Tuesday, May 29, 2012

మూడో మొగుడి నాలుగో పెళ్ళాం

సుభద్ర ఎట్లా శ్రీ కృష్ణుల వారికి చెల్లెలు అని అడిగారు జై గొట్టి ముక్కలు వారు.

దానికి సమాధానం టపీమని ప్రవీణ్ శర్మ చెప్పెసేరు (అబ్బాయి ప్రవీణుడు స్ట్రైట్ సమాధానం ఇవ్వడం ఇదే మొదటి సారి నేను చదవడం!) - వసుదేవ రోహిణి ల కుమార్తె సుభద్ర అని , సో, సుభద్ర శ్రీ కృష్ణుల వారి చెల్లెలు అని.

శ్రీ కృష్ణార్జునుల మైత్రి జగద్విదిత విషయం. ఈ విషయమై ఆలోచిస్తా ఉంటే ఫక్కున నవ్వు వచ్చింది.

చెల్లెలు సుభద్ర వివాహం అర్జునిని తో గావించడానికి శ్రీ కృష్ణుల వారి నాటకం (శ్రీ కృష్ణార్జున యుద్ధం లో రసవత్తరమైన ఘట్టాలు ఉన్న సన్నివేశాలు ఉన్నాయి మరి !- తపము ఫలించిన శుభ వేళ .. )

కథా పరం గా రక్తి కట్టించే అంశం ఏమిటంటే, 'సుభద్రా సహిత అర్జునుల' 'ఎలోప్మేంట్' సందర్భం లో సుభద్ర ని శ్రీ కృష్ణుల వారు రథాన్ని సారధ్యం వహించ మనడం, దానిని కారణం గా చూపి, అర్జునుడు సుభద్ర ని లేవ దీసుకు పోలేదు, సుభద్రే మనసు పడి అర్జునిని లేవ దీసుకు పోయింది కాబట్టి ఇందులో అర్జునిని తప్పేమి లేదు సుమీ అని అర్జునినికి శ్రీ కృష్ణుల వారు వకాల్తా పుచ్చు కోవడం !

ఎంతైనా అర్జునుని మీది అవ్యాజమైన ప్రేమ శ్రీ కృష్ణుల వారి ది మరి.

 మైత్రీం భజరే !

ఇక ఈ టపా శీర్షిక మూడో మొగుడి నాలుగో పెళ్ళాం ఎవరు అంటే సుభద్రా దేవే కదా మరి? అర్థం అయ్యిందా ? అర్జునిని ద్రౌపది, చిత్రాంగద, ఉలూపి తరువాయి సుభద్ర నాలుగో భార్య కదా మరి అర్జునుల వారికి ?

ద్రౌపది వరమాల తో అర్జునిని వరిస్తే, తల్లీ భిక్ష తెచ్చామని కుంతి తో ఐదుగురు కొమరులు అంటే, ఆ తల్లి భిక్షని సమంగా పంచుకొండీ అంటే, పాంచాలి పంచ భర్తృక అయ్యింది. అర్జునుడు ద్రౌపది కి మూడో మొగుడన్న మాట .

ద్రౌపది, చిత్రాంగద, ఉలూపి ల తో చేర్చి మువ్వురు భార్యలని అక్కున చేర్చుకున్న అర్జునినికి (మూడు మళ్ళీ!) సుభద్ర తన మనసుని దార పోసుకుని నాలుగో పెళ్ళాం అయ్యింది.


వీరి జీవితం లో ని మరో అపూర్వ సంఘటన అభిమన్యుని జననం. తండ్రి కై అభిమన్యుని మరణం, ఆ పై అభిమన్యు ఉత్తర ల పుత్రుడు పరీక్షిత్తు మొత్తం కౌరవ వంశానికి ఏకైక వారసుడు గా మిగలడం ఆ పై ఆతని మరణం తక్షకుని  ద్వారా ...  ఆ పై జనమేజయ వృత్తాంతం, ....

సో, జై గొట్టి ముక్కలు గారు, మొత్తం మీద, మీ ప్రశ్న కి సమాధానమూ, ఈ చిన్ని టపా అంతా మీ అమ్మాయి చిన్ని ప్రశ్న తో మొదలు !

చిన్ని బుర్రల ప్రశ్నల తోనే కదా పెద్దవాళ్ళు కూడా చదవడం నేర్చుకునేది మరి !

మీ ప్రశ్న కి సమాధానం ఏమిటబ్బా అని ఆలోచిస్తూ ఉంటే, గూగల్ ఘటోత్కచుడు (!) అట్లా ఇట్లా లాగించి మొత్తం మీద ఇండోనేషియా లో ని ఒక అపూర్వ మైన అర్జునిని విగ్రహాన్ని చూపెట్టేడు !



Raja Ravi varma - Arjuna Subadhra





ఎక్కడి నించో కథ ఎక్కడికో వెళ్లి పోయింది మరి !

చీర్స్
జిలేబి.

Sunday, May 27, 2012

జిలేబి మీట్స్ జగన్ !

రెండు రోజులల్నించి మా మనవడు జగన్ బాబుని వాళ్ళెవరో సి బీ ఐ వాళ్ళు నానా ప్రశ్న ల తో వేధిస్తా ఉంటే, పోనీ లే మనవాడి తో కొంత సేపు మాట్లాడి ఊరట కలగ నిస్తాం అనుకున్నా,

పాపం ఎంత గా 'కలవర' పడి పోయి ఉన్నాడో తండ్రి ని పోగుట్టు కున్న తనయుడు, ప్చ్, అయ్య పోయినప్పటి నించి అబ్బాయికి ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో అని బాధ పడి పోయా.

ఒరే అబ్బీ నీ కెన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా అన్నా ఇంటికివెళ్లి.

అప్పుడే ఏడు గంటల పై బడి అదేదో క్లారిఫికేషన్ సెషన్ అట, సి బీ ఐ వాళ్ళ తో అది ముగించుకుని వచ్చి ఉన్నాడు. మధ్య లో టీవీ లో కూడా చూసానే బాబు మరీ కలత గా వున్నాడని టీవీ వాడు హోరు మని చెబ్తున్నాడు కూడాను.

జగన్ బాబు తేలిగ్గా నవ్వేసి, బామ్మా, ఏమిటి కష్టాలు అన్నాడు.

అదేమిరా అబ్బీ అట్లా ఏడు గంటల సేపు నిన్ను నిఖార్సుగా ప్రశ్న ల మీద ప్రశ్నలు వేశారట గా అన్నా.

బామ్మోయ్, చిన్నప్పుడు నాన్న ని నేను కూడా చాలా ప్రశ్న ల తో పరేషాన్ చేశా. అవన్నీ ఆయన పట్టించు కున్నా డంటావా ? అన్నాడు.

ఏమంటావురా అబ్బీ అన్నా

అదేలే, వాళ్ళేదో వాళ్ళ స్టైల్ లో ప్రశ్నలడుగు తారు, అమావాశ్య కీ అబ్దుల్ కాదర్ కీ సంబంద్ క్యా హాయ్ అని. మనం మన సమాధానా లేవో చెప్పు కుంటాం. అంతే అన్నాడు..

అదేట్లారా అబ్బీ , నువ్వు చాలా 'కలవల' పడి పోయావని టీవీ వాడు హోరెత్తు తుంటే, ఇలా నిమ్మళం గా ఉండావు !

వాళ్లకి ఇంటర్వ్యు ఇచ్చేటప్పుడు అలాగే పోస్ పెట్టా బామ్మా.

ఎందుకురా అబ్బీ.

ప్రజలకి తెలియాలిగా తమ ప్రియతమ నాయకునికి ఎన్ని కష్టాలో అని మరి.

అంతే అంటావా ?

అంతే.

మరి రేపటి మాటలో ?

వాళ్ళు క్లారిఫికేషన్ అడుగుతారు. నేను కూడా క్లారిఫికేషన్ ఇస్తా. వాళ్ళు దానికి క్లారిఫై చెయ్యి అంటారు. నేను దానికి క్లారిఫై అని మళ్ళీ చెబ్తా. ఇట్లా...

సో, మొత్తం మీద, క్లారిఫీ కేషన్ సెషన్ అని టైం పాస్ అండ్ టీం పాస్ కాలక్షేపం బటాణీ లన్న మాట!

చీర్స్
జిలేబి.

Friday, May 25, 2012

బ్లాగ్ గాంధీ కాలక్షేపం కబుర్లు శర్మ గారికి హార్ధిక శుభాకాంక్షలు

బ్లాగ్ గాంధీ కాలక్షేపం కబుర్లు శ్రీ  శర్మ గారు,

మీ జీవితం లో 'బంగారం' మీ శ్రీమతి ప్రవేశించిన దినం ఇవ్వాళ (సరియనే అనుకుంటాను!)

ఇది సరిగ్గా ఓ యాభై సంవత్సరాల మునుపు జరిగినట్టు మీ బ్లాగ్ లో చదివి నట్టు గుర్తు.

సో , మీ కిదే , యాభై వసంతాల గ్రీటింగ్స్!

మీ జీవితం అమోఘం. మీ జీవితం లో జరిగిన సంఘటన ల ఆధారం గా మీరు బ్లాగ్ లో సహృదయమై    మీ జీవిత అనుభవాలను టపాల ద్వారా   పదుగురి తో పంచుకోవడం, తద్వారా మీరు పదిమందికి మార్గదర్శకులు గా ఉండడం ఈ పంచ దశ లోకం లో జరిగిన అపురూప విశేషం.

శుభాకాంక్షల తో

చీర్స్
జిలేబి.

(శ్రీ శర్మ గారి ఫోటో కర్టసీ -
 (దీనిని తెలుగు లో చౌర్యం అందురు ) !-

Wednesday, May 23, 2012

మా ఆవిడ బంగారం (ఓల్డ్ ఈజ్ గోల్డ్) !

'మా ఆవిడ బంగారం ' అన్నారు మా అయ్యరు గారు.

పొద్దుటే లేచి హిందూ పేపరు చదువుతూ చెప్పడం  తో,

'ఏమండీ, అయ్యరువాళ్ , పొద్దుటే, మరీ పొగిడేస్తున్నారు ఏమిటీ కధ ,  కాఫీ ఏమైనా పెట్టాలా' అన్నా పొద్దుటే లేచి తనే కాఫీ పెట్టుకుని తాగే పెద్ద మనిషి ఇట్లా పొగి డితే , సందేహం రాక పోదు మరి, దేనికో, స్పెషల్ గా ఐసు పెడుతున్నారు సుమీ అని మరి.

అందుకే అలా అడిగా.

అదికాదోయ్, నిజంగా నే చెప్పా, మా ఆవిడ బంగారం అన్నారు మళ్ళీ.

ఎందుకో మరి ? అడిగా ఈ మారు సందేహం తీర్చుకోవడానికి.

'ఇట్లా చూడు, హిందూ వారు ఇవ్వాళ్టి పేపర్లో ఏం రాసారో మరి అన్నారు మా అయ్యరు గారు.

'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్న శీర్షిక కింద, పాత కాలం ఎప్పుడూ గోల్డె అని నొక్కి వక్కాణించారు హిందూ దిన పత్రిక వారు.

ఆహా చూసావా, ఓల్డ్ ఈజ్ గోల్డ్, సో నువ్వో మరి ఓల్డే కదా.. అందుకే గోల్డ్ అన్నా అన్నారు.

అనరూ మరి, తనూ బోసి నోటి ఓల్డ్ మేను ఆయే మరి !

జోగీ జోగీ రాచుకుంటే బూడిద రాలుతుందని 'సా' మేత' ! సో ఇట్లా ఓల్డూ , ఓల్డూ జోకులేసు కుంటే, మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు మరి !

అద్సరే అయ్యరు గారు, మరి మీరు మాత్రం గోల్డ్ కారూ.. అన్నా మురిపెం గా..

అవునేవ్, నేనూ గోల్డ్ కదా మరి. ఇంకా సరిగ్గా చెప్పా లంటే, నీ 'గోల్డు' కొనుగోళ్ళ కి నేను 'కాపిటలిస్ట్ ని కదా మరి ! అన్నారు ఈ మారు.

అబ్బో, వీరు, కథ ఏమి చెప్పినా గోల్డు లేకుండా చెప్పరు సుమీ ! అదేమీ గోల్డు యవ్వారమో. గోల్డు మాయో ! ఆ గోల్డు కనిపిస్తే చాలు ఇక అంతే, వీళ్ళు అన్నీ మరిచి పోతారు సుమీ అన్నారు మళ్ళీ. !

అంతే, కదా మరి, ఓల్డ్ ఈజ్ గోల్డు అయినప్పుడు, గోల్డు మురిపాలు మా కుండవా మరి !

చీర్స్
జిలేబి.

Saturday, May 19, 2012

మీటింగ్ మిస్టర్ సుబ్బూ ఆన్ ది స్ట్రీట్ - (సుబ్బూ సుభాషితాలు )

నిన్న బ్రాడీ పేట లో వాకింగ్ వెళ్తూంటే డాక్టర్ రమణ గారి సుబ్బు హటాత్తు గా ప్రత్యక్షమై 'ఏమండీ జిలేబీ గారు బాగున్నారా ' అన్నాడు!

'ఓహ్, సుబ్బూ గారు మీరా ' అన్నా 

'అబ్బే, ఆ గారూ వగైరా ఎందుకు లెండి. జస్ట్ కాల్ మీ సుబ్బూ' అన్నాడు వినయంగా.

ఏమోయ్ సుబ్బూ అన్నా వాడన్నాడు కదా అని.

'అదేమిటండీ ఏకవచనం లో పిలుస్తారు ?' అన్నాడు సుబ్బు సీరియస్ గా.

'అదేమిటోయ్, నువ్వే కదా సారీ మీరే కదా జస్ట్ కాల్ మి సుబ్బూ అన్నావు సారీ అన్నారు' అన్నా.

'అదేంటి, జస్ట్ కాల్ మీ సుబ్బూ అంటే, వెంటనే 'ఏమోయ్' అనెయ్యడమేనా ?'  

'మరి?' అన్నా ఏమనాలో తెలియక.

'మొహమాటానికి ఎన్నో అంటూంటాం. వెంటనే దాన్ని వంద శాతం పాటించడమేనా ?'

'సారీ సుబ్బు గారు, తప్పైపోయింది క్షమించండి'

అదేమిటండీ, జస్ట్ కాల్ మీ సుబ్బూ, ఇట్స్ ఓకే ' అన్నాడు మళ్ళీ.

'మిస్టర్ సుబ్బు, కాఫీ తాగుతారా '

కాఫీ ఎందుకు లెండి, ఈ మండే ఎండలో కూడా మా డాక్టరు బాబు ఎప్పుడు వెళ్ళినా కాఫీ ఏ కొట్టిస్తుంటాడు. మీరు కూల్డ్రింక్స్ కొట్టించండి ' అన్నాడు.

మరి కూల్డ్రింక్స్ అంటే, వాటి పాలిటిక్స్ గురించి సుబ్బు చెబుతాడేమో అని కొంత అనుమాన పడి, ' మిస్టర్ సుబ్బూ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ?' అన్నా.

'అసలు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అంటూ ఏదైనా ఉందంటారా ?'

'వై మిస్టర్ సుబ్బూ. ఈ మధ్య పెక్డ్ బాటల్స్ లో కూడా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ వస్తోంది కదా ' అన్నా.

'చూడండి, మిస్, ఫ్రెష్ అని వాడంటాడు మరి మనకి తెలియదా అది ఎంత ఫ్రెష్ అనో '

సరే పోనీ, చాయ్ తాగుతారా మిస్టర్ సుబ్బూ..'

అదీ, అలాగ చెప్పండి, ఇట్స్ అవర్ నేషనల్ డ్రింక్. కాబట్టి చాయ్ తాగడం బెటర్'

'మిస్టర్ సుబ్బూ.,. నేషనల్ డ్రింక్ అన్నంత మాత్రాన మీ కిష్టమైన కాఫీ వదులు కోవడ మేనా ?' అన్నా దక్షిణ దేశ కాఫీ పాలిటిక్స్ ప్లస్ ప్లాంటేషన్స్ గుర్తుకు తెచ్చు కుంటూ.

'చూడండి, మిస్, మనం కాఫీ ఇప్పడు వద్దే వద్దు అన్నా మనుకొండీ, డిమాండ్ ధమాల్ దానికి. ధర పడి పోతుంది. చాయ్ ధర షూట్ అప్ అవుతుంది.'

అయితే ?

'చాయ్' ధర ని తగ్గించడానికి చాయ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు '

'అవురా, చాయ్ ఎక్స్పోర్టింగ్ మార్కెట్ నించి, చాయ్ ఇంపోర్టింగ్ మార్కెట్ అవుతుందన్న మాట మన దేశం ?'

'హ్హ హ్హ హ్హ' నవ్వాడు మిస్టర్ సుబ్బూ.

హుష్ కాకి. సుబ్బూ గాయబ్. మళ్ళీ బ్రాడీ పేట లో నడక మొదలెట్టాను!

(బ్రాడీ పేట లో షికార్, సుబ్బూతో ముఖాముఖి- డాక్టర్ రమణ గారికి అంకితం!))

చీర్స్
జిలేబి.

Thursday, May 17, 2012

దేముడి మమ్మీ ఎవరు ?

బామ్మోయ్  దేముడి  మమ్మీ  ఎవరు అన్నాడు మా మనవడు.

అదేమిరా ప్రశ్న అన్నా.

నాకు మమ్మీ ఉంది కదా. దేముడికి మమ్మీ ఎవరు అన్నాడు.

అదేమిరా , ఏ దేముడికి ? అని తెలివిగా అడిగా (అనుకున్నా)  శీ కృష్ణుల వారికా? నీకు తెలిసిందే కదా, యశోదమ్మ అన్నా.

"కాదు. దేముడికి" అన్నాడు వాడు.

దేముడికి అమ్మ అంటూ ఎవరూ ఉండరు రా  కన్నా అన్నా.

అదేమిటి ? నేనున్నా గా. మమ్మీ ఉంది గా. మరి దేముడికి ఎందుకు లేదు ? మళ్ళీ వెధవ ప్రశ్న.

అబ్బే ఈ కాలం పిడుగులు వదిలి పెట్టరే మనల్ని ప్రశ్నలడగ కుండా. , అదీ సమాధానం చెప్పలేని ప్రశ్నలని అడగ కుండా అనుకున్నా.

అదికాదురా మనవడా, దేముడికి ముందంటూ ఏమీ లేదు. దేముడే మొదలు అంతే.

అదెట్లా? మమ్మీ లేకుండా ఎలా ? మళ్ళీ వాడి గోల.

ఏమని చెప్పా లంటారు ?

చీర్స్
జిలేబి.

Saturday, May 12, 2012

మీ పేరు గణపతా ?

మీ పేరు గణపతా ?  అన్నారు క్రితం టపాలో సీతారామం అనబడే బ్లాగరు/బ్లాగరిణీ గారు!

ఇంతకీ గణపతి కి జిలేబి కి ఎలా లింకు పెట్టేదబ్బా ?

సీతారామం గారు, చూడుము చిలకమర్తి వారి గణపతి నాటకము అన్నారు. గాని ఎక్కడ చూడ వలె నో చెప్ప లేదు.

సరే ఈ గణపతి ఎవరు చిలకమర్తి వారు ఎవరు అని ఆరా తీస్తా ఉంటే ( చిలకమర్తి వారి పేరు విన్నాను గాని, వారి రచనలు ఎప్పుడు చదివిన ది లేదు. కావున ఎవరబ్బా ఈ చిలకమర్తి వారు అనుకుని గూగులాయ నమః అంటే, తూర్పు గోదావరి వారి కథల్లో ప్రాచుర్యం అని తెలిసింది.

ఆ హా, మనకీ, ఈ గోదావరి కి ఏమి అవినాభావ సంబంధం సుమీ అని చాలా సంతోష పడి పోతిని.

ఎందు కంటే, కొన్ని నెలల ముందు జ్యోతిర్మయీ వారు మీది గోదావరి ప్రాంత మా జిలేబీ గారు అన్నారు.

కాదండీ, ట్రైన్ నించి గోదావరి చూసి బహు సంతోష పడిన వారము మాత్రమె అన్నా.

మీ రచనల్లో గోదావరి తీర యాస ఉందండీ అన్నారు వారు!

ఆహా, అసలు మనం ఈ గోదావరి తీరం లో ఎప్పుడూ ఉండి ఉండక పోయినా మన కెట్లా ఈ యాస వచ్చింది సుమీ  అని హాశ్చర్య పోయి, అంతా మన పూర్వ జన్మ వాసన సుమీ అని తీర్మానించే సు కున్నా.

ఇప్పుడు ఈ సీతారామం గారు మళ్ళీ మీరు గణపతా అని అడిగి ఆ జ్ఞాపకాలను మళ్ళీ కదిలించారు సుమీ.

ఇంతకీ మీరు గణపతా అని ఎందుకు అడిగారు సీతరామం గారు ?

గణపతి కథకి ఈ జిలేబీ ఉడాలు టపాలకి ఏమి సంబంధమబ్బా ? ఎవరైనా తెలిస్తే చెబ్దురూ.  

పూర్వ జన్మలో ఈ చిలకమర్తి వారి రచనలు ఏమైనా చదివారా జిలేబీ ?


చీర్స్ 
జిలేబి.

Friday, May 11, 2012

ఉషో వాజేన వాజిని ప్రచేతా హ !


శుభోదయం !


వాజమ్మ అంటే దద్దమ్మ అని నిఘంటువు చెప్పింది.


ఉషో వాజేన వాజిని ప్రచేతాహ అని వేదం చెప్పింది.

అంటే ఉషస్సు దద్దమ్మ ల లో పెద్ద దద్దమ్మ అన్న మాట !


అదేమో , ఈ ఉషస్సు కి డైలీ అలా వచ్చేసి దద్దమ్మ లా తెల్లారి మన ఇంటి ముందర వాలి పోవాలని ముచ్చట.

దద్దమ్మ అయినా దొడ్డమ్మే ఉషా దేవి.

వాజి అంటే గుర్రమట. మళ్ళీ నిఘంటువే చెప్పింది.

అంటే ఉషస్సు గుర్రాలలో కెల్లా పెద్ద గుర్రమా ? జేకే .

సూరీడు సప్త అశ్వాల మీద సవారి అయి వస్తాడంట.

కాబట్టి ఉషా దేవి ఈ అశ్వాల కి మహారాణి. సో, ఉషో వాజేన వాజిని.

వాజ అంటే యాగం/యజ్ఞం అట. నిఘంటువు చెప్పింది.

యజ్ఞాలలో కెల్ల గొప్ప యజ్ఞం అన్న మాట ఉషస్సు .

మళ్ళీ పురాణీ దేవీ యువతిహి అని ఉషస్సు గురించి వేదం చెప్పింది.

అంటే, ఈ ఉషస్సు, ఉషా దేవి, ఓల్డ్ ఉమన్ అన్న మాట. కాని నిత్య యవ్వని (అబ్బో మన లా అన్న మాట!)

సో, శుభోదయం !



(Having read the ఉషా సూక్తం - A wonderful one  from the Rigveda for all its poetical beauty, wonderful imagination and superb eloquence of meaning and content!) 

చీర్స్ 
జిలేబి

Tuesday, May 8, 2012

ఏమండీ బాగున్నారా ?

ఏమండీ బాగున్నారా  ?

'ఆ, ఎం బాగు లెండి. ఏదో అలా కాలం గడిపేస్తున్నాం. అంతే 

ఏమిటండీ మీరే అలా అనే సారు ?

అంతే కదండీ, ఏదో రిటైర్మెంటు రోజులకి సరిపోతాయని సేవింగ్సు మన్నూ మశానం అంటూ కూడ బెట్టామా? అది చేతికి వస్తుందో లేదో తెలీకండా పోతోంది

దానికేమి లెండి, వస్తుందనే అనుకోవాలి . పిల్లలు బాగా చదివి పైకోచ్చారు గా. వాళ్ళు చేతి కంది రాక పోతారంటారా ?

వాళ్ళు చదివే కాలం లో కష్ట పడ్డాం. బాగా చదివించాలని. ఇప్పుడు దేశానికోక్కడు లేడు. పొలోమని విదేశాల మీద పడ్డారు.

అంటే ఎన్నారై అని చెప్పండి. మరి మీరు మరీ అదృష్ట వంతులే సుమండీ ! పిల్లలు మంచి పోసిషన్ కి వచ్చేరన్న మాట .

ఆ ఎం బాగు లెండి, వాళ్ళు చేతి కంది, ఆ పై కెళ్ళి పోయారు. మన జీవితం ఇంతే కదా ఇక్కడ. నో చేంజ్ అందుకే ఆదుర్దా, అసలు మన పెన్షన్ వస్తుందంటారా ?

మీకో అమ్మాయి ఉండాలే . పెళ్ళయి పోయిందా ?

ఆ ఎం బాగు. పెళ్లి అయింది అయి నాలుగేళ్ళు రెండు పాపలతో ఒకటే కనా కష్టం పడుతుంది.

అదేమిటండీ, పాపలు ఇంటికి దీపాలు కదండీ

ఆ ఎం దీపాలో ఏమిటో ? వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు, అబ్బబ్బ, మా అమ్మాయి ఒకటే కలవరం.

ఏమండీ అదెప్పుడో ఇంకో ఇరవై ఏళ్ల పై బడే కదండీ . దానికిప్పుడే హైరానా పడి పోతే ఎలాగండీ ?

కాదుటండీ మరి, అయినా మనం ముందస్తే దానికి కాబోయే ఖర్చులకి ఇప్పట్నించే కూడ బెట్టాలి. అబ్బబ్బ, ఎం బాగు లెండి జీవితాలు. అన్నిటికి ఒకటే పరుగో పరుగు.

అంతే లెండి. జీవితం భవిష్యత్తు కి అంకితం అయిపోయింది మరి. ప్రస్తుతం వస్తుతః భవిష్యోత్తర 'పురాణం' !


చీర్స్
జిలేబి.

Sunday, May 6, 2012

హే ప్రభూ, నీ దయ రాదా

ఒక కోయిల గొంతు విప్పింది
ఆ వైపు వెళ్ళే మరో కోయిల జత కలిపింది

సాగరం లో నావ పయనం మొదలెట్టింది
సాగరం తోడై ఆటు పోటులతో ముద్దాడింది

యానం లో తోడూ నీడా, పయనం లో జోడూ
ఆ పై వాడి సూచిక నేను నీ తోడు ఉన్నా నని
గమనిస్తే నావకి సంద్రం, సంద్రానికి నావ సరి జోడు

అర్థం చేసుకుంటే జీవనం తీరం చేరిన నావ
ఆ పై వాడి దయ కూసింత కురవడానికి
రెండు చేతులా దణ్ణాలు హే ప్రభూ, నీ దయ రాదా


జిలేబి.