Thursday, February 9, 2012

జిలేబీ శతకం - 3

జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***

కామెంటు ఉత్ప్రేరకం

కం. రమ్మా చక్కని కామెం
ట్లిమ్మా నీ రాక లేక లేఖిని ఆగే
నమ్మా జిలిబిలి పలికుల
కొమ్మా కందాలనందు కొనుమ జిలేబీ

ఉపకారం

కం. ఉపకారవ్యసనులతో
నెపమిడి పదిపనులు కొనగ నేర్చెడు వారే
ఉపకారమడుగ బోయిన
నపవాదులు వేయు వార లవని జిలేబీ

కం. అపకారుల కుపకారము
విపరీతఫలంబునిచ్చు విమతుల నటులే
యుపకార బుధ్ధి విడచుట
నెపమై దాస్యమున కూలె నేల జిలేబీ

కం. మొగమోటమి గలవారిని
పొగడిన పని జరుగు ననుచు పోగగు వారల్
మొగ మైన జూప రావల
తగు జాగ్రత వలన చిక్కు తప్పు జిలేబీ

ఊరికి బాసట

కం. ఊరికి బాసట యగుచో
నూరక నోరార పొగడు నోళ్ళకు కొదవే
వారల యందే యొక్కరు
రారుసుమా మనకు నక్కరైన జిలేబీ

కం. ఆ యింటి మామిడాకులు
వే యిండ్లకు తోరణాలు మరి యేటేటా
కాయలు పచ్చళ్ళకు దయ
చేయించు పరోపకార జీవి జిలేబీ


ఇరుకు జీవితాలు

కం. ఇళ్ళిరుకులు గుళ్ళిరుకులు
పల్లెలు పోటెత్తి రాగ పట్నా లిరుకుల్
బళ్ళిరుకు మనసులిరుకులు
కల్లలతో బ్రతుకులిరుకు కలిని జిలేబీ


'వి' గ్రహాలు

కం. పడి పోయిన పడ నుండిన
పడి లేచిన విగ్రహాల బాధలు చూస్తూ
మిడికే నేతల బొమ్మలు
పొడమును పడిపోవు నటులె పుడమి జిలేబీ

ప్రవీణు శర్మ

కం. నేరక ప్రవీణు శర్మకు
మీరు జవాబిచ్చి గాని వివరించారో
వారింక మిమ్ము వదలరు
పోరాడే యోపికుంటె పొండు జిలేబీ

ఇన్నయ్య ఎవరు ?

కం. ఇన్నయ్య హేతువాదుల
కన్నయ్యే హైందవంబు నంతంచెయ్యా

లన్నదె ఆయన ధ్యేయం
బెన్నటికిని మారజాల డితడు జిలేబీ
   

కం. పళ్ళున్న చెట్లమీదే
రాళ్ళుగదా హేతువాద రాకాసి జనం
నోళ్ళన్నీ వేదనిందకు
పళ్లికిలిస్తాయి బాధ పడకు జిలేబీ

మ్యాచు ఫిక్సింగు !

కం. ఓడుతు పోతున్నారని
 వాడల వాడలను తిట్ల వర్షాలాయే
 నేడొకటి గెలవగానే
 తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ

కాపీ 'రైటు' జన్మ హక్కు

కం. కాపీ కొట్టే రైటుకె
కాపీరై టనెడి పేరు ఖాయం ఐతే
కాపీ పిల్లుల తప్పా
పాపం మన పాలు వారి పాలు జిలేబీ

సిగ్గే సింగారం

కం. సిగ్గేమిటి బేహారికి
సిగ్గేమిటి హంతకునకు సినిమా నటికిన్
సిగ్గేమిటి మరి నేతకు
సిగ్గేమిటి సిగ్గు పడును సిగ్గు జిలేబీ

నడక-నడత

కం. నడకలు కుదురుగ నుండిన
పడకుండగ నరుడు బ్రతుకుబాటను నడచున్
గడబిడ పడి వడిపెంచిన
పడుటయు చెడుటయును గల్గు వసుధ జిలేబీ

కం. నడకలు నేర్పెడు పెద్దలు
నడతలు నేర్పించ నెదురు నడచును మరియున్
కొడుకులు కూతుండ్రకు తా
నడతలు నేర్పించ గోరు నరుడు జిలేబీ

 గారెల పాకం

కం. పాకం గారెలు చేస్తే
నాకం కనిపించవచ్చు నాకూ మీకూ
పాకం చేస్తే గారెలు
ఆకలి చచ్చేది ఖాయమగును జిలేబీ

పంచ దశ లోకం

కం. పదునైదవ లోకం బె
య్యది మరి యటనుండు వారి యాకృతి గుణసం
పద లెట్టులుండు నోహో
అది అంతర్జాలలోక మగున జిలేబీ

'గ' మకం !

కం. నిందార్ధంబున నాంధ్రము
నందున నామ్రేడితమును నాపైన గిగీల్
చిందులు వేయును మరి యా
నందార్ధము సూత్ర మేది నడచు జిలేబీ

పాత పచ్చడి

శొ, పాతది యగుచో నేమగు
పాతది యగు చింత కాయ పథ్యం బనగా
తాతలనుండి ప్రసిధ్ధం
బీతరమున మెచ్చకున్న నేమి జిలేబీ

***

టపాకీకరణం
జిలేబి

8 comments:

  1. ఒక్క పద్యాన్ని ఎంచి ఇది బావుందీ అని చెప్పలేని విధంగా ఉన్నాయి. ఒక్కో పద్యం ఒక్కో ఆణిముత్యం మరి.

    ReplyDelete
  2. జిలేబీగారూ చిన్నచిన్న సవరణలు:
    ఇన్నయ్య ఎవరు ?
    కం. ఇన్నయ్య హేతువాదుల
    కన్నయ్యే హైందవంబు నంతంచెయ్యా <---
    లన్నదె ఆయన ధ్యేయం
    బెన్నటికిని మారజాల డితడు జిలేబీ <--

    వాటి పాలు --> వారి పాలు

    జ్యోతిర్మయి గారూ, ధన్యవాదాలు. చదువరులకు నచ్చితే పద్యాలు పండినట్లే.

    ReplyDelete
  3. @జ్యోతిర్మయి గారు,

    నెనర్లు. credit goes to shri shyaamaleeyam vaaru !

    జిలేబి
    @శ్యామలీయం వారు,

    మీరు చెప్పిన సవరణలు చేసాను. సరి చూడ గలరు.

    ధన్యోస్మి !

    జిలేబి.

    ReplyDelete
  4. జిలేబి గారి సంకలనం వలనా జ్యోతిర్మయి గారి మెప్పు వలన ధన్యడనయ్యాను!

    ReplyDelete
  5. పద్యమా..మజాకా.. పాఠ్య పుస్తకాలు గుర్తుకొస్తున్నాయి.బాగున్నాయి జిలేబీ గారు. శపధం చేసి శతకం ఇస్తారా..ఏమిటీ?

    ReplyDelete
  6. మీ సాహిత్యాన్ని అర్ధం చేసుకొవడానికి సాహసం కూడా చేయలేను (నా వాల్ల కాదుగాబట్టి). ఒక్క మాట సాహిత్యమన్న, సంగీతమన్నా గౌరవము, అభిరుచి ఉంది.

    ReplyDelete
  7. మూర్తిగారూ, మీ వ్యాఖ్య నాకు చాలా విచారం కలిగించింది. నేను వాడుకకు దూరంగా ఉండే పదాలను యెంతో అవసరపడితే తప్ప వాడను పద్యాల్లో. అయినా మీకు కష్టంగానే ఉన్నాయి పద్యాలంటున్నారు! మీలా సాహిత్యాభిరుచి గలవారు సహితం "అర్ధం చేసుకొవడానికి సాహసం కూడా చేయలే" నంటున్నారంటే తప్పకుండా యేదో లోపం ఉండి ఉండాలి. దయచేసి తెలియ జేయ గలరని ప్రార్థిస్తున్నాను.

    ReplyDelete
  8. @వనజ వనమాలీ గారు,

    'స' పధం పట్టి శ్యామలీయం వారు శతకం సమకూరుస్తున్నారు !!

    అది వారి చలవే

    @డీ ఎస్ ఆర్ మూర్తి గారు,

    శ్యామలీయం వారి జవాబు చూడ గలరు. ( మీరు చెప్పినది జిలేబి కని నా ఊహ !)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete