Sunday, January 13, 2013

అమెరికా బుజ్జిపండు - ఆంధ్రా బుడుగు - భాగం 2


అమెరికా బుజ్జిపండూ - ఆంధ్రా బుడుగు - భాగం 1

(తరువాయి)

ఆ గుడారాల వైపు వెళుతున్న బుజ్జి పండుకి తన వెనుకే ఎవరో వస్తున్నట్టై అనిపించి తటాల్మని నిలిచాడు.

వెనుక వస్తున్న అడుగుల సవ్వడి కూడా ఆగి పోయింది.

కొంత సేపాగి మళ్ళీ నడక మొదలెట్టాడు బుజ్జి పండు. మళ్ళీ నడక సవ్వడి వెనుక నించి వినపడ్డది.

ఈమారు భయం పట్టుకుంది బుజ్జి పండుకి.
తన వెనుకే ఎవరో వస్తున్నారు.
తాను ఒంటరి గా ఉన్నాడు.
గుక్క పట్టి ఏడుపుని దిగ మింగు కుంటూ మళ్ళీ నిలబడ్డాడు.
అడుగుల సవ్వడి మళ్ళీ  మాయం..

ఈ మారు ఏడుపుని దిగ మింగు కుని వెనుక ఎవరోస్తున్నారో చూద్దామని తల కొద్దిగా తిప్పి చూసాడు.

గోచీ పెట్టుకుని తన ఈడు వాడె ఎవడో తన వెనుక ఉన్నాడు!

బుజ్జి పండు కి ఊరట కలిగి ధైర్యం వచ్చింది.  'whats your name? I am buzzi' చెప్పాడు బుజ్జి పండు ఈ మారు బ్రేవ్ గా.

ఆ వెనుక వస్తున్న గోచీ పెట్టిన బుడతడు అయోమయం గా చూసేడు. అర్థం కాలేదు బుజ్జి పండు ఏమన్నాడో అన్నట్టు నిలబడ్డాడు.

బుజ్జి పండు ఈ మారు తెలుగులో చెప్పాడు ' నీ పేరేంటి?'

ఈ మారు ఆ బుడతడు సన్నగా నవ్వి, 'నా పేరు 'అప్పల్సామీ' అన్నాడు.

'హి హి అని నవ్వ బోయి, నవ్వితే బాగోదనుకుని బుజ్జి పండు 'హాయ్ అప్పల్సామీ ' అన్నాడు చేయి చాపి.

అప్పల్సామీ నవ్వాడు స్నేహ పూర్వకం గా. 'ఎక్కడి కి పయనం? అడిగాడు

బుజ్జి పండు ఈ మారు విచారం గా ముఖం పెట్టేడు. 'నాది అమెరికా. నేనెట్లా ఇక్కడున్నానో నాకే తెలీలేదు'

'అమెరికా?  అదెక్కడ ఉందీ?' తెలీనట్టు అడిగాడు అప్పల్సామి వచ్చే నవ్వుని దాచుకుంటూ. బుజ్జి పండు అమెరికా అని సాగ దీసి చెప్పటం మరీ అతనికి నవ్వు తెప్పించింది.

బుజ్జి పండు ఈ మారు అప్పల్సామిని ఆశ్చర్యం గా చూసాడు. 'అమెరికా తీలిని వాళ్ళు కూడా ఉంటారా ' అన్నట్టు ముఖం పెట్టి,

'అమెరికా తెలీదా! నేనక్కడే ఉంటా చెప్పాడు బుజ్జిపండు.

అప్పల్సామీ తెలీనట్టు తలూపాడు అడ్డంగా.

'నేనెక్కడ ఉంటానో అదీ అమెరికా అన్న మాట. చెప్పాడు బుజ్జి పండు.'

'నువ్విప్పుడు ఇక్కడ ఉన్నావు. ఇది అమెరకా కాదే మరి ? అడిగాడు అప్పల్సామి.

 ' ప్చ్. కానీ నేనిప్పుడు ఎక్కడున్నానో నాకే తెలీటం లేదు. ఇంతకీ నేనెక్కడున్నానో మరి ' అప్పల్సామీ అన్న మాటలు అర్థం కాక చెప్పాడు బుజ్జి పండు.

'ఓ' చెప్పాడు అప్పల్సామి.

కొంత దూరం నడిచాక, మళ్ళీ అడిగాడు బుజ్జి పండు 'అప్పల్స్' అన్నాడు 'ఇదేమి సిటీ?'

'అప్పల్స్' ఎవరూ? అడిగాడు అప్పల్సామి.

'ఓ, మా ఊళ్ళో అందర్నీ 'షార్ట్' నేమ్తో పిలుస్తాం. అట్లా నిన్ను పిలిచా, అప్పల్స్ అని ' చెప్పాడు బుజ్జి పండు.

అప్పల్సామి నవ్వాడు 'అప్పల్స్! బాగుందే పేరు ' అనుకుని , అప్పల్స్, అప్పల్స్ అని నాలుగైదు మార్లు అనుకున్నాడు. 

'మీ ఊరి పేరేమిటి ? అడిగాడు బుజ్జి పండు ఈ మారు, సిటీ అంటే ఈ అప్పల్స్ కి తెలీదేమో అనుకుంటూ. అమ్మ చెప్పిందిగా చాలా మందికి తమ ఊరు తప్పించి వేరే ఏదీ తెలీదని అనుకుంటూ.

ఈ ఊరి పేరా ? అని ఒక్క నిమిషం ఆలోచించి చెప్పాడు అప్పల్సామి 'సత్పురం'

'సత్పురం! అబ్బా ఊరి పేర్లు ఇట్లా గూడా ఉంటాయా? మా ఊరి పేరేంటో తెలుసా ? టెక్సాస్ చెప్పాడు బుజ్జి పండు.

అప్పల్సామి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు , తెలీదన్నట్టు తలూపుతూ.

ఈ అప్పల్సామి కి ఏమీ తెలీదు. ఏదడిగినా తెలీదంటాడు మరి.' అని బుజ్జి పండు నిట్టూర్చి 'ప్చ్, అప్పల్సామి అమెరికా లో ఉంటే అసలు ఎట్లా బతుకు తాడో సుమీ? అమెరికా లో అందరికీ అన్ని తెల్సు మరి ' అని బాధ పడి పోయాడు.

'మరి ఆ గుడారాలేమిటీ?' దూరం గా కనిపించే గుడారాలని చూపిస్తూ అప్పల్సామిని అడిగాడు బుజ్జి పండు.

'ఆ గుడారాలా? అక్కడో స్వామీ వారు బెంగాల్ నించి వచ్చి ఉన్నారు. స్వామీ వివేకానందా అని ' చెప్పాడు అప్పల్సామి.

'ఓ, నాకు తెలుసు. మా అమ్మ చెప్పింది. స్వామీ వివేకానందా మా చికాగోలో ప్రపంచ సభ లో మాట్లాడారు కదా , వారి మాటలు మొత్తం నాకు కంటస్థం వచ్చు తెలుసా ?'  చెప్పాడు గర్వం గా బుజ్జి పండు.

ఫక్కున నవ్వాడు అప్పల్సామి. 'చికాగో నా అదేక్కడుందీ?'

'అప్పల్స్, నీకు చికాగో తెలీదా, పద, స్వామీ వారి తో నే చెప్పిస్తా నీకు చికాగో ఎక్కడోఅన్నాడు'

ఎక్కడుందో చికాగో మరి ? సీకాకులాన్ని చికాగో అంటున్నావా ?  అడిగాడు అప్పల్సామి నవ్వుతూ.

అంతట్లో వారి మాటల్లోనే ఆ గుడారాల దగ్గిరికి వాళ్ళు వచ్చేరు.

అప్పల్సామి బుజ్జి పండు ని స్వామీ వివేకానందా వారి ముందుకు తీసుకెళ్ళి, 'స్వామీ' ఈ అబ్బాయేదో అంటున్నాడు చూడండి మరి' అన్నాడు నమస్కరిస్తూ.

బుజ్జి పండు స్వామీ వారిని చూసేడు. అబ్బ ఆ ఫోటో లో చూసినట్టే ఉన్నాడు సుమా. నిండుగా ఉన్నాడు కూడాను అనుకున్నాడు.

స్వామీ వారు బుజ్జి పండు ని అప్పల్సామి ని మందస్మిత వదనార విందులై చూసారు.

ఆ క్షణం స్వామీ వారికి గాని, బుజ్జి పండు కి గాని తెలియని ఒక అపూర్వ క్షణం.

రాబోయే కొన్ని నెలల్లో స్వామీ వారు చికాగో కి వెళ్తారని అక్కడ వారి సంభాషణ కి మూలం ఈ 'ఫ్యూచర్ జనరేషన్' నించి కాల వాహిని లో పయనించి వచ్చిన బుజ్జి పండు కారణభూతుడు అవుతాడు అని వారికి తెలియని, ఒక్క అప్పల్సామి కి మాత్రమే తెలిసిన విషయం.

అప్పల్సామి నవ్వుతూ నిలబడ్డాడు.

స్వామీ వారి వెనుక గూడారం గోడకి ఓ కాలెండరు వేలాడు తోంది.

తారీకు అందులో 'January 12, 1893' అని  కనిపిస్తోంది.

(సశేషం)
జిలేబి.

No comments:

Post a Comment