Wednesday, February 15, 2012

మధురాధిపతే అఖిలం మధురం ! (లేడీస్ స్పెషల్ )

మధురాధిపతే అఖిలం మధురం !


Tuesday, February 14, 2012

సన్నాసి బుట్టలో పడ్డాడు (బుట్టో పాఖ్యానం !)

కాలా కాలం గా సన్నాసులు బుట్టలో పడటాన్ని కొనియాడే శుభ దినం సందర్భాన ఇవ్వాళ సన్నాసుల  వారి కథా, బుట్ట బొమ్మ కథా తెలుసు కుందాం !

జిలేబీ పెళ్లి రోజు .

బుట్ట లో జిలేబీ ని పెట్టుకుని  వస్తూంటే , బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి నాకు కాబోయే అర్ధాంగీ అని మురిసి పోయిన జంబు నాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారికి అవ్వాళ తెలిసి రాలే, బుట్టలో బొమ్మ పుత్తడి బొమ్మ కాదని, పేరు మాత్రమె జిలేబీ అని, తానె బుట్టలో బోల్తా పడ్డాడనీ నూ.

ఆ పై మూడు రాత్రుళ్ళు (ఈ మూడు రాత్రుళ్ళ ముచ్చట గురించి నేను చెప్పను బాబు మరీ సిగ్గు !) కానించిన తరువాయి శ్రీ అయ్యరు వారు 'జిలేబీ, మాంచి ఫిల్టరు కాఫీ ఒక్కటి పట్టుకు రావోయ్ " అంటే జిలేబీ బిక్క మొగం బెట్టి,
"అయ్యరు గారు,   మీకు వంట బాగా వచ్చనే బామ్మ నాకు చెప్పి నన్ను మిమ్మల్ని కట్టు కొమన్నారు " అని బిక్క మొగం పెడితే, వంశ పారంపర్యం గా వచ్చే అయ్యరు హోటలు వృత్తి ఇంట్లో కూడా వంట గాడేనా, గాదేనా నా గతీ , రాధా, నా జిలేబీ ఇది నీకు తగునా  సుమీ అని మా అయ్యరు వారు ఉసూరు మన్నారు !

ఈ మా పెళ్ళి ఈ సో కాల్డ్ యాదృచ్చికమో, కాక 'తాళీ' బలీయమో జంబూ వారికే తెలియాలి !

ఈ సన్యాసి బుట్టలో పడే కార్యక్రమము నే పెళ్లి దినాన అబ్బాయి వారి 'కాశీ యాత్ర ' గా  పరిగణించడం బట్టి తెలియ వస్తున్నది ఏమనగా, ఈ వాలం టీను దినం మన పూర్వ ప్రాచీన సాంప్రదాయ పద్ధతే అని,  దీనిని కాపీ క్యాటూ చేసి కాపీ లెఫ్టు చేసి  సంతు వాలం టీను దినము గా మార్చి వేసి నారని మనము విశ్వసించ వలె.  

అయ్యలారా, అమ్మలారా , ఇవ్వాళ సంక్తు వాలం  'టీన్' జరుపు కొనుడు అబ్బాయి లారా, అమ్మాయి లారా మీకందరికీ ఇదే శుభ కామనలు !

మీరు జంబూ అయితే, మీకు జిలేబీ ఖచ్చితం గా లభ్యమవు గాక!

తప్పి మీరు జిలేబీ అయితే, తప్పక ఎవడో ఓ సన్యాసి మీ బుట్టలో పడడం ఖాయం!

ఇంతటి తో ఈ సన్యాసి బుట్టలో పడ్డాడు అనబడు బుట్టో పాఖ్యానం పరి సమాప్తము !

ఇది చదివిన వారికి, వినిన వారికి చదివి వినిపించిన వారికందరికీ ఆ పద్మావతీ అలమేలు మంగా సమేత మా ఏడు కొండల పెరుమాళ్ళు(ఈయన రెండు మారులు బుట్టలో పడినట్టు ఉన్నాడు సుమీ !) సకల మంగళములు కలుగ జేయు గాక!

చీర్స్
ఫక్తు, జిలేబీ డే!

Sunday, February 12, 2012

మానస కావేరి

మనస్సు విప్పాలని
ఒకటే పోరు
నా అంతరంగం తో
కుదరటం లేదు


మనసు విప్పాలని
ఒకటే ఆలోచన
ఆలోచన తోడు  రా నంటోంది
ఎద తోడైనా రా అంటే నిశ్శబ్ధం

ఏ ఆలోచనా పూర్తి గా
ఓ కొలిక్కి రాదు తెగిన గాలి పటం లా
మధ్య మధ్య లో  మౌనం
ఈ ఆలోచన లేలా అని

చేతులు ఖాళీ అయినా పర్లేదు
మనసులు ఖాళీ అవకూడదని
అనుకున్నా, మనసులో మనసు
ఎట్లాంటి ఆసరా ఇవ్వడం లేదు

ఆలోచిస్తున్న ఆలోచనలు
లోచనా కమల లోచన లై
మానస కావేరి లా
మౌన సంద్రాన్ని స్పృశిస్తున్నాయి

జిలేబి.

కలడు కలం డనెడి వాడు

ని పించని దేవుడు
వ మాత్రమైన ఊహ కందని వాడు ఆత
డు కను పాప అయి ఈ
ట్టె కి చూపు నిచ్చాడు
లంబోదరుడు
మరుక హృదయ గీతం
నెమలి  వాహన సహోదరుడు ఆత
డి ఆశీస్సులు
వాగ్దేవి అనుగ్రహం ఆత
డు ఇచ్చిన వరం

జిలేబి.

Saturday, February 11, 2012

తాళాలు పెట్టేరు రాధా హరే మేటర్లు పోయేను కృష్ణా హరే !

బ్లాగు బ్లాగు కీ పోయేను రాధా హరే
కూసింత మేటరు కొట్టు కొచ్చు కున్నాను కృష్ణా హరే !


అని ఆడుతూ పాడుతూ మేటర్లు బ్లాగుల నించి కొట్టేసుకుని పత్రికల లో అచ్చేసుకుని హాయి హాయి గా కాలం గడిపేసు కుంటున్న ఓ జిలేబీ కి ఉద్యోగం పోయే రోజులు దాపురిస్తున్నట్టు ఉన్నాయి.

ISA (Internal Sourcing Agent!) ఫర్ MSA (Matter Snuffing Agency) లో పని చేస్తున్న ఓ జిలేబీ కి తెల్లారి తెల్లారి లేస్తూనే బ్లాగు బ్లాగు కీ వెళ్లి మేటరు కొట్టేసుకుని వాటిని సీక్రెట్ గా పత్రికలకి కాణీ కి పరక కి అమ్మేసుకుని అవ్వాల్టి హా 'రమ్ము' హాయి హాయి అని పొంగి  పోతూన్న తరుణం లో ఓ ఇంటి ఇల్లాలు ముచ్చట తో గడ్డు రోజులు వచ్చేయి.

తాళాలు పెట్టండీ అన్న బ్లాగ్ నినాదం తో 'ఉత్తిష్ఠ , జాగృత, ప్రాప్యవరాన్.." అన్నట్టు ఉత్తేజం చెందిన వాళ్ళయ్యారు అప్పటి దాక ఉన్న పంచ దశ లోక వాసులు.

అంతటి తో బ్లాగులకి తాళాలు పడ్డాయి. !

స్నఫ్ఫింగ్ చేస్తూన్న జిలేబి కి కాపీ కి మేటరూ పోయే , కాఫీ కి కూడా కరువోచ్చే !

ఏమి చేతుమురో రాధా హరే,
నీవే దిక్కయ్య కృష్ణా హరే

అని పాడేసుకుంటూ ఇవ్వాల్టి జిలేబీ 'అప్రస్తుత ' ప్రసంగం ఇంతటి తో సమాప్తం !


చీర్స్
జిలేబి. 

Thursday, February 9, 2012

తాళాలు విరగ్గొట్టండి ! (సవాలే సవాల్ !)


మా తాతయ్య కాలం లో (ఇప్పుడు మేమూ ఆ కాలానికే వచ్చేసాం అది వేరే విషయం!) మా ఇంట్లో గూట్లో ఓ పెట్టె ఉండేది. గూట్లో పెట్టేమిటీ అంటారా సవివరం గా చెబ్తాను.

మా నడిమింటి హాల్లో నించి మిద్ద పైకి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. వాటి కింద ఓ పాటి గూటి లా ఓ ప్రదేశం ఉండేది. ఆ గూట్లో ఓ పురాతన చెక్క పెట్ట మా తాత గారిది ఉండేది. దాంట్లో వారేమో వారు కొన్న కొత్త కొత్త ఆ కాలపు (అంటే బ్రిటిషు కాలపు అన్న మాట ) గడియారాలు ఎలెక్ట్రిక్ సామాన్లు అట్టి పెట్టె వారు. ఆ పెట్టె కో తాళం కూడా భద్రం గా వేసి పెట్టె వారన్న మాట .

మా ఇంటి కాంతా జనావళికి వాటి మీద ఓ గుర్రు వుండేది. ఆ పెట్టెలో ఉజ్జాయింపుగా ఏమి ఉంటుందో తెలుసు గాని, మా తాతయ్య గారు ఆ పెట్టె ని తెరిచి మాకు చూపించనే చూపించరు. అందువల్ల వచ్చిన గుర్రు అన్న మాట అది.

ఇక తాతయ్య గారైతే అప్పుడప్పుడు మమ్మల్ని బయటకెళ్ళి ఆడుకొండ్రా బడుద్దాయిలూ అని గెంటేసి ఆ పెట్టె ని అప్పుడప్పుడు తెరిచి చూడడమూ, ఆ పై ఆ పెట్టి కి గోళ్ళం పెట్టి తాళం వెయ్యడమూనూ జరుగు తూండేది తప్పించి మేము ఎప్పుడూ ఆ పెట్టె లో ఏముందో (అంటే పూర్తి గా అన్న మాట) చూసిన ది లేదు !

కాక పోతే ఆ పెట్టె ఆయన అంత బద్రం గా తాళం పెట్టడం మాకు  ఉత్సుకతని కలిగించేది. ఆ పెట్టె తాళం ఎలా పగల గొట్టాలబ్బ అని అన్న మాట.

ఇక మా కాలానికి వస్తే మా అబ్బాయి మా మనవడు కంప్యూటరు ఎక్కువ గా ఉపయోగించకుండా ఉండడానికి తాళాలు పెట్టడం మొదలెట్టాడు. మనవడు కూడా తాడి తన్నే వాడి తల తన్నాలన్నట్లు వాళ్ళ నాన్న పెట్టిన తాళాలని విడగొట్టడం అన్న ఉద్యమం మొదలెట్టి అందులో నిష్ణాతుడై ఓ మారు వాళ్ళ నాన్నకే ఎదురు ఫిట్టింగులు ఇచ్చాడు అంటే , తనే ఒక తాళం పెట్టే డన్న మాట.

ఈ విషయం లో వాడి కెందుకో ఈ బామ్మ అంటే మమకారం. తాళం పెట్టినా బామ్మా , నీకు మాత్రం తాళం రహస్యం చెబ్తా నాన్నారికి తెలియనివ్వకు,  నీకు కంప్యూటరు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు తాళం తీసి  ఉపయోగించుకో. ఆ తరువాత ఆఫ్ చేసెయ్యి. ఈ తాళం చెవి మాత్రం నాన్నారి చెవి కి పోనివ్వకు అని చెప్పేడు.

నాకాశ్చర్యం వేసింది. మా కాలం లో తాత వాళ్ళ తాళం ఎలా విరగ్గోట్టాలా అని మేం ఆలోచించే వాళ్ళం. ఇప్పటి తరం లో నాన్నారి తాళం ఎలా విరగ్గోట్టాలా అని వీళ్ళు షెర్లాక్ హోమ్స్ మొదలెట్టారు సుమా అని.

మొత్తం మీద ఈ కాలపు కుర్ర కుంకాల తో మంచి గా ఉండటం మనకే మేలు అన్న ఓ ఫైనల్ నమ్మకానికి వచ్చేసాను నేనైతే. మనం ఎంత  బుర్ర లేని మట్టి   బుర్రలని వాళ్లకు నమ్మకం వస్తే వాళ్ళు మనకు అన్ని తెకినీకులు సులభం గా అర్థం అయ్యే లా చెప్పేస్తారని నా కనిపించింది.

హన్నా, భావి తరం భాగ్య విధాతల్లారా, ఈ బామ్మ మీద మీరు దయ బెట్టి ఈలాంటి తెకినీకులు నేర్పిస్తూ ఉండండి, రాబోయే కాలం లో (పుట్టీ గిట్టీ పుడితే ) మీ ఋణానుబంధం తప్పక తీర్చేసు కుంటాను. అప్పటికి మీకన్నా నాకే ఎక్కువ తెలిసి ఉంటుంది కదా !

(Hopefully always the future generation is brighter than the past !!)

(future)
జీనియస్
జిలేబి.

జిలేబీ శతకం - 3

జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***

కామెంటు ఉత్ప్రేరకం

కం. రమ్మా చక్కని కామెం
ట్లిమ్మా నీ రాక లేక లేఖిని ఆగే
నమ్మా జిలిబిలి పలికుల
కొమ్మా కందాలనందు కొనుమ జిలేబీ

ఉపకారం

కం. ఉపకారవ్యసనులతో
నెపమిడి పదిపనులు కొనగ నేర్చెడు వారే
ఉపకారమడుగ బోయిన
నపవాదులు వేయు వార లవని జిలేబీ

కం. అపకారుల కుపకారము
విపరీతఫలంబునిచ్చు విమతుల నటులే
యుపకార బుధ్ధి విడచుట
నెపమై దాస్యమున కూలె నేల జిలేబీ

కం. మొగమోటమి గలవారిని
పొగడిన పని జరుగు ననుచు పోగగు వారల్
మొగ మైన జూప రావల
తగు జాగ్రత వలన చిక్కు తప్పు జిలేబీ

ఊరికి బాసట

కం. ఊరికి బాసట యగుచో
నూరక నోరార పొగడు నోళ్ళకు కొదవే
వారల యందే యొక్కరు
రారుసుమా మనకు నక్కరైన జిలేబీ

కం. ఆ యింటి మామిడాకులు
వే యిండ్లకు తోరణాలు మరి యేటేటా
కాయలు పచ్చళ్ళకు దయ
చేయించు పరోపకార జీవి జిలేబీ


ఇరుకు జీవితాలు

కం. ఇళ్ళిరుకులు గుళ్ళిరుకులు
పల్లెలు పోటెత్తి రాగ పట్నా లిరుకుల్
బళ్ళిరుకు మనసులిరుకులు
కల్లలతో బ్రతుకులిరుకు కలిని జిలేబీ


'వి' గ్రహాలు

కం. పడి పోయిన పడ నుండిన
పడి లేచిన విగ్రహాల బాధలు చూస్తూ
మిడికే నేతల బొమ్మలు
పొడమును పడిపోవు నటులె పుడమి జిలేబీ

ప్రవీణు శర్మ

కం. నేరక ప్రవీణు శర్మకు
మీరు జవాబిచ్చి గాని వివరించారో
వారింక మిమ్ము వదలరు
పోరాడే యోపికుంటె పొండు జిలేబీ

ఇన్నయ్య ఎవరు ?

కం. ఇన్నయ్య హేతువాదుల
కన్నయ్యే హైందవంబు నంతంచెయ్యా

లన్నదె ఆయన ధ్యేయం
బెన్నటికిని మారజాల డితడు జిలేబీ
   

కం. పళ్ళున్న చెట్లమీదే
రాళ్ళుగదా హేతువాద రాకాసి జనం
నోళ్ళన్నీ వేదనిందకు
పళ్లికిలిస్తాయి బాధ పడకు జిలేబీ

మ్యాచు ఫిక్సింగు !

కం. ఓడుతు పోతున్నారని
 వాడల వాడలను తిట్ల వర్షాలాయే
 నేడొకటి గెలవగానే
 తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ

కాపీ 'రైటు' జన్మ హక్కు

కం. కాపీ కొట్టే రైటుకె
కాపీరై టనెడి పేరు ఖాయం ఐతే
కాపీ పిల్లుల తప్పా
పాపం మన పాలు వారి పాలు జిలేబీ

సిగ్గే సింగారం

కం. సిగ్గేమిటి బేహారికి
సిగ్గేమిటి హంతకునకు సినిమా నటికిన్
సిగ్గేమిటి మరి నేతకు
సిగ్గేమిటి సిగ్గు పడును సిగ్గు జిలేబీ

నడక-నడత

కం. నడకలు కుదురుగ నుండిన
పడకుండగ నరుడు బ్రతుకుబాటను నడచున్
గడబిడ పడి వడిపెంచిన
పడుటయు చెడుటయును గల్గు వసుధ జిలేబీ

కం. నడకలు నేర్పెడు పెద్దలు
నడతలు నేర్పించ నెదురు నడచును మరియున్
కొడుకులు కూతుండ్రకు తా
నడతలు నేర్పించ గోరు నరుడు జిలేబీ

 గారెల పాకం

కం. పాకం గారెలు చేస్తే
నాకం కనిపించవచ్చు నాకూ మీకూ
పాకం చేస్తే గారెలు
ఆకలి చచ్చేది ఖాయమగును జిలేబీ

పంచ దశ లోకం

కం. పదునైదవ లోకం బె
య్యది మరి యటనుండు వారి యాకృతి గుణసం
పద లెట్టులుండు నోహో
అది అంతర్జాలలోక మగున జిలేబీ

'గ' మకం !

కం. నిందార్ధంబున నాంధ్రము
నందున నామ్రేడితమును నాపైన గిగీల్
చిందులు వేయును మరి యా
నందార్ధము సూత్ర మేది నడచు జిలేబీ

పాత పచ్చడి

శొ, పాతది యగుచో నేమగు
పాతది యగు చింత కాయ పథ్యం బనగా
తాతలనుండి ప్రసిధ్ధం
బీతరమున మెచ్చకున్న నేమి జిలేబీ

***

టపాకీకరణం
జిలేబి

Wednesday, February 8, 2012

చింతన చైతన్యం సృష్టి

చింతన చైతన్యం సృష్టి

ఒక ఆలోచన స్రవంతి ఐ మేధస్సుని మదించి
చైతన్యాన్ని కలుగ జేస్తే
ఆ చైతన్యం ఉత్తేజాన్ని పుంజుకుని కార్య సాధనలో
సఫలీకృతమై తే -
అందులోనించి ఉద్భవం - సృష్టి

ఆ సృష్టి కాలం పరిమితం - దాని వైశాల్యం పరిమితం
కాని దాన్ని సృష్టించిన చైతన్యం, ఆలోచన అపరిమితం

సృష్టి కి మూలకారణం చైతన్యం, ఆ చైతన్యానికి మూల కారణం ఆలోచన ఐతే
మరి ఆ ఆలోచనకి మూల కారణం ఏమిటి ?


జిలేబి.

Tuesday, February 7, 2012

మియాపూర్ లొ జిలేబి - ప్రస్తుత ప్రసంగం !

12-02-2012 (ఆదివారం) నాడు
 మియాపూర్

జయప్రకాశ్ నారాయణ్ నగర్

హైదరాబాద్

శ్రీ వేంకటేశ్వరస్వామివారి కోవెల ప్రాంగణంలో

మధ్యాహ్మం 3 గంటల నుండి


శ్రీ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారి


అష్టావధానం


జిలేబి  (ప్రస్తుత ప్రసంగం!)

Monday, February 6, 2012

ఇడ్లీ గిడ్లీ - సాంబార్ గీంబార్ అనబడే చిత్తూరోళ్ళ కథ

జంబూద్వీపే భరతః వర్షే భరతః ఖండే మేరోహో పర్వతే దక్షిణే పార్స్వే ఆంధ్ర రాజ్యే రాయలసీమే చిత్తూరు జిల్లాయాం ....

హమ్మయ్యా! ప్రవర అయ్యింది కాబట్టి ఇంక టపా రాసుకోవచ్చన్న మాట !

అయినా చిత్తూరు జిల్లా దాకా వచ్చేసాక , చిత్తూరు మాండలీకం గురించి రాయక పొతే ఎలాగంటారూ?


ఈ చిత్తూరు గ్రామాలలో మా ఫ్యామిలీ  ఉన్నప్పుడు చిత్తూరు కి సంబంధించిన స్పెషల్ భాష ని గమనించడం జరిగింది. అదే టపా , గిపా మేటరూ, గీటరూ! 

అంటే 'గ ' భాష అన్నమాట.

హోటెల్ కి వెళితే ఏదో ఇడ్లి ఉందా అని అడగకుండా మేము అడిగే తీరు ఎలా అంటారా? -

"ఏమిబా ఇడ్లీ గిడ్లీ ఏదైన ఉందా? ఉంటె గింటే ఓ రెండు ప్లేట్లు పట్టుకురా "

ఆట్లాగే "సాంబార్ గీంబార్" అన్న పదం చాలా తరచుగా వినొచ్చు.

నాకు తెలిసనంత వరకు రాయల సీమలో చిత్తూరు లో ని  ఈ "గ " భాష చిత్తూరు పరిసర ప్రాంతాలకే పరిమితమనుకుంటా.


ఈ "గ" భాష ఎంత పాపులర్ అంటే ఆస్సాము దేశంలొ పని చెసేటప్పుడు ఓ అస్సామీ ఆసామీ - తను పూర్వ కాలం లో  చిత్తూరు లొ పని చేసే డట , 

నాకున్న చిత్తూరు పరిచయాన్ని తెలుసుకొని "ఏమండీ మేడం, గీడం, జిలేబీ, గిలేబీ ,ఇడ్లి గిడ్లీ ఏమన్నా టిఫనూ, గిఫనూ చెయ్యడం మీకు వచ్చా గిచ్చా " అన్నాడు!

వార్నీ ఈ "గ" భాష ఇంత పాపులర్ అన్న మాట అని అప్పుడే తెలిసింది.

సో, ఈ పూటకి గీటకి ఈ టపా గిపా ఇంతే బా !


ఛీర్స్
జిలేబి.

(మా ఎం హెచ్ ఎస్ గ్రీమ్స్పేట్  రామకృష్ణ గారు చిత్తూరు వైద్యుల టపా రాసి చిత్తూరి జ్ఞాపకాల పుట్టని కదిలించారు )