Thursday, February 9, 2012

తాళాలు విరగ్గొట్టండి ! (సవాలే సవాల్ !)


మా తాతయ్య కాలం లో (ఇప్పుడు మేమూ ఆ కాలానికే వచ్చేసాం అది వేరే విషయం!) మా ఇంట్లో గూట్లో ఓ పెట్టె ఉండేది. గూట్లో పెట్టేమిటీ అంటారా సవివరం గా చెబ్తాను.

మా నడిమింటి హాల్లో నించి మిద్ద పైకి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. వాటి కింద ఓ పాటి గూటి లా ఓ ప్రదేశం ఉండేది. ఆ గూట్లో ఓ పురాతన చెక్క పెట్ట మా తాత గారిది ఉండేది. దాంట్లో వారేమో వారు కొన్న కొత్త కొత్త ఆ కాలపు (అంటే బ్రిటిషు కాలపు అన్న మాట ) గడియారాలు ఎలెక్ట్రిక్ సామాన్లు అట్టి పెట్టె వారు. ఆ పెట్టె కో తాళం కూడా భద్రం గా వేసి పెట్టె వారన్న మాట .

మా ఇంటి కాంతా జనావళికి వాటి మీద ఓ గుర్రు వుండేది. ఆ పెట్టెలో ఉజ్జాయింపుగా ఏమి ఉంటుందో తెలుసు గాని, మా తాతయ్య గారు ఆ పెట్టె ని తెరిచి మాకు చూపించనే చూపించరు. అందువల్ల వచ్చిన గుర్రు అన్న మాట అది.

ఇక తాతయ్య గారైతే అప్పుడప్పుడు మమ్మల్ని బయటకెళ్ళి ఆడుకొండ్రా బడుద్దాయిలూ అని గెంటేసి ఆ పెట్టె ని అప్పుడప్పుడు తెరిచి చూడడమూ, ఆ పై ఆ పెట్టి కి గోళ్ళం పెట్టి తాళం వెయ్యడమూనూ జరుగు తూండేది తప్పించి మేము ఎప్పుడూ ఆ పెట్టె లో ఏముందో (అంటే పూర్తి గా అన్న మాట) చూసిన ది లేదు !

కాక పోతే ఆ పెట్టె ఆయన అంత బద్రం గా తాళం పెట్టడం మాకు  ఉత్సుకతని కలిగించేది. ఆ పెట్టె తాళం ఎలా పగల గొట్టాలబ్బ అని అన్న మాట.

ఇక మా కాలానికి వస్తే మా అబ్బాయి మా మనవడు కంప్యూటరు ఎక్కువ గా ఉపయోగించకుండా ఉండడానికి తాళాలు పెట్టడం మొదలెట్టాడు. మనవడు కూడా తాడి తన్నే వాడి తల తన్నాలన్నట్లు వాళ్ళ నాన్న పెట్టిన తాళాలని విడగొట్టడం అన్న ఉద్యమం మొదలెట్టి అందులో నిష్ణాతుడై ఓ మారు వాళ్ళ నాన్నకే ఎదురు ఫిట్టింగులు ఇచ్చాడు అంటే , తనే ఒక తాళం పెట్టే డన్న మాట.

ఈ విషయం లో వాడి కెందుకో ఈ బామ్మ అంటే మమకారం. తాళం పెట్టినా బామ్మా , నీకు మాత్రం తాళం రహస్యం చెబ్తా నాన్నారికి తెలియనివ్వకు,  నీకు కంప్యూటరు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు తాళం తీసి  ఉపయోగించుకో. ఆ తరువాత ఆఫ్ చేసెయ్యి. ఈ తాళం చెవి మాత్రం నాన్నారి చెవి కి పోనివ్వకు అని చెప్పేడు.

నాకాశ్చర్యం వేసింది. మా కాలం లో తాత వాళ్ళ తాళం ఎలా విరగ్గోట్టాలా అని మేం ఆలోచించే వాళ్ళం. ఇప్పటి తరం లో నాన్నారి తాళం ఎలా విరగ్గోట్టాలా అని వీళ్ళు షెర్లాక్ హోమ్స్ మొదలెట్టారు సుమా అని.

మొత్తం మీద ఈ కాలపు కుర్ర కుంకాల తో మంచి గా ఉండటం మనకే మేలు అన్న ఓ ఫైనల్ నమ్మకానికి వచ్చేసాను నేనైతే. మనం ఎంత  బుర్ర లేని మట్టి   బుర్రలని వాళ్లకు నమ్మకం వస్తే వాళ్ళు మనకు అన్ని తెకినీకులు సులభం గా అర్థం అయ్యే లా చెప్పేస్తారని నా కనిపించింది.

హన్నా, భావి తరం భాగ్య విధాతల్లారా, ఈ బామ్మ మీద మీరు దయ బెట్టి ఈలాంటి తెకినీకులు నేర్పిస్తూ ఉండండి, రాబోయే కాలం లో (పుట్టీ గిట్టీ పుడితే ) మీ ఋణానుబంధం తప్పక తీర్చేసు కుంటాను. అప్పటికి మీకన్నా నాకే ఎక్కువ తెలిసి ఉంటుంది కదా !

(Hopefully always the future generation is brighter than the past !!)

(future)
జీనియస్
జిలేబి.

9 comments:

  1. అలాగేనండీ బామ్మగారూ :)

    ReplyDelete
  2. కం. మునువచ్చు చెవుల కన్నను
    వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
    మొనదేరి ధృడత నుండవె
    మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ

    ReplyDelete
  3. తాతలూ తెలియవైన వాళ్ళే, మనమళ్ళూ తెలివైన వాళ్ళే...మధ్యలో నాన్నారులే అటూ పెద్దరికానికీ ఇటూ మమకారానికి మధ్య పోకచెక్కలు..ప్చ్

    ReplyDelete
  4. మొన్నే ఓ సంఘఠన. నా account settings పాడుచేయకుండా ఉంచడానికి, మా వాడికో account create చేశా. వాడూ మీ తాతగారిలా, మహా భద్రంగా దాచుకున్నాడు - వాడి password. ఏదో పనిబడి - ఎందుకో వాడి password ఒక సంధర్భంలో అడగాల్సి వచ్చింది. కాస్తంత అయిష్టంగా చెప్పేశాడు. ఏం పుట్టిందో ఉన్నట్టుండి ఒక రోజు - నా password ఏంటని అడిగాడు. అంత అవసరమేమిటి అని అడిగా. ఇక చూడండి మొహం మాడిపోయిందీ! అలిగాడు. తనంటే, నాకు ఇష్టం లేదా - అని ప్రశ్నించే వరకూ వెళ్ళాడు. వామ్మో! ఈ emotional blackmail ఎందుకురా బాబూ అని చెప్పేశా. వాడు నన్ను నమ్మి చెప్పాడు కదా, అందుకే నేను వాడిని నమ్మి చెప్పాలన్న మాట. కానీ పాపం ఎప్పుడూ, నా account లోకి login అవ్వలేదు. నాకెలా తెలుసంటారా? నేను చెప్పింది తప్పు password కాబట్టి...

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. మీ పోస్ట్ చదివాక, చిన్న స్కిట్ రాయాలని అనిపిస్తోంది,

    పిల్లాడు: బ్లాగు చూసుకుని ఒకటే బడాయి పోతోంది. ఇవ్వాళ బ్లాగర్ అకౌంట్ హాక్ చేసి, దాన్ని డిలీట్ చేస్తా నాన్నా.

    పిల్ల: ఒరే, నీకు మమ్మీ పాస్ వర్డ్ తెలుసా?

    పిల్లాడు: పెద్ద కంప్యూటార్ నాలెడ్జ్ లేదుగా, నీ పేరో, నాపేరో పెట్టి ఉంటుంది.

    తాళం ఊడి రాలేదు.

    పిల్లల తండ్రి: నా పేరు ట్రై చెయ్యండి.

    రాలేదు.

    పిల్లలు: నాన్నా, ఎంత ఆశా జీవివి.

    నేను ఎంటర్ అయ్యాను

    నేను: నాన్నా (అదేదో సిన్మాలో రజనీ కాంత్ అన్నట్లు) మీరిలాంటి పని చేస్తారనే, పాస్ వర్డ్ మా అమ్మమ్మ బాయ్ ఫ్రెండ్ పేరు పెట్టాను. మా అమ్మమ్మ పైకెళ్ళి చాలా కాలం అయింది కనక నాకు తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు.

    తండ్రి: ఏమిటీ ? అమ్మమ్మకు బాయ్ ఫ్రెండ్ ఒకడా?

    నేను: ఒకడేవిటీ, మా వైపు వాళ్ళను అలా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదు

    ReplyDelete
  7. అన్ని కాలాలలోనూ తాళాలు ఒకేలా ఉండవని నిరూపించడం జరిగింది..... :-)

    ReplyDelete
  8. @ఇండియన్ మినర్వా గారు,

    నెనర్లు ! (మనవడా అనను ! అంటే తంటా లు వచ్చును !)


    @శ్యామలీయం వారు,

    నెనర్లు జిలేబీయానికి !

    @జ్యోతిర్మయీ గారు,

    మా బాగా చెప్పేరు! మధ్యలో నాన్నారులు బకరాలు అయ్యేరు !

    @తెలుగు భావాలు గారు,

    మీరు మరీ గడుసు వారే ! హన్నా, పాస్వార్డ్ తప్పుగా చెప్పరా ! ఆ బుడతడు తప్పైన పాస్వార్డ్ తో ప్రయత్నించి లాగిన్ లాక్ చెయ్యలేదా ! ఇది నమ్మబుల్ సత్యమేనా! నమ్మబుల్ అయితే వాడూ మన పార్టీ యే!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. చందు ఎస్ గారు,

    స్కిట్ అదురహో! వెంటనే మరో టపా పెట్టాల్సిందే మీరు "మా అమ్మమ్మ (బామ్మ అంటే కొంత రిథమిక్ గా ఉంటుందను కుంటా! ) అండ్ హర్ బాయ్ ఫ్రెండ్స్!" అని !

    ఇక టపా వెంటనే హాట్ టపా టాపిక్ అవుతుంది!!

    (ఆ టపా పేజీ మీరు ఖాళీ గా పెట్టినా కూడాను !!)

    నెనర్లు
    @మాధవి గారు,

    నెనర్లు. తాళాలు వేరైనా తంటాలు ఒకటే నయా అని వేమన గారు చెప్పారండీ ! (చెప్పక పోయినా చెప్పెరనాల్సిందే!)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete