Saturday, April 14, 2012

బుజ్జి పండు తెలుగు చదువు - శ్రీ భాస్కర విజయం - 2

హంగేరీ - బుదాపెస్ట్ మహానగరం.
బుదా, పెస్ట్ రెండు నదుల మధ్య ఐరోపా లో సుందరమైన నగరం గా పేరు గాంచినది.
మే నెల వచ్చేస్తోంది. చలి కాలం పోయి, వాసంతం వచ్చి, సూరీడు కిరణాలు వేడిని చలి కి వెచ్చ గా ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.

హంగేరియన్ ఆయుర్వేద ఫౌండేషన్ ఆఫీసు సెమినార్ హాల్ ముందు  ఫోక్స్ వాగన్ బీటల్ కారు ఆగింది.


సెమినార్ హాల్ ముందు వేచి ఉన్న హంగేరియన్ ఆయుర్వేదా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గేబై కారు నించి దిగుతున్న శ్రీ భాస్కర శర్మ గారి కి స్వాగతం పలుకుతూ నమస్తే శర్మాజీ అన్నాడు రెండు చేతులూ జోడించి, "మంచి వేళ ఇవ్వాళ ! ఎప్పుడూ మా దేశం లో కరెంటు పోదు. అయితే ఇవ్వాళ కరంటు పోయింది ఇక్కడ ! ఇవ్వాల్టి కార్యక్రమం ఎలాగబ్బా అని ఆలోచిస్తూంటే, మీ రలా రావడం, కరెంటూ ఒక్క రెండు నిమిషాల ముందే రావడం అంతా సవ్యం గా కానవస్తోంది నాకు " అన్నాడు.


పంతొమ్మిదివందల ముప్పై ప్రాంతాలలో ప్రారంభించ బడ్డ ఫౌండేషన్ హంగేరీ లో చాలా మంచి పేరుని గాంచింది. ధీటైన రిసెర్చ్ సెంటర్ గా మారిన ఫౌండేషన్ ఆయుర్వేద రిసెర్చ్ లో ప్రముఖ స్థానాన్ని వహించడం ఆ దేశం వారి కృషికి నిదర్శనం.


ఆయుర్వేద ఏ ఒక్క జాతి కో మతానికో చెందినది కాదు. ఐదు వేల సంవత్సరాల పై బడ్డ మానవ మేధో సంపత్తి అది. అట్లాంటి ఆయుర్వేద తా పుట్టిన దేశం లో అల్లోపతీ సుడిగుండం లో కొట్టుకు పోతూంటే , ఐరోపా లో పునరుద్ధరణ కి సంసద్ధ మవు తోంది.


సెమినారు హాలు లో చిర్రావూరి దీక్షితులు గారిని పరిచయం చేస్తూ , గాబై మాట్లాడాడు. శ్రీ శర్మ గారిని ప్రస్తుతిస్తూ వారు రాసిన 'పరహిత వైద్యం' గురించిన విషయాలను ఉటంకించాడు. 


ఆ పై శర్మ గారు గాబై ఆహ్వానంతో ఆ నాటి అతిధి ఉపన్యాసాన్ని మొదలెట్టేరు.


"సభకు నమస్సులు. మీ ఫౌండేషన్ పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతం లో ప్రారంభింప బడ్డది. మా నాన్న గారు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాలలో ఈ పరహిత వైద్యం చేసేవారు " చెప్పారాయన .


ఫౌండేషన్ చప్పట్లు చరిచింది. హంగేరీ వాసులకు సారూప్యతలు నచ్చుతాయి. అంతే గాక ఈ సారూప్యతలకి ఖచ్చితం గా
ఒక లింకు ఎక్కడో అక్కడ ఉండే ఉంటుందని వారి నమ్మకం. 


పరహిత వైద్య విధానం దక్షిణ భారత ఆయుర్వేద వైద్య విధానం. ఈ విధానం పేరుకు తగ్గట్టు పరుల హితం కోరి చేసేది. ఇందులో స్వలాభోపేక్ష కి తావు లేదు. ఈ వైద్య విధానాన్ని స్వీకరించేవారు నియమ నిబద్ధతలకి కట్టు బడి ఉండే వారు. లోకాః సమస్తాః సుఖినో భవంతు అన్నది వేద వాక్కు. శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అంటుంది వేదం. అంటే సర్వ జంతు జాలాలు శాంతి గా ఉండాలి. ఒక్క మానవ మాత్రుడు మాత్రం ఆరోగ్యం గా సంతుష్టుడై ఉంటే చాలదు. సర్వ జంతు జాలాలు కూడాను.
 
ఆయుర్వేద మానవులకూ, సర్వ జంతు జాలాలకు సంబంధించింది. నా వర కైతే నేను గమనించింది మా తండ్రి వారి గురించి విని ఉన్న పరహిత వైద్యం. " శర్మ గారు తేట తెల్లమయ్యే లా సవివరం గా చెప్పు కొచ్చేరు పరహిత వైద్యం గురించి.
 
వారి ఒక గంట పాటి ప్రసంగం అలా అలవోకగా గోదావరీ పరవళ్ళు లా బుడా నదీ ప్రాంతం లో సాగి పోయింది. ఫౌండేషన్ అతిధులు శర్మ గారి వాక్ ప్రవాహానికి మంత్ర ముగ్దులై అలా వింటూ ఉండి పోయారు.
 
ఆ పై ప్రశ్నల పర్వం మొదలయ్యింది
 
"శర్మ గారు, ఇంత మంచి వైద్య విధానం అలా ఒక తరం తో ఆగి పోవటం పాశ్చ్యాత వైద్య విధానం మీ దేశం లో త్వరిత గతిన పెంపొందడ మే నంటారా ?"
 
అది ఒక కారణం. ఆ పై ఈ వైద్య విధానం కాలగతిన తరువాయి తరానికి పట్టక పోవడం కూడా మరో కారణం. ఉదాహరణ కి మా తండ్రి తరువాయి నాకు ఆ భాగ్యం దక్క లేదు "
 
"భారద్దేశానికి ఈ కర్మ సిద్ధాంతమే, భాగ్యం , అభాగ్యం మీద నమ్మకాలే ఒక నెగటివ్ పాయింట్ అనిపిస్తుంది మాకు " మరో మెంబర్ చెప్పాడు.
 
"కావచ్చు. ప్రయత్నే ఫలే . కష్టే ఫలే. కాని మరో కోణం నించి ఆలోచిస్తే జన సాంద్రత కి ఈ కర్మ సిద్ధాంతమే ఓ పాటి మనః శాంతి ని కలిగిస్తూ, దేశం నానా విధాలా అసంతృప్తి కి లోను కాకుండా కాపాడుతోందని అనిపిస్తుంది కూడాను. ధర్మ మైన సంకల్పం, ధృడంగా అమ్మమీద భారం వేసి, కార్యక్రమం నడిపిస్తే అంతా సవ్యమే, అప సవ్యం సమస్య లేదు. అదే నా అనుభవం" చెప్పారు శర్మ గారు.
 
"ఈ దైవ నమ్మకం ఐరోపా లో తిరోగమన వాదం గా పరిగణింప బడుతోంది " మరో మెంబెర్ చెప్పాడు.
 
"కావచ్చు. మన కన్నా పై నొక శక్తి లేక డిఫరెంట్ డైమెన్షన్ అన్నది ఉన్నది అన్నది వాస్తవం. ఆ మరో కోణాన్ని తమ 'దృష్టి ' తో చూసిన వారు ఋషులు. అందుకే వారు 'దీర్ఘ దర్శులు'. ఆ దీర్ఘ దర్శులు గాంచినదే , తమ మేధో సంపత్తి తో గాంచినదే ఆయుర్వేదం. అంటే వారు వేరే డైమెన్షన్ లో దృష్టి ని సారించి, ఈ వైద్య విధానాన్ని కనుక్కోవడం అంటూ జరుగుతూంది. ఇది ఈ ఒక్క శాస్త్రానికి మాత్రమె సంబంధించినది కాదు. మీరు ఇప్పుడు వస్తున్న ప్రతి 'ఇన్నోవేషన్' వెనుకా దీని మూల భూతులైన వారు తమ పరిధి ని దాటి మేధస్సును ఉపయోగించడం తో టే గదా ఈ సరికొత్త సాధనాలు పరికరాలు మనకు లభిస్తున్నాయి "
 
ఆ నాటి సభా కార్యక్రమం ముగింపు కొచ్చింది. మెంబెర్స్  జోహారు లందించారు శర్మ గారి సంభాషణ కి.
 
గాబై సంతృప్తి గా చూసాడు శర్మ గారి వైపు "మీరు అప్పుడప్పడు మా మెంబెర్స్ ని అడ్రస్ చేస్తూ ఉండాలి' చెప్పాడాయన.
 
"అమ్మ దయ ఉంటే నిరభ్యంతరం గా అలాగే " చెప్పారు శర్మ గారు.
 
గాబై విచిత్రం గా చూసాడు శర్మ గారి వైపు. ఇన్ని సంవత్సరాలు గా భారద్దేశ వైద్య విధానాన్ని గమనిస్తూన్నా కూడా, ఈ దైవ చింతన ఈ దేశ ప్రజలలో ప్రతి విషయం లో అంతర్లీన మై వుండడం వారికి ఎప్పటికి అర్థం కాని విషయం !
 
(ఇంకా ఉంది)

5 comments:

  1. మీరు ఎక్కడికో వెళతానన్నారు. హంగేరి కి వెళ్ళారా ? ..... దహా.

    ReplyDelete
    Replies
    1. బులుసు వారు,

      ఈ పాటి ఇన్ఫర్మేషన్ రాయడానికి అక్కడి దాకా వెళ్ళా లంటారా ! ఇంటర్నెట్ మహిమ అంతా ! అంతే !

      కొంత వాస్తవం కొంత కల్పితం, వెరసి 'గల్పిక'

      చీర్స్
      జిలేబి

      Delete
  2. పరహితవైద్యం, ఆయుర్వేదం, శక్తి వీటన్నింటి గురించి చక్కగా చెప్పారు...

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మాయీ గారు,

      నెనర్లు మీకు నచ్చినందులకు! అంతా కష్టే ఫలే వారి మేటరు !

      చీర్స్
      జిలేబి.

      Delete
  3. మాధవి గారు,

    :)))

    జిలేబి.

    ReplyDelete