జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు
గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.
***
రాబోవు కాలం
కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ
ఉపవాసం
కం. ఆరోగ్య మనుమతించిన
మేరకు నుపవాసదీక్ష మిగులహితంబౌ
తీరికగా నొక దినమున
శ్రీరమణుని గొలువనగును చేరి జిలేబీ.
'దండ' నాధా!
కం. దండను వేసిన చేతులు
దండంబును బెట్టినట్టి తరుణి కరంబుల్
ధండమ్మని చండికవలె
దండంబును తప్పకుండ దాల్చు జిలేబీ
దీవెనలు
కం. చాలవె యితిహాసంబులు
చాలదె మరి భాగవతము జదువగ హితమై
చాలదె పెద్దల దీవన
మేళులు చేకూర్చ మనకు వేగ జిలేబీ
జిలేబీ తెలుగు వ్యాఖ్య !
కం. నలభై పంక్తుల వ్యాసము
సులువుగ నా కర్థమాయె శోధించెడు నా
తల కెక్కక పొగరణచెను
కలనం తమ వ్యాఖ్య తెలుగు ఘనత జిలేబీ.
'టీతింగు' ట్వీటింగు !
కం. తాతకు కలిగే నకటా
టీతింగ్ ప్రోబ్లమ్స్ కొత్త త్రీజీ ఫోన్తో
యాతన పెట్టే టచ్ స్క్రీన్
చేతికి కళ్ళకును పనులు చెప్పె జిలేబీ.
కం. చిన్నప్పుడు పలకయె గద
యున్నది యని తాత మరచి యుండగ నకటా
నాన్నకు హైఫై పలకను
కొన్నాడు ప్రేమమీర కొడుకు జిలేబీ
బాపురే లవకుశ శ్రీ రామ రాజ్యం !
కం. చూడకనే పొగడుటయును
చూడకనే తెగడు టనెడు చోద్యములనగా
నేడుకదా కనిపించెను
వాడలవాడలను బాపు వలన జిలేబీ
కం. నాజూకుగ నను దిట్టిన
నా జుట్టును బట్టుకొన్న నచ్చని దానిన్
తేజోమయమని పొగడుట
నా జన్మకు వీలుపడదు నమ్ము జిలేబీ
కం. నా కేమో లవకుశ యును
మీకు శ్రీరామరాజ్యమే హితమగుచో
నా కెనిమిది వందలు పొదు
పై కనుబడు చుండె నేటి వరకు జిలేబీ
యా దేవీ సర్వ భూతేషు
కం. అమ్మాయి కథను చదివితి
నమ్మ దయాగుణము దలచి యానందముచే
చిమ్మెను కన్నుల నీరును
నిమ్మహి భగవతికి సాటి యెవరు జిలేబీ.
కం. ముత్తాతగారి ముచ్చట
లిత్తెరగున చదువుచుండ నెటనో మరి నా
చిత్తంబున విభ్రమమగు
నుత్తమమీ సౌఖ్యమనగ నొప్పి జిలేబీ.
కం. ముని మనుమరాలి ముచ్చట
మునుకొని యా మూగతల్లి ముచ్చటగా తం
డ్రిని తాతను ముత్త్తాతను చే
సిన ముచ్చట సంతసింప జేసె జిలేబీ.
కం. సంతోషంబుల నెరుగుట
సంతోషము నాకు నిట్టి సంతోషంబుల్
వింతలె యీ జన్మంబున
నింతకు ముందెరిగి యుందు నేమొ జిలేబీ.
కం. అందరు సంతోషంబున
నుందురు గా కెల్లవేళ నుల్లాసముగన్
చిందులు వేయగ శ్రీలా
నందముగా నందరిండ్ల ననెద జిలేబీ.
కాఫీ కాలం
కం. శివ శివ యనుచును కాఫీ
నెవరైనను చేయునెడల నీశ్వరకృపచే
నవలీలగ నమృతంబగు
చవితో లోకంబు లేల జాలు జిలేబీ.
కం. నీరసపడితే మంచి హు
షారిచ్చే పొగలసెగల చక్కని కాఫీ
సారందీయగ హాయిగ
ఊరికి పను లప్పగించు చుండు జిలేబీ
శతకం లెక్కలు
కం. ఇన్నని నియమము గలదా
యెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ.
యెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ.
టపాకీకారణం
జిలేబి
కొసమెరుపు జిలేబీయాలు !
శ్రీ కంది శంకరయ్య గారి జిలేబీయం
పతియె బ్లాగులోకమ్మున గతి తెలియక
మునిగియుండ జిలేబియై ముద్దు లొలుక
కొంటె కామెంట్లతో సదా వెంట నంటి
పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి.
మునిగియుండ జిలేబియై ముద్దు లొలుక
కొంటె కామెంట్లతో సదా వెంట నంటి
పతిని హింసించు కాంతయే పరమ సాధ్వి.
పురాణ పండ వారి జిలేబీయం
అందమైన సంగతులను
కందములుగ పద్యం కట్టి
నందున వానిని శతక
మందుము ముదమున జిలేబీ
కందములుగ పద్యం కట్టి
నందున వానిని శతక
మందుము ముదమున జిలేబీ
ఇతివృత్తములు భిన్నములు
నాతినలరించు విషయములు
యే తీరున దృశ్యీకరించుట
కత్తిపీటకేల దురద జిలేబీ
నాతినలరించు విషయములు
యే తీరున దృశ్యీకరించుట
కత్తిపీటకేల దురద జిలేబీ
శ్రీ లక్కాకుల వారి జిలేబీయం
కాదు పద్యమ్ము వ్రాయుటే ఘనత - కవికి
భావ పటిమయే ప్రతిభకు పట్టు గొమ్మ
భావ పటిమయే ప్రతిభకు పట్టు గొమ్మ
శ్రీ జిలేబికి కారాదు చేవ లేని
ఛందముల చట్రముల్ భావ బంధనములు
ఛందముల చట్రముల్ భావ బంధనములు
బ్లాగ్ లోక కవీశ్వరులకు ప్రణామములతో
జిలేబి.
కనీసం నూరూ పూర్తి కావటానికి నేనింకా ఒకటి రెండు పద్యాలు బకాయి ఉన్నానా జిలేబిగారూ?
ReplyDeleteలక్కాకులవారి పద్యం గమనించాను. ఒకటి రెండు విషయములు మనవి చేయవలసి యున్నది. మొదటిదేమనగా చేవ లేని ఛందముల చట్రములన్న దాని గూర్చి. కనీసము వేయేండ్లుగా బ్రతికియున్నచేవ ఛందములు చేవగలిగియుండుట చేతనే గదా నిలచియున్నవి. మరియును అవి చట్రములే యగుగాక స్థూలదృష్టికి, ఆ చట్రముల యందు ప్రాణప్రతిష్ట చేయగల పద్యములను సృష్తించగలకవికి యవి ప్రియములే యగును. రెండవ విషయమేమనగా ఛందములు భావ బంధనములుగా నుండుననుటను గూర్చిన శంకను గూర్చి. ప్రావీణ్యతలేనపు డే కళయైనను ప్రాణసంకటముగానే యుండును. అభ్యాసము వలన్ చేత నున్నట్టి కళకు మంచి రాణింపు వచ్చును. కాని బ్రహ్మ మనకు సహజముగా పుట్టుకతో నీయని కళను కేవలము అభ్యాసము చేత సాధించలేము. కొంత పరిచయమును సాధించ వచ్చును. మంచి పరిచయమును సాధించ వచ్చును. అంత వరకే. నాకు చిత్రకళ పట్ల ఆసక్తి మెండు. కాని నాకది పట్టు బడలేదు. కవిత్వము విషయమునకు వచ్చినచో ఆశువుగా చెప్పగలవారున్నారు కదా? మనకు పద్యవిద్య కష్టసాధ్యమైనచో అది ఆ విద్యయందలి నియమాదుల తప్పుగాదు. కొందరకు ఛందోనియమములు బంధనములు కావచ్చును - కొందరకు కాకపోవచ్చును. అది వారికి ఆ విద్య అబ్బెడు తీరుపై నుండును. కాని ఛందముల దోషము కాదు.
ReplyDeleteశ్రీ శ్యామలీయం గారు,
ReplyDeleteఅవునండోయ్, వందకి ఇక రెండే బకాయి !(వాయిదా వెయ్యకండి!)
చీర్స్
జిలేబి.
శ్రీ శ్యామలీయం మాష్టారు,
ReplyDeleteలక్కాకుల వారి పద్యములు హృద్యమైనవి. అదే నాకు వారి దగ్గిర కనిపించిన గొప్పదనం. తేట తెలుగుతో, చిన్ని పదబంధాల తో పెద్ద సత్యాన్ని ఆవిష్కరించడం భాష మీద మంచి పట్టు ఉంటేనే వీలవుతుంది. అది వారికి ఉందని నా అభిప్రాయం. పదుగురుకీ సులభం గా అర్థమయ్యే లా రాయడం వారికి అచ్చొచ్చిన విద్య !
ఇక ఆ పై పద్యం నా లాంటి మట్టి బుర్రలను కొంత ప్రోత్సహించ డానికి అలా అని ఉంటారని అనుకుంటాను.
జిలేబి.
లక్కాకులవారి పద్యమును గురించి మరికొన్ని విషయములు. కవికి పద్యమ్ము వ్రాయుటే ఘనత కాదన్నారు. వీరిట్లేల ననవలసి వచ్చినదో తెలియదు. కవి పద్యములు వ్రాయును. గద్యములును వ్రాయును. గేయాదులును వ్రాయును. ఒక్కొక సందర్భము ననుసరించి తగిన విధానముగా వ్రాయును. మరల కవి తగిన విధానమని యన్నది దానిని చదువువారిలో కొందరకు తగని విధానముగా తోచవచ్చును. కవి ప్రాథమికముగా తన యాత్మానందము కొరకు వ్రాయును. కాబట్టి కవి యేమను కొన్నాడన్నదే ముఖ్యము. కవి యిది చేయుట ఒక ఘనత యని భావించి చేయడు. కవి పుట్టు వెటువంటిదనగా వాని యంతరంగము వాని నది చేయు వరకు కుదురుగా నుండనీదు. లోకము దానిని ఘనమను గాక హీనమను గాక నతడట్లే చేయును. ఒక భావమును వెలిబుచ్చుటలో లక్ష పథ్థతులుండును. కవులగు వారి పథ్థతులు వారివి. మనము ఘనములనుకొన్నచో వారికి వచ్చెడునది లేదు. హీనమనుకొన్నచో పోయెడునది లేదు.
ReplyDeleteభావ పటిమయే ప్రతిభకు పట్టు గొమ్మ యని మరొక వాక్యము చెప్పినారు. ఇది కొంత తర్కించదగి యున్నది. నవనవోన్మేషశాలినీ ప్రతిభా యని నిర్వచనము. అనగా కొత్తచిగుళ్ళు వేయగల శక్తి యన్నమాట. అట్టి ప్రతిభాశాలియందు భావనాపటిమ రహించును. కాబట్టి ప్రతిభయే పట్టుగొమ్మ భావపటిమకు. పిండితార్థమేమనగా తొలుతగా భాసించునది ప్రతిభ యనునది. అదియున్నచోట భావములను శక్తివంతములుగా హృద్యములుగా చెప్పుట సంభవించును. కాబట్టి రాజారావుగారు పొరబడినారని తలంచెదను.
మరియొక విషయమేమనగా వారి యుద్దేశము శ్రీమతి జిలేబీగారు నిస్సారపద్యసంకలము నందు చిక్కుపడినారని కావచ్చును. ఇవి కేవలము చమత్కార పద్యములు. వీటిని వ్రాయుటకు నేను పడిన కష్ట మేమియును లేదు. నిఘంటు నిరపేక్ష్యమైన వీటిని చదువుటకు చదువరులు పడవలసిన కష్ట మేమియును లేదు. ముఖ్యముగా నివి వ్రాయుటకు కందపద్యనియమములు నాకు కలిగించిన సంకటము లేమియును లేవు. ఈ శతకమును సంకలనము చేయుట కేవలము ఒక సరదా విషయము. ఇందు నిమిత్తమై జిలేబీ గారికి శ్రమ కలిగినచో క్షంతవ్యుడను. కాని వారిది ఐఛ్చికముగ చేసిన సంకలనము.
ఇంత చర్చ తరువాత సారాంశ మేమనగా, ఈ పద్యము నా మనసునకు మిక్కిలి కష్టము కలిగించినది. ఈ లోకమునందు యెవరేది యొనరించినను దానిని తప్పనువారును వెక్కిరించువారును కొల్లలుగా నుందురు. సృష్టి లక్షణమే యటువంటిది కాబోలును. ఇంత చిన్న విషయమునకై భగవంతునితో పేచీ పడవలసిన పని లేదు. ఇది ఆయన సృష్టి - ఆయన ఇష్టము. నాకు శ్రీ రాజారావుగారితో కూడ పేచీ లేదు. వారి యభిప్రాయము వారిది. కేవలము నా తరపునుండి చెప్పవలసిన ముక్కలు నాలుగు చెప్పితిని. నేనొక కవిని కాకపోయిన గాని యిది యంతయు చెప్పుట యెందు కొరకనగా నా బోటి వారి వలన కవిలోకమునకు నిందలు వచ్చుట నాకు సమ్మతము కాదు కనుక. స్వస్తి.
ఆనందమ్,పరమానందమ్, బ్రహ్మానందమ్.
ReplyDeleteకం. బందమొ ముందరి కాళ్ళకు
ReplyDeleteనందముగా భావమమర నగు పరికరమో
ఛందం బనునది దేవుం
డందించిన శక్త్తి కొలది యగును జిలేబీ.
కం. ఛందములాడించునొ నను
ఛందంబుల తోడ నాడ జాలుదునో నే
నందముగా వ్రాయుదునో
యిందుకు కొరగానొ దేవు డెరుగు జిలేబీ
జిలేబి గారు శతాభినందనలు.
ReplyDeleteసో! ఇక్కడి కామెంటు యందలి పద్య ద్వయ రాత్నములతోడ సమస్తంబు కలిపి నూరయ్యేన్ !!
ReplyDeleteకాన ఇక నే నా పని మొదలు చేయ వలెనన్న?
వీనిని ఆలపించేడి వారి సాయం కోరుతున్న !
వ్రాసిన వాళ్ళు పాడేదరా ?
పద్యం రాయటం ఘనము పాడుట మరింత ఘనము
మా పాలంకి పాటి మాస్టారు వారు
ఎక్కడున్నారో కాని
నేను మా ఊరిలో ఉంటె వారిచే పాడించి record చేసే వాడిని
సరే !! ఎవరైనా సరే !!
పద్యాన్ని పద్యం లా (నా లా కాక )
పాడుటకు సుముఖులైతే తెలుప గలరు
sairam
?!