బోడిగుండుకి బట్టతలే శిక్ష !
one of the very impressing post from
initial years of blogging !
సంచలనాత్మక టపా
పని లేక రమణ గారు - మీరు మళ్ళీ మీ బ్లాగు మూత ని తెరిచి నందులకు
వెల్కం బెక బెక !!!
వెల్కం బెక బెక !!!
ఎప్ప్లటి లాగే మళ్ళీ మీరు టపాల తో తెలుగు బ్లాగు లోకాన్ని అలరింప జేస్తారని
ఆశిస్తూ
జిలేబి ప్రెజెంట్స్
తలనీలాలు ఇచ్చారు. ఏ దేవుడుకి సార్?". ఓ అతికుతూహల పేషంట్ యొక్క అనవసరపు వాకబు.
"డాక్టర్ గారు, మీరు చాలా పధ్ధతిగల మనిషండీ. ఈ రోజుల్లో చదువుకున్నవారిలో ఇంత భక్తిభావం అరుదుగా కనిపిస్తుంది!" ఓ ముసలి పంతులుగారి అతిమెచ్చుకోలు.
'ఓ ప్రభువా! ఈ పాపిని రక్షించు!'
రాన్రాను నెత్తిమీద కేశరహిత ప్రదేశం పెరుగుట వలన.. జయసూర్య, బ్రూస్ విల్లిస్ మొదలగువారి గుండు నుండి స్పూర్తి పొంది.. నేను కూడా బోడిగుండు చేయించుకొని.. ఫేషన్ గురు వలే పోజ్ కొట్టిన మొదటిరోజు అనుభవమిది!
మనది కర్మభూమి. ఇచ్చట బట్టతల వాడి ఫాషన్ గుండునీ, దేవుడి భక్తిగుండునీ ఒకేగాట గట్టే అజ్ఞానులే ఎక్కువ. భగవంతుణ్ణీ భక్తుణ్ణీ అంబికా దర్బార్ బత్తి ఎంత అనుసంధానం చేస్తుందో నాకు తెలీదు కానీ బోడిగుండు మాత్రం ఖచ్చితంగా చేస్తుందని చెప్పగలను.
మానవునికి తన జుట్టు అందానికీ, అహంకారానికీ చిహ్నం. ఈ రెండూ ఆ దేవుడికి సమర్పించడం త్యాగానికీ, భక్తికీ కొలబద్ద అని అంటాడు అన్నయ్య. అటులనే కానీండు. మరి గుండు దాచడానికి టోపీ ఎందుకు పెట్టుకుంటారో!
అయినా నా బట్టతలకో కథ ఉంది. నాకు మెడిసిన్ సీటొస్తే గుండు చేయిస్తానని మా అమ్మ తన ఇష్టదైవమైన ఆ తిరపతి వెంకన్నకి మొక్కుకుంది. కానీ నేను ససేమిరా అన్నాను.
నాకు జుట్టుపై ప్రేమకన్నా.. కష్టపడి సాధించిన మెడికల్ సీటుని దేవునిఖాతాలో వెయ్యడానికి మనసొప్పలేదు. అంచేత ఏంచేయ్యాలో తోచని అమ్మ మధ్యేమార్గంగా అర్భకుడైన రెండేళ్ళ మా అక్కకొడుక్కి గుండు కొట్టించింది.
ఈ ఎడ్జస్టుమెంట్ గుండు ఆ దేవుడికి నచ్చినట్లు లేదు. అప్పటినుండీ వెంకటేశ్వరస్వామి నా మీద పగబట్టి.. నా నెత్తిమీద కల తనదైన బాకీ (జుట్టు)ని.. వాయిదాల పధ్ధతిన శాస్వితంగా తీసేసుకున్నాడు. ఫైనాన్స్ వ్యాపారివలే దేవుడు కూడా బాకీ వసూలు దగ్గర ఖచ్చితంగా ఉంటాట్ట! అమ్మ చెప్పింది.
'దేవుడు జుట్టునే బాకీగా ఎందుకు వసూలు చేసుకోవడం? ఏకంగా మెడిసిన్ సీటే వెనక్కి లాక్కోవచ్చుగా?' ఈ సందేహానికి అమ్మ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉంది.
'ఆ తిరపతి వెంకన్నకి అదెంతసేపు పని! కానీ ఆయన అలా చెయ్యడు. నువ్వు తన భక్తురాలి కొడుకువి! అంచేత ఏదో మందలించి వదిలేసినట్లు బట్టతల అనే తక్కువ శిక్ష వేశాడు. సంతోషించు.' అంటూ అమ్మ బల్ల గుద్దుతుంది. నమ్మక తప్పదు!
అంచేత మీకు చెప్పొచ్చేదేమనగా.. యుల్ బ్రిన్నర్, బ్రూస్ విల్లిస్, అమ్రిష్ పూరీ, గిబ్స్ మొదలైన బోడిగుండు వీరులంతా కూడా.. వారి తల్లులు మొక్కిన పాతమొక్కుల తాలూకా బాకీలు తీర్చే క్రమంలో బట్టతలల బారిపడ్డారని! అప్పుడేకదా మా అమ్మ 'గుండుమొక్కులు - బట్టతల థియరీ' కరెక్టయ్యేది.
ఈమధ్య ఓ తోటి బట్టబుర్రవాడు బట్టతల మేధావిత్వానికీ, మగతనానికీ ప్రతీకలనీ.. ఇంకా ఏవో చాలా చెప్పాడు.
కానీ వాడు తన బట్టతల గూర్చి తీవ్రంగా వ్యాకులత చెందుతూ.. ఆ భాధ తప్పించుకోడానికి మాత్రమే ఈరకమైన వాదనలని తలకెత్తుకున్నాడని అర్ధమైంది.
నాకు మాత్రం నా జుట్టులేమి మీద అంత ఆత్మన్యూనతా భావమేమి లేదు. 'ఉంటే మంచిదే.. ఉండకపోతే మరీ మంచిది!' లాంటి ఉదాసీనవైఖరి తప్ప!
*య రమణ*
చీర్స్
జిలేబి