ల మిల్లీ సెకన్ల పై పెట్టు బడి పెట్టి టపాలు రాస్తున్నా,

అమ్మలారా, అయ్యలరా, మీరు వెంటనే జిలేబీ టపాలను మీ మీ గృహ వాటికలో డైరెక్ట్ టు హోమ్  ద్వారా టపాలు వేగిరమే చదివి చదివినడానికి ఓ పాతికో పరకో అమెరికన్ డాలర్లు కొట్టండి జిలేబీ టపా లకి.

లేకుంటే నేను దిక్కు దివాణం లేకుండా పోయే దానికి, ఆస్కార్లు లేకుండా కూడా పోయే దానికి సూచనలు కని పిస్తున్నాయి.

కావున అమ్మలారా, చెల్లెల్లారా, అయ్యలారా, తమ్ముల్లారా , నా మీద దయ పెట్టి డైరెక్ట్ టు హోమ్ కి పైసలు పడెయ్యండి!


చీర్స్
జిలేబి.

Tuesday, January 1, 2013

రెండు + సున్నా + ఒకటి = మూడు = 2013 శుభోదయం !

రెండు + సున్నా + ఒకటి  = మూడు = 2013 శుభోదయం !

 
రెండు + సున్నా + ఒకటి = మూడు
అన్నంత సాఫీ గా 
అందరికీ 2013
మరింత శుభములు
కలుగ జేయాలని ఆశిస్తూ
 
అందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలతో
శుభోదయం 
 
 
చీర్స్ 
జిలేబి 

Sunday, December 30, 2012

కాలం తీరిపోయిన పుష్పం

ఓ పుష్పాన్ని
 
తుమ్మెదలు కామించేయి. రమించేయి.
 
వడలి సడలి పోయిన పుష్పం
 
కొమ్మన ఊగిస లాడింది కొస ప్రాణం తో .
 
మాలి పుష్పాన్ని కోసి
 
 సింగారి సిగలో పెట్టేడు
 
పుష్పమా పుష్పమా నీవు సింగారి వయ్యేవే అని.
 
సిగలో కెక్కిన పుష్పం 
 
ఉక్కిరి బిక్కిరి అయి నేల రాలింది.
 
కొమ్మనించి రాలితే మాలి హేతువు.
 
సింగారి సిగ నించి రాలితే 
 
ప్చ్.. కాలం తీరిపోయిన పుష్పం.
 
జిలేబి.

Friday, December 28, 2012

4వ ప్రపంచ జిలేబీ ఆవృత్త సభల స్వీట్ ఆహ్వానం!

అందరికీ 4వ ప్రపంచ జిలేబీ  ఆవృత్త సభల
 
స్వీట్ ఆహ్వానం ! హాటాహాకారం !
 
ఓ పాప ముప్పై ఏడేళ్ళ ముందు పుట్టింది.
 
ఆవిడకి జిలేబీ అని పేరు పెట్టేరు.
 
ఆ అమ్మాయి పరువానికి వచ్చింది.
 
పదహారు పరువం లో  ఓ ద్వీపం లో దారి తెలీకుండా
 
దిక్కు తెలీకుండా పోయింది.
 
చాన్నాళ్ళు అసలు పరువంపు జిలేబీ ఉందా అన్న సందేహం వచ్చేసింది.
 
ఇప్పుడు ముప్పై ఏడేళ్ళ ముత్తైదువై మళ్ళీ
 
ఇరవై పై బడ్డ సంవత్సరాల తరువాయి 
 
ఆంధ్ర దేశాన్ని వెదుక్కుంటూ వచ్చింది.
 
అమ్మాయి పరువం దాటి పోయింది.
 
ముదురాకు అయిపోయిందేమో అనిపిస్తోంది.
 
మాతృ భాష మరిచి పోయిందేమో అని పించేలా కనిపిస్తోంది.
 
పరువం లో ఉన్న ఆ అమ్మాయి స్నేహితురాండ్రు 
 
'మణీ ' ద్వీపానికి వెళ్లి పోయేరు.
 
స్నేహితురాండ్రు ల పరువాల జిలేబీ జ్ఞాపకాలు  మదిలో నిక్షిప్తం.
 
ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కలిసేరు.
 
జిలేబీ తిరిగి రాక పరువాల సోయగాలను మళ్ళీ తెస్తుందా ?
 
ఓ జిలేబీ! నీకిదే నీరాజనం!
 
 
 
జిలేబి.